లాభం మూరెడు….ఖర్చు బారెడు

0
509
మనస్సాక్షి
వెంకటేశాన్ని కర్ణుడితో పోలుస్తుంటారు. అంటే దానర్ధం కర్ణుడిలా ఎడాపెడా ఆస్తిపాస్తులవీ దానాలు చేస్తాడని కాదు. ఎడాపెడా ఉచిత సలహాలు యిచ్చి పారేస్తాడని. సలహాలివ్వడం వరకూ బ్రహ్మాండంగా చేసి పారేస్తాడు. తర్వాత ఏం జరిగిందన్నదే  పట్టించుకోడు. ప్రస్తుతానికి వస్తే  అలా వెంకటేశం యిచ్చిన ఓ మహత్తర సలహా కొంపలంటించింది.అసలయితే ఆ సలహా యిచ్చిందెప్పుడో సంవత్సరంన్నర కిందట. అదేంటాని చూస్తే….
 రాఘవపాలెం జమీందార్‌ భూపతిరాజా గారు అర్జంటుగా రమ్మంటున్నారని వెంకటేశానికి కబురొచ్చింది. దాంతో వెంకటేశం ఉన్న పళాన పరిగెత్తాడు. దానికో కారణముంది. సదరు భూపతిగారికి వెంకటేశం తాత, నాన్న అంతా బాగా తెలుసు. యిప్పటి వెంకటేశమూ తెలుసు. వెంకటేశం బాగా చదువుకున్నోడూ, తెలివయిన వాడూ కావడంతో తన ఆర్థిక సంబంధమయిన వ్యవహారాల్లో ఏ సలహాలు కావలసినా పిలుస్తుంటాడు. వెంకటేశం కూడా వెంటనే వెళ్ళి ఆ సలహాలేవో యిస్తుంటాడు. ఎప్పటికయినా భూపతిరాజా తనకి రాజకీయాల్లో ఉపయోగపడతాడని వెంకటేశం ఆశ. ఆ రోజు వెంకటేశం రాగానే భూపతి సాదరంగా ఆహ్వానించాడు. మాములు మాటలయ్యాక ” ఏవీ లేదోయ్‌…నా దగ్గర డబ్బయితే కోట్లలో ఉంది. దాన్ని ఏ రూపంలో  పెట్టుబడిగా పెడితే బావుంటుందా అని” అన్నాడు. వెంకటేశం తలూపి ” అందులో బ్లాకెంత? వైటెంత?” అన్నాడు. భూపతి ఏం ఆలోచించకుండా ” రెండూ ఉన్నాయి.  రెండూ కలిపి వందకోట్లుండవచ్చు” అన్నాడు. ఈసారి వెంకటేశం అయితే అందులో కొంత పెట్టి పొలాలు కొనిపారెయ్యండి. దాంతో కొంత బ్లాక్‌  తగ్గిపోతుంది తర్వాత ఎకరాకి మూడు నాలుగు లక్షల దాకా పన్ను కట్టక్కల్లేని ఆదాయం వచ్చినట్లుగా చూపించేయొచ్చు” అన్నాడు. దాంతో భూపతి మొహం వెలిగిపోయింది. ” శభాష్‌… సరే.. ఓ యాభై కోట్లని యిలా చేద్దాం.యింకో యాభై కోట్లుంది దాన్నేం చేయాలి? ” అన్నాడు. ఈసారి వెంకటేశం కొద్దిగా ఆలోచించాడు. ” ఓ మహత్తర అయిడియా ఉంది రాజా గారూ… దాంతో బ్లాక్‌ వైటయిపోతుంది. ఆదాయమంతా వైట్‌లో వస్తుంది. యింకా మీ పేరు మార్మోగిపోతుంది” అన్నాడు. అదేంటన్నట్లు భూపతి ఆసక్తిగా చూశాడు. అప్పుడు వెంకటేశం వివరంగా చెప్పడం మొదలెట్టాడు. ”మూడెకరాల్లో బ్రహ్మాండమయిన మల్టీప్లెక్స్‌ ఒకటి కట్టండి. దాంట్లో అన్నీ షాపింగ్‌ మాల్‌లూ, యింకా ఓ అరడజను ధియేటర్లూ ఉంటాయి. మొత్తం అంతా సెంట్రల్‌ ఏసీ చేయించేయండి. అసలిలాంటి మల్టీప్లెక్స్‌ ఈ చుట్టుపక్కల యింకెక్కడా లేదని అంతా అనుకోవాలి. దాంతో మీ పేరు అంతా మార్మోగిపోతుంది అది కట్టడానికి అయ్యే దానికి చాలా వరకూ బ్లాక్‌ మనీ వాడేయొచ్చు. కట్టేసిం తర్వాత షాపులూ, ఫుడ్‌ కోర్టులూ లీజుకిచ్చేసి వచ్చే అద్దె వైట్‌లో తీసుకోవచ్చు. ఎలాగూ వీటిలో అమ్మే వస్తువుల రేట్టు నాలుగైదు రెట్టు ఎంఆర్‌పి కంటే ఎక్కువే ఉంటాయి. దాంతో లీజులూ గట్టిగానే వసూలు చేయొచ్చు” అన్నాడు. వెంకటేశం అంత ఊరించేలా చెప్పేసరికి భూపతి వెంటనే అవుననేశాడు. ”యిదేదో బ్రహ్మాండంగా ఉందోయ్‌….నాకు పెట్టుబడికి రూపాయి వడ్డీ వచ్చినా చాలు” అన్నాడు. వెంకటేశం దానికీ హామీ యిచ్చేశాడు. యింకేముంది…. రాజు గారు తలుచుకుంటే దెబ్బలకి కొదవా… అందులోనూ భూపతిరాజా వారు. యింకో పదిహేను రోజుల్లో స్ధలం కొనెయ్యడం, మల్టీ ప్లెక్స్‌  నిర్మాణం మొదలయిపోయాయి. యింకో సంవత్సరం తిరక్కుండానే భూపతిరాజా మల్టీప్లెక్‌ బ్రహ్మాండంగా తయారయిపోయింది. అంతా సెంట్రల్‌ ఏసీ, ఖరీదయిన షాపులూ, ఆరు సినీ స్క్రీన్‌లూ, యింకా తినడానికి రకరకాల ఫుడ్‌ స్టాల్‌లు. అసలయితే లోపలకెడితే అక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. యిక జనాలయితే  చాలా గట్టిగా వస్తున్నారు. దాంతో భూపతిరాజా ఆనందానికి అవధుల్లేవు. తన పేరుతో కట్టిన షాపింగ్‌ మాల్‌ పేరు అందరి నోట్లో నానుతోంది. యింకో పక్క మల్టీప్లెక్స్‌లో అంతా చేసిన సెంట్రల్‌ ఏసీకీ, మెయింట్‌నెన్స్‌కీ లక్షల్లో ఖర్చయినా ఎక్కువ ఆదాయం ఉండే ఫుడ్‌ షాపుల నుంచి లీజుల రూపంలో చాలా వరకూ వచ్చేస్తుందాయె…
 ——–
 ఆ రోజు ఉదయాన్నే గిరీశానికి ఫోనొచ్చింది. అవతల లైన్లో ఉన్నది భూపతిరాజా…!  ” గిరీశం గారూ… నేనూ భూపతిరాజాని. అబ్బబ్బ… ఎలాంటి శిష్యుడ్ని తయారు చేశారండి. ఎంత గొప్ప సలహా యిచ్చాడని, మీ వెంకటేశం సలహాతోనే బ్రహ్మాండమయిన మల్టీప్లెక్స్‌ కట్టేశాను. చాలా బావుంది” అంటూ  ఫోన్‌ పెట్టేశాడు. దాంతో గిరీశం చెమర్చిన కళ్ళు తుడుచుకున్నాడు…. ” అది గురూ గారూ నా కొచ్చిన కల” అన్నాడు వెంకటేశం మురిసిపోతూ.అంతా విన్న గిరీశం ” ఎందుకో నీ కలలో ఏదో అపశృతి ధ్వనిస్తుందోయ్‌…. అసలా కలేదో వాస్తవంలోనే ఉందని నా అనుమానం” అన్నాడు. దాంతో వెంకటేశం నీరసం పడి ” ఛ..ఛ.. ప్రతిభకి గుర్తింపు లేకుండా  పోతుంది” అన్నాడు. ఈలోగా గిరీశం చుట్ట ముట్టించుకుని ” ఆ.. నువ్వు మహా గొప్ప సలహా యిచ్చేశావని….! యిచ్చిందేమో బోడి సలహా. యింతకీ కలలో తర్వాత ఏమవుతుందో తెలుసా?” అన్నాడు. వెంకటేశం అదేంటన్నట్టుగా చూశాడు. అప్పుడు గిరీశం వివరంగా చెప్పడం మొదలెట్టాడు.
  ——-
 ఉదయాన్నే ఎవరో తలుపులు కొట్టేసరికి గిరీశం తలుపులు తెరిచాడు. తీరా చూస్తే ఎదురుగా భూపతిరాజా ! అయితే మనిషే బొత్తిగా నూటయాభై లంఖణాలు చేసినట్టున్నాడు. దాంతో గిరీశం కంగారు పడి ” ఏవయింది రాజా గారూ”? అన్నాడు. భూపతి బావురుమని ” మీ వాడి సలహా విని షాపింగ్‌ మాల్‌ కట్టి నిండా మట్టిగొట్టుకుపోయాను. అది కట్టడానికయితే యాభై కోట్లు పై మాటే అయింది. యిప్పుడేదో కొత్త రూలొచ్చిందట. అక్కడ అమ్మే తినుబండారాలన్నీ ఎంఆర్‌పి రేట్లకే అమ్మాలట. అదీ గాక లోపల సినిమా హాల్స్‌లోకి బయట నుంచి తిండి తెచ్చుకోవచ్చట. యింకేముంది. ఎంఆర్‌పిలకీ నాలుగైదు  రెట్లకి అమ్మే వాళ్ళకి ఎంఆర్‌పిలకే  అమ్మమంటే అంతేసి లీజులిచ్చి వాళ్ళెలా ఉంటారని…ఖాళీ చేసేస్తామంటున్నారు. లేకపోతే ఆ లీజు కూడా అయిదోవంతే యిస్తామంటున్నారు. యిక ధియేటర్లలో తినడానికి కూడా తిళ్ళేవో యిళ్ళ నుంచి తెచ్చేసుకుంటున్నారు. యింకా పిల్లలకి పాలు పట్టించడం లాంటివి కూడా జరుగుతున్నాయి. దాంతో షో అయ్యాక యివన్నీ క్లీనింగ్‌కే గంట పడుతుంది. యింక ఈ మల్లీప్లెక్స్‌ నడపడం నా వల్ల కాదు అన్నాడు. అప్పుడే బయట్నుంచి వచ్చిన వెంకటేశానికి విషయం అర్ధమైపోయింది. దాంతో రాజా గారూ మీరేం కంగారుపడకండి. ఈ సమస్యలోంచి బయటపడ్డానికి యింకో బ్రహ్మాండమయిన సలహా యిస్తా” అన్నాడు. దాంతో రాజా వారు భయంకరంగా అరిచి వెంకటేశం చేతులు పట్టేసుకున్నాడు.
 ————
 ” అదోయ్‌….మిగతా కల” అన్నాడు గిరీశం.  వెంకటేశం తలూపి ” యింతకీ యిలా ఎంఆర్‌పిలకే అమ్మడాన్ని మీరు సమర్ధిస్తున్నారా?” అన్నాడు. గిరీశం తల అడ్డంగా ఊపి లేదు.. యిందులో రెండో కోణం కూడా చూడాలి కదా. మల్లీప్లెక్స్‌లలో జరిగేదేంటో తెలుసా ? రోజుకి 16 గంటల పాటు సెంట్రల్‌ ఏసీ వెయ్యాలి. వందలమంది స్టాఫ్‌తో  క్లీన్‌గా మెయింట్‌నెన్స్‌ చేయించాలి. యిదంతా లక్షల్లో ఖర్చు పని. మరి యిదంతా ఎలా రాబట్టుకోవాలి? యింకో విషయం ఏంటంటే… ఈ మల్టీప్లెక్స్‌లకి వచ్చే వాళ్ళలో 95 శాతం మంది ఏ షాపింగూ చేయరు. అలా సాయంత్రం దాకా ఏసీలో అన్నీ చూస్తూ ఓ సినిమా చూసి వెళ్ళిపోతారంతే.  మరి ఆదాయం ఎక్కడ్నుంచి వస్తుందని ? వచ్చే ఆదాయమంతా ఈ ఫుడ్‌ స్టాల్స్‌ నుంచే. అక్కడా ఎంఆర్‌పిలకీ అమ్మితే ఎలా నడపడం? ఏతావాతా చెప్పేదొకటే. ఈ మల్టీ ప్లెక్స్‌లనేవి ఎవరికీ తప్పనిసరి కాదు. వినోదాలంతే ! అందుకే ఆ రేట్లకి యిష్టపడినోళ్ళు వెళ్ళడమే. అయితే రేట్లు కూడా ఎంఆర్‌పిల మీద నాలుగైదు రెట్లు కాకుండా ఒకటి రెండు రెట్లయితే బాగుంటుంది” అన్నాడు.
 డా. కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here