రోల్‌మోడల్‌గా ఇఎస్‌ఐ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తాం

0
110
వంద పడకలతో సూపర్‌ స్పెషాలిటీ సేవలకు కార్యాచరణ : ఎం.పి. భరత్‌
రాజమహేంద్రవరం, నవంబర్‌ 23 : ఇఎస్‌ఐ ఆసుపత్రిని రాష్ట్రంలోనే రోల్‌మోడల్‌గా అభివృద్ధి చేస్తామని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ వెల్లడించారు. రాజమహేంద్రవరం ఇఎస్‌ఐ ఆసుపత్రి పరిస్థితి చాలా దారుణంగా ఉందని పూర్తిగా శిథిలమై కార్మికులకు, వారి కుటుంబాలకు సేవలందించేందుకు ఇబ్బందిగా మారిందని వైసిపి పార్లమెంటరీ పార్టీ చీఫ్‌విప్‌, ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన పేపరుమిల్లు ఎదురుగా ఉన్న ఇఎస్‌ఐ ఆసుపత్రిని సందర్శించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. అదే స్ఫూర్తితో నాడు-నేడు అన్నట్టుగా ఏడాదిన్నర కాలంలో ఇఎస్‌ఐ ఆసుపత్రిని 100 పడకలతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా సేవలందించేలా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ చేస్తున్నామన్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్‌ను కలిసి వినతి పత్రం అందించామన్నారు. ఇఎస్‌ఐ ఉన్నతాధికారులను కూడా కలిసి త్వరితగతిన ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను అనుమతి వచ్చేలా ప్రయత్నిస్తామన్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు వివరించారు. ఇప్పుడు ఉన్న ఆసుపత్రిని పూర్తిగా తొలగించి కొత్త ఆసుపత్రి నిర్మాణం చేయాలా? లేక ఇప్పుడు స్టాండ్‌బైగా నిర్మాణం చేస్తున్న ఆసుపత్రిలో వైద్య సేవలందిస్తూ వేరొక స్థలంలో నిర్మాణం చేయాలా అన్ని నిర్ధారణ చేస్తామన్నారు. 100 పడకలకు అప్‌గ్రేడ్‌ చేసి కార్మికులకు, వారి కుటుంబాలకు మరింత మెరుగైన సేవలందించేలా తీర్చిదిద్దుతామన్నారు. ఇంటర్నేషనల్‌ పేపర్‌మిల్‌, గెయిల్‌, ఓఎన్‌జిసిల నుంచి సిఎస్‌ఆర్‌ నిధులు ఇవ్వాలని కూడా కోరతామన్నారు. ఏడాదిన్నర కాలంలో ఆసుపత్రిని మార్చి ప్రజల ముందు ఉంచుతామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here