వర్రే వర్సెస్‌ పోలీస్‌ 

0
1281
దానవాయిపేటలో అర్ధరాత్రి హైడ్రామా
 
పోలీసుల తీరుపై తెదేపా ఫ్లోర్‌ లీడర్‌ నిరసన
 
ప్రజాప్రతినిధులు, నేతల జోక్యంతో కథ సుఖాంతం
 
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  31 : పోలీసులకు, తెలుగుదేశం పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావుకు మధ్య జరిగిన వాగ్వివాదం గత రాత్రి దానవాయిపేటలో ఉద్రిక్తతలకు దారితీయడమే గాక దాదాపు 12 గంటల పాటు హైడ్రామా నడిచింది. ఈ అంశంలో ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ, కాపు కార్పొరేషన్‌ డైరక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి  రాంబాబులు రంగంలోకి దిగి కథను సుఖాంతం చేశారు. వివరాల్లోకి వెళితే….దానవాయిపేటలో పెట్రొల్‌ బంక్‌ సమీపంలో ఉన్న వర్రే శ్రీనివాసరావు నివాసం కింద ఓ బేకరీ ఉంది. నైట్‌ పెట్రొలింగ్‌ చేసే పోలీస్‌ సిబ్బంది  గత రాత్రి 10.20 గంటల సమయంలో అక్కడకు వచ్చి బేకరీని మూసివేయాలని యజమానిని ఆదేశించి  పోలీసులు ముందుకు వెళ్ళి తిరిగి ఆ ప్రాంతానికి వచ్చేసరికి బేకరీ  ఇంకా తెరిచే ఉండటంతో పోలీసులు బేకరీ యజమానిని మందలించారు. ఈలోగా అక్కడకు చేరుకున్న  వర్రే శ్రీనివాసరావు తాను తెదేపా ఫ్లోర్‌ లీడర్‌నని, తన నివాసం వద్ద కేకలు వేయవద్దని పోలీసులతో వ్యాఖ్యానించారు. రాత్రి 10 గంటల తర్వాత షాపు తెరిచి ఉంచడం సరికాదని,  ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవడం  సరికాదని వర్రేకు సమాధానమివ్వడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈలోగా యాంటీ గూండా స్వ్కాడ్‌ (ఏజీఎస్‌) సిబ్బంది అక్కడకు చేరుకుని బేకరీ యజమాని హెచ్‌టి ప్రసన్నను అదుపులోకి తీసుకుని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుని నిరశిస్తూ అక్కడ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. రాత్రి 12 గంటల సమయంలో విషయం తెలుసుకున్న తెదేపా నేత గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి, కార్పొరేటర్లు అక్కడకు చేరుకుని జరిగిన సంఘటనను తెలుసుకున్నారు. గన్ని కృష్ణ ఈ విషయంపై డిఎస్పీ కులశేఖర్‌తో మాట్లాడటంతో ఆయన అక్కడకు చేరుకున్నారు. తెల్లవారుజామున మూడు గంటల వరకు పార్టీ నాయకులు వర్రేను సముదాయించినా ఆయన ఆందోళన విరమించలేదు.  30 ఏళ్ళగా రాజకీయాల్లో ఉంటూ కౌన్సిలర్‌గా, కార్పొరేటర్‌గా నాలుగు పర్యాయాల నుంచి గెలిచినా తన పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యే ఆకుల, ఎమ్మెల్సీ  ఆదిరెడ్డి, తెదేపా నేతలు గన్ని కృష్ణ, యర్రా వేణు తదితరులు డిఎస్పీ కులశేఖర్‌తో చర్చించారు. అనంతరం ఆందోళన కొనసాగిస్తున్న వర్రే వద్దకు వచ్చి మాట్లాడారు. ¬ం మంత్రి చిన రాజప్పకు గన్ని కృష్ణ ఫోన్‌ చేసి జరిగిన సంఘటనను వివరించారు. ఫోన్‌లోనే వర్రేతో రాజప్ప మాట్లాడి జరిగిన ఘటనపై విచారణ జరిపించి  అమర్యాదగా ప్రవర్తించిన పోలీస్‌లపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వర్రేకు గన్ని కృష్ణ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అంతకు ముందు రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల అక్కడకు చేరుకుని జరిగిన సంఘటనను డీజీపి సాంబశివరావుకు వివరించారు.