రేషన్‌ సరుకుల పంపిణీలో ఇబ్బందులు తొలగించాలి

0
151
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 5 : నగరంలోని అన్ని రేషన్‌ దుకాణాల్లోనూ వేలిముద్ర, ఐరిష్‌ నమోదు కాకపోయినా నామినీ ప్రకారం రేషన్‌ సరుకులను లబ్ధిదారులకు ఇవ్వాల్సిందేనని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) డిమాండ్‌ చేశారు. నగరపాలక సంస్థ పరిధిలోని 10వ డివిజన్‌ విఎల్‌ పురంలోని 79వ నెంబర్‌ రేషన్‌ దుకాణాన్ని ఆయన ఈరోజు స్థానికులతో కలిసి పరిశీలించారు. ఐరిష్‌ యంత్రం పనిచేస్తుందా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. అది పనిచేయకపోతే ఎలా సరుకులు ఇస్తున్నారని ప్రశ్నించారు. వేలిముద్ర పడకపోతే ఐరిష్‌ ద్వారా కళ్లు స్కాన్‌ చేసి రేషన్‌ సరుకులు ఇచ్చేవారని అయితే అవి కూడా చాలా మంది లబ్ధిదారులకు నమోదు కాకపోవడంతో ఈ సమస్యను తాను పౌరసరఫరాల శాఖ మండల సప్లయి అధికారి (ఎంఎస్‌ఓ) దృష్టికి తీసుకుని వెళ్లానని తెలిపారు. ఇదే విషయాన్ని రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌కు చెప్పడంతో ఆయన అదే రేషన్‌ దుకాణంలో సరుకులు తీసుకుంటున్న మరొక తెలిసిన లబ్ధిదారుడిని నామినీగా నమోదు చేసుకుని రేషన్‌ సరుకులు ఇవ్వాలని ఆదేశించడం జరిగిందన్నారు. రేషన్‌ దుకాణాల్లో ఐరిష్‌ వెర్షన్‌ను ప్రభుత్వం అప్‌డేట్‌ చేస్తుండటంతో రెండు నెలలుగా అవి పనిచేయడం లేదన్నారు. దీని వల్ల రేషన్‌ దుకాణాల చుట్టూ లబ్ధిదారులు ప్రదక్షిణలు చేస్తున్నా సరుకులు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని అన్ని రేషన్‌ దుకాణాల్లోనూ నామినీ విధానం ద్వారా రేషన్‌ సరుకులు అందచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వెంటనే స్పందించిన అలా చేయకపోతే అన్ని రేషన్‌ దుకాణాల ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వేలిముద్ర, ఐరిష్‌ పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చూడాలని పౌరసరఫరాల శాఖాధికారులను కోరారు. ఆయన వెంట మాజీ డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, స్థానిక నాయకులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here