రోడ్డు ప్రమాదంలో పంచాయితీ ఉద్యోగి దుర్మరణం

0
67
కవలగొయ్యి సెంటర్‌లో వేకువజామున విషాదం
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 4 : కవలగొయ్యి సెంటర్‌లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజమహేంద్రవరం రూరల్‌ పిడింగొయ్యి గ్రామ పంచాయతీ జూనియర్‌ అసిస్టెంట్‌ (గుమస్తా గ్రేడ్‌-1)గా పనిచేస్తున్న గొనగొళ్ల తోటబాబు (42) దుర్మరణం పాలయ్యారు. ప్రస్తుతం ధవళేశ్వరం గ్రామంలో నివాసం ఉంటున్న ఆయన రోజు వారీ విధుల్లో భాగంగా పంచాయతీలో సిబ్బంది మస్తర్లు పరిశీలించి తన ద్విచక్ర వాహనంపై పంచాయతీ కార్యాలయం నుంచి ఉదయం 6.30 గంటల సమయంలో తిరిగి వస్తుండగా కవలగొయ్యి సెంటర్లో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఆయన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన వాహనం ఆగకుండా వెళ్లిపోవడంతో అది కారా? లారీయా ? అన్న విషయం తెలియడం లేదు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పంచాయతీ రాజ్‌ శాఖలో వివిధ ¬దాల్లో గత 20 సంవత్సరాలుగా తోటబాబు విధులు నిర్వర్తిస్తున్నారు. సీతానగరం మండలం సింగవరం ఇన్‌చార్జ్‌ పంచాయతీ కార్యదర్శిగా, చినకొండేపూడి జూనియర్‌ అసిస్టెంట్‌గా, రాజమహేంద్రవరం రూరల్‌ బొమ్మూరు జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసారు. మూడు నెలల కితం పిడింగొయ్యి పంచాయతీ జూనియర్‌ అసిస్టెంట్‌గా బదిలీపై వచ్చారు. అందరితో సౌమ్యంగా మెలుగుతూ అంకిత భావంతో విధులు నిర్వర్తించే తోటబాబు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్న విషయం తెలుసుకున్న పంచాయతీల సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇన్‌చార్జ్‌ ఇఓపిఆర్‌డి రూప్‌చంద్‌, వైఎస్‌ఆర్‌ సిపి నాయకులు నిచ్చెనకోళ్ల సుబ్బారావు, బొప్పన సుబ్బారావు తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే తోటబాబును మంగళవారమే పిడింగొయ్యి గ్రామపంచాయతీకి ఇన్‌చార్జ్‌ కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. చార్జ్‌ తీసుకున్న మరుసటి రోజే ఈ ఘటన జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆయన మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబాన్ని పోషించే నాధుడు కరువవ్వడంతో వారి రోధనలు మిన్నంటాయి. పంచాయతీల కార్యదర్శులు, సిబ్బంది ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకుని తోటబాబు మృతిపట్ల సంతాపం వెలిబుచ్చారు. బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here