రైతన్నలకు భరోసాగా బ్యాంకు ఆఫ్‌ బరోడా

0
94
అధిక దిగుబడి, ఆధునిక పరిజ్ఞానంపై అవగాహన కార్యక్రమాలు
రైతు పక్షోత్సవ సంబరాల్లో చీఫ్‌ కో-ఆర్డినేషన్‌ జనరల్‌ మేనేజర్‌ బిఆర్‌ పటేల్‌
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 11 : దేశంలో రైతన్నలకు భరోసాగా బ్యాంకు ఆఫ్‌ బరోడా నిలుస్తుందని, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని సాధించేందుకు రైతులకు కావాల్సిన ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నట్లు బ్యాంకు ఆఫ్‌ బరోడా చీఫ్‌ కో-ఆర్డినేషన్‌ జనరల్‌ మేనేజర్‌ బిఆర్‌ పటేల్‌ అన్నారు. ప్రపంచ ఆహార దినోత్సవమైన అక్టోబర్‌ 16వ తేదీని పురష్కరించుకుని దేశవ్యాప్తంగా బ్యాంకు ఆఫ్‌ బరోడా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు పక్షోత్సవ సంబరాల్లో భాగంగా ఈరోజు స్థానిక ఆనం కళాకేంద్రంలో బరోడా రైతు దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పటేల్‌ తొలుతగా జ్యోతిప్రజ్వలన చేసి రైతు దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన రైతులు, మహిళా శక్తి సంఘాలకు చెందిన ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడారు. దేశంలో లీడింగ్‌ బ్యాంకుగా బ్యాంకు ఆఫ్‌ బరోడా నిలిచిందన్నారు. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతీ ఏటా దేశవ్యాప్తంగా ఉన్న 9,505 బ్యాంకు శాఖల ద్వారా రైతులకు భరోసా ఇచ్చే కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా రైతులకు మేలు చేసే కార్యక్రమాల్లో భాగంగా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని సాధించేందుకు అవసరమైన ఆధునిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయని, ఆయా మార్పులను బ్యాంకు ఆఫ్‌ బరోడా అందిపుచ్చుకుని రైతులకు అవసరమైన రీతిలో సహాయ సహకారాలను అందిస్తుందన్నారు. అలాగే ఆయా రైతులకు చెందిన భూములకు భూసార పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతు ఆరోగ్యంగా ఉంటేనే దేశ ప్రజలు మరింతగా ఆరోగ్యవంతమైన జీవనం సాగిస్తారన్నా సంకల్పంతో పక్షోత్సవాలను పురష్కరించుకుని రైతులకు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి వివిధ పరీక్షలను నిర్వహించే కార్యక్రమాలను తలపెట్టినట్లు తెలిపారు. రైతులకు అవసరమైన రుణాలను అందించడంతోపాటు, వ్యవసాయానికి అవసరమైన సాంకేతికపరమైన పరికరాలను అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే మహిళా స్వయం శక్తి సంఘాలకు చెందిన మహిళలకు రుణాలను అందిస్తున్నామని తెలిపారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఏదైనా వ్యాపారానికి వినియోగించినట్లు అయితే ఆ వ్యాపారం ద్వారా వచ్చే లాభాలతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉందన్నారు. ఆ దిశగా మహిళా శక్తి సంఘాలు అడుగులు వేయాలని సూచించారు. ఆవిధంగా రైతులు, మహిళా శక్తి సంఘాల ప్రతినిధులు ఉత్తమమైన ఫలితాలు సాధించడానికి బ్యాంకు ఆఫ్‌ బరోడా దోహదం చేస్తుందన్నారు. ఈ సభలో బ్యాంకు ఆఫ్‌ బరోడా హైదరాబాద్‌ జోన్‌ జనరల్‌ మేనేజర్‌ పి.శ్రీనివాస్‌, విశాఖ రీజియన్‌  రీజనల్‌ హెడ్‌ శైలేంద్ర కుమార్‌ సింగ్‌ తదితరులు మాట్లాడారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here