విచ్చలవిడిగా అప్పులు చేస్తే చేతికి చిప్పే

0
190
ఎపి ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి
– మాజీ ఎంపీ ఉండవల్లి డిమాండ్‌
రాజమహేంద్రవరం,సెప్టెంబర్‌ 15 : ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్‌ డిమాండ్‌ చేసారు. కోట్లకు కోట్లు అప్పులు తేవడానికి భాజాభజంత్రీలతో సహా వెళితే చివరికి చేతికి చిప్పే మిగులుతుందని విమర్శించారు. స్థానిక ప్రకాశంనగర్‌లోని త్రీ స్టార్‌ హొటల్‌లో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఉండవల్లి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎంత అప్పు తెచ్చారన్న లెక్కలు ప్రజలందరికీ అర్థమయ్యేలా వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తాజాగా 33 వేల కోట్లు అప్పు తేవడానికి సిద్ధమయ్యారని ఇలా అప్పులు చేసుకుంటూ పోతే రాష్ట్ర ప్రజలపై మరింత భారం పెరుగుతుందన్నారు. అమరావతి నిర్మాణం, సిఆర్‌డిఎ, పోలవరం, పట్టిసీమ సహా అన్ని అంశాలకు సంబంధించిన సమాచారాన్ని తనకు ఇస్తానని రాష్ట్ర ప్రణాలికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తనకు ఇస్తానని చెప్పారన్నారు. ఎవరికి పడితే వాళ్లకు వర్కులు ఇచ్చేస్తున్నారని, బ్యాంక్‌ డిపాజిట్లు, గ్యారంటీలు కూడా వెనక్కి తిరిగిచ్చేస్తే బాధ్యత ఎవరూ వహిస్తారని ప్రశ్నించారు. తాను ఒక చట్టసభల్లో సభ్యుడిని కాదని, ఒక సామాన్య పౌరుడిగా అసెంబ్లీ నిర్మాణం, ఇతర నిర్మాణాలకు సంబంధించిన టెండర్లపై ఆడిట్‌ విభాగం వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరుతున్నానన్నారు. కేబినెట్‌ తీర్మానించింది, అసెంబ్లీ ఆమోదించింది.. సమాధానం చెప్పక్కర్లేద్దని చెబితే తనకేమీ అభ్యరతరం లేదన్నారు. మీ ఇంటికే వస్తానని  అన్ని విషయాలు చెబితే వాటిని ప్రజలకు చెబుతానని కుటుంబరావు ఆఫర్‌పై ప్రకటించారు. ఎఫ్‌ఐఆర్‌ లేకుండా అరెస్టులు చేస్తే చాలా పెద్దనేరమని చంద్రబాబుకు వచ్చిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్లపై వ్యాఖ్యానించారు. సిఎంకు తెలియని ఎన్‌బిడబ్ల్యులు ఉంటాయని తాను అనుకోవడం లేదని ఆయన గతంలో తొమ్మిదేళ్ల పరిపాలనలో ఏ కేసులేని నాపై కూడా ఎన్‌బిడబ్ల్యు వేయించారని ఎద్దేవా చేసారు. అసెంబ్లీ నిర్మాణం సహా పరిపాలనా భవనాలకు 20 నుంచి 25 శాతం అదనంగా టెండర్లు ఆమోదించేస్తున్నారని దీని వల్ల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందన్నారు. 5 శాతం మించి అదనంగా టెండర్‌ వేస్తే ఆమోదించడం కుదరదని, మళ్లీ రీ టెండర్లు పిలవాలని నిబంధనలు చెబుతున్నా ప్రభుత్వం చెవికెక్కడం  లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వేలో పనులు జరగకుండానే 101 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించేసారని  ఆరోపించారు. పనులు చేసాక బిల్లులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని అసలు అక్కడ ఏ పని జరగకపోయినా చేసినట్టుగా ఎం-బుక్‌ రికార్డింగ్‌ చేసి ఇఇ ద్వారా పే అండ్‌ అక్కౌంట్స్‌ విభాగానికి పంపడం దారుణమన్నారు. 2015 మార్చి 31వ తేదీన ప్రభుత్వం ఖాతాలో కేంద్ర ప్రభుత్వం రూ 500 కోట్లు జమచేస్తే అది వాడుకోవడానికి ప్రయత్నించకుండా కొత్త అప్పులకు వెళ్లడం విచిత్రంగా ఉందన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 350 కోట్లు విడుదల చేస్తే దాన్ని రైతు సాధికార సంస్థకు మళ్లిస్తూ జిఓ ఇచ్చారని ఆ యుటిలైజేషన్‌ సర్టిఫికెట్‌ ఇంతవరకు విడుదల చేయలేదని దానిపై కూడా కుటుంబరావు వివరణ ఇస్తే బాగుంటుందన్నారు. రాజకీయ ఆరోపణలు చేయాల్సిన అవసరం తనకు లేదని పక్కాగా డాక్యుమెంట్లు ఉంటేనే మాట్లాడతానని మరోసారి స్పష్టం చేసారు. సమావేశంలో చెరుకూరి వెంకట రామారావు అల్లు బాబీ, అచ్యుత దేశాయ్‌, పసుపులేటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here