వాంబే కాలనీలో అంగన్‌వాడీ కేంద్రం

0
323
ప్రారంభించిన ఆదిరెడ్డి, గన్ని – మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వ అనుమతి
రాజమహేంద్రవరం, జులై 4 : ఇంటర్నేషనల్‌ పేపర్‌మిల్లు సమీపాన ఆర్‌ అండ్‌ బి వర్క్‌ షాపు స్థలంలో నిర్మించిన వాంబే గృహా సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేందాన్ని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు  ఈరోజు ప్రారంభించారు.  ఈ కాలనీలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అన్ని సౌకర్యాలను కల్పించేందుకు సిఎం  చంద్రబాబు హామీ ఇచ్చారని వారు  వెల్లడించారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే అక్కడికి వెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారన్నారు. మిగిలిన పార్టీల్లా హామీలిచ్చి విస్మరించే పార్టీ తెలుగుదేశం కాదన్నారు. ఇప్పుడు ఏర్పాటు చేసిన అంగన్‌ వాడీ కేంద్రం ద్వారా చిన్నారులు, బాలింతలు, గర్భిణిలకు పౌష్టికాహారం అందించి ఆరోగ్యకరంగా ఉండేలా చేయాలని ఐసిడిఎస్‌ అధికారులకు సూచించారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఈ ఏరియాలో ప్రజల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఒక రైతుబజార్‌, రేషన్‌ దుకాణం ఏర్పాటుకు ఇప్పటికే ఆదేశాలు జారీచేసారన్నారు. వాంబే కాలనీల్లో నిండిపోయిన సెప్టిక్‌ ట్యాంకులను శుభ్రం చేయడానికి కార్పొరేషన్‌ అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఆర్‌ అండ్‌ బి వర్క్‌షాప్‌ స్థలంలో ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణం చేస్తే స్థానికులు వివాహాది, శుభ కార్యాలు నిర్వహించుకునేందుకు అనువుగా ఉంటుందని అధికారులు సూచించారన్నారు. దాన్ని కూడా త్వరలోనే సిద్ధం చేస్తామన్నారు. వాంబే కాలనీలో పెండింగ్‌లో ఉన్న రోడ్లు, కనెక్టింగ్‌ రోడ్లు, డ్రైనేజీలు కూడా పూర్తిచేస్తామన్నారు. 700 కుటుంబాలకు ఇంటింటికి కుళాయిని వేసి మంచినీటి ఇబ్బందులను తొలగించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్నారు. సెప్టిక్‌ ట్యాంకులను శుభ్రం చేయడానికి 2 లక్షల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసారని తెలిపారు. అనంతరం గర్భిణిలకు సీమంతం చేసి ఆశీర్వదించారు.ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన చేసి ఆశీర్వదించారు. వారి వెంట కార్పొరేటర్లు మర్రి దుర్గా శ్రీనివాస్‌, కోరుమెల్లి విజయశేఖర్‌, టీడీపీ నాయకులు మాలే విజయలక్ష్మి,బొచ్చా శ్రీను  కర్రి రాంబాబు, ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ దుర్గ అంగన్‌వాడీ కార్యకర్తలు భాగ్యలక్ష్మి, వెంకటలక్ష్మి, మున్నీ తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here