రేపు విచారణకు రానున్న ఓటుకు నోటు కేసు

0
312
‘సుప్రీం’ సమాచారమ్‌
రేపు విచారణకు రానున్న ఓటుకు నోటు కేసు
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 22 : ఓటుకు నోటు కేసు రేపు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడుకు ఊరట లభించేలా ఏపీ, తెలంగాణా రాష్ట్రాల ఉమ్మడి న్యాయస్ధానం ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈ నెల 9న సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటీషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఓటకు నోటు కేసులో చంద్రబాబు పాత్రకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు సమర్పించిన నేపధ్యంలో  ఈ కేసులో ఆయనపై దర్యాప్తు జరపాలంటూ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలంటూ ఏసీబి కోర్టు ఇటీవల ఆదేశించింది. అయితే ఓటుకు నోటు కేసులో  ఇప్పటికే దర్యాప్తు పూర్తయి అభియోగ పత్రం దాఖలు చేసిన కేసులో ప్రతిపక్ష  ఎమ్మెల్యే ఫిర్యాదును, దాని ఆధారంగా ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలంటూ చంద్రబాబు ఈ నెల 2న హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఈ నెల 2న ఏసీబీ కోర్టు ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలను నిలిపివేసి చంద్రబాబును విచారించాలని ఈ నెల 9న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తరఫున  రాజమహేంద్రవరానికి చెందిన సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అల్లంకి రమేష్‌ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎస్‌ ఎ బాబ్డే, అశోక్‌ భూషణ్‌లు విచారణ చేపట్టనున్నారు.