వర్తక సంక్షేమం కోసం పనిచేసే సత్యంబాబు ప్యానెల్‌ను గెలిపించండి

0
200
మంచి వ్యక్తుల్ని ఎన్నుకోవాలని చెప్పేందుకే ముందుకొచ్చా : గన్ని
ఏకగ్రీవానికి కొందరు కలిసి రాకే ఎన్నికలకి : ఆదిరెడ్డి
రాజమహేంద్రవరం,సెప్టెంబర్‌ 28 : స్వప్రయోజనాల కోసం గాక వర్తకుల సంక్షేమం కోసం పనిచేసే దొండపాటి సత్యంబాబు ప్యానెల్‌ను గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా మాజీ చైర్మన్‌ గన్ని కృష్ణ, శాప్‌ మాజీ డైరక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు కోరారు. హోటల్‌ జగదీశ్వరిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గన్ని మాట్లాడుతూ సహకార బ్యాంకులు, చాంబర్‌ వంటి సంస్థల ఎన్నికల వ్యవహారంలో రాజకీయ జోక్యం తనకు ఇష్టం ఉండదని, అయితే ఒక వ్యాపారస్తునిగా, చాంబర్‌ సభ్యునిగా మంచి వ్యక్తులను వర్తక ప్రతినిధులుగా ఎన్నుకోవాలన్న పిలుపును ఇచ్చేందుకు ముందుకొచ్చామన్నారు. చాంబర్‌ అధ్యక్షునిగా పని చేసిన దొండపాటి సత్యంబాబు ప్యానెల్‌లో అన్ని పార్టీలకు చెందిన వారు ఉన్నారని అన్నారు. జరుగుతున్న ఎన్నికల్లో వర్తకులు ఎలాంటి బెదింపులకు తలొగ్గకుండా వర్తకుల శ్రేయస్సు కోసం పనిచేసే మంచి కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని కోరారు. గత రెండేళ్ళలో సత్యంబాబు వర్తకుల సంక్షేమానికి కృషి చేసి అందరి మన్ననలు పొందారని, ఈ సారి జరుగుతున్న ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు సత్యంబాబును సంప్రదించకుండా పూర్వాధ్యక్షులు ఒక నిర్ణయానికి రావడం దురదృష్టకరమన్నారు. సత్యంబాబు ప్యానెల్‌లో వివిధ రంగాల్లో నిష్ణాతులను,ఆధ్యాత్మికంగా సేవలందిస్తున్న వ్యక్తులను సమకూర్చుకున్నారని అన్నారు. ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ చాంబర్‌ ఎన్నికల్లో ఏకగ్రీవం చేయడానికే తాము ప్రయత్నించామని, అయితే అందుకు అంగీకరించిన వ్యక్తులు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడంతో తాము బరిలోకి దిగామన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా చాంబర్‌ పూర్వాధ్యక్షులు సమావేశమై అధ్యక్ష, కార్యదర్శులను నిర్ణయించిప్పుడు ప్రస్తుత అధ్యక్షుడిని ఎందుకు పిలువలేదని ప్రశ్నించారు.తమ ప్రభుత్వంలో వర్తకులకు పోలవరం ప్రాజక్ట్‌ కాంట్రాక్టర్‌ నుంచి రావలసిన రూ. 2.4 కోట్ల బకాయిలను రప్పించామని, జీఎస్టీ, రవాణాలో తలెత్తిన ఇబ్బందులను పరిష్కరించామన్నారు. మార్కెట్లోకి పగటిపూట లారీలకు అనుమతి లేదని పోలీసులు ఆదేశాలు జారీ చేసినప్పుడు అర్బన్‌ ఎస్పీతో మాట్లాడి ఇబ్బందులు తొలగించామన్నారు. సత్యంబాబు గెలిస్తే కొన్ని సమస్యలను పరిష్కరించడంతో పాటు చాంబర్‌ కార్యాలయం భవన నిర్మాణాన్ని చేపడతారని అన్నారు. నిబద్ధత, నిజాయితీ కలిగిన సత్యంబాబుకు తాము మద్ధతు ప్రకటించామన్నారు. యర్రా వేణు మాట్లాడుతూ చాంబర్‌ను స్వార్థ, సంకుచిత నాయకుల కబంద హస్తాల నుంచి బయటకు తేవాలన్న ఉద్ధేశ్యంతోనే తాము సత్యంబాబు ప్యానెల్‌కు మద్ధతు ప్రకటించామని అన్నారు. ఎన్నికలు జరిగేటప్పుడు నామినేషన్ల ప్రక్రియ ముగిశాక ఆశావహులను కూర్చోబెట్టి ఏకగ్రీవం చేయాల్సిన పరిస్థితిని  వదిలిపెట్టి ఎన్నికల ప్రక్రియకు ముందే అభ్యర్ధులను నిర్ణయించడం సమంజసం కాదన్నారు. వర్తకుల ప్రయోజనాలను కాపాడే పాలకవర్గాన్ని ఎన్నుకోవాలని, స్వప్రయోజనాల కోసం పనిచేసేవారిని పక్కనబెట్టాలని కోరారు.మాజీ కార్పొరేటర్‌ యిన్నమూరి రాంబాబు మాట్లాడుతూ అధ్యక్షునిగా తనను పోటీ చేయాలని అందరూ కోరినా వర్తకుల సంక్షేమం కోసం పనిచేస్తున్న సత్యంబాబుకు మరో అవకాశం ఇవ్వాలని భావించి తాను తప్పుకున్నట్లు తెలిపారు. వర్తకులకు సేవకులుగా ఉండే సత్యంబాబు ప్యానెల్‌ను గెలిపించి చరిత్ర తిరగరాయాలని కోరారు. విలేకరుల సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, ఉపాధ్య్ష అభ్యర్థి మండవిల్లి శివ, కోశాధికారి అభ్యర్థి మజ్జి రాంబాబు, సంయుక్త కార్యదర్శి అభ్యర్థి దేవత సూర్యనారాయణమూర్తి, తెదేపా నాయకులు మరుకుర్తి రవియాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here