విద్యాశ్రీ

0
241
మనస్సాక్షి  – 1133
వెంకటేశం ఎలక్షన్లో పోటీ చేయడానికి నామినేషన్‌ వేసేశాడు. అలాగని వెంకటేశా నికి ఏ సైకిల్‌ పార్టీయో, ఫ్యాన్‌ పార్టీయో లేకపోతే యింకో గ్లాసు పార్టీయో పిల్చి టిక్కెట్టిచ్చేసిందని కాదు.  అసలు సీటు కోసం ఎవరెవరి చుట్టూ తిరగడమేంటీ అనుకున్నాడో ఏంటో వెంకటేశం శుభ్రంగా యిండిపెండెంట్‌గా పోటీ చేసేశాడు. అసలే గిరీశం, వెంకటేశం ఫ్యామిలీలకి ఊళ్ళో ఎంతో కొంత పేరుందాయె. దాంతో వెంకటేశం యిండిపెండెంట్‌గా పోటీ చేయడం ఆసక్తిగా మారింది. యింతలో మిగతా పార్టీలు కూడా అభ్యర్ధుల్ని ప్రకటిం చడం, వాళ్ళతోపాటు సీట్లు రాని అసంతృ ప్తులు పోటీలోకి దిగడం జరిగింది. దాంతో పోటీ అయితే రంజుగా సాగింది. అయితే అక్కడ ఫలితాల్లో ఓ అద్భుతం జరిగింది. అక్కడ పోటీ చేసిన పెద్ద పార్టీల ఓట్లు చాలా వరకూ వాటి రెబల్సే చీల్చేశారు. యిక వెంకటేశానికయితే అలాంటి గొడవేవీ లేదు. అదీగాక వెంకటేశం ఎవరినీ విమర్శించకుండా వాస్తవికంగా మాట్లాడటం కూడా అందరినీ ఆకర్షించింది. దాంతో అంతా పొలో మని వెంకటేశానికి ఓట్లు గుద్దేసి భారీ మెజారిటీతో గెలిపిం చేశారు. అంతేకాదు. వెంకటేశం రాష్ట్రం మొత్తం మీద గెలిచిన ముగ్గురి యిండిపెండెంట్లలో ఒకడయ్యాడు. అయితే ఏ పార్టీకీ సరయిన మెజారిటీ సీట్లు రాకపోవడంతో ఈ యిండిపెండెంట్లు కీలకం అయిపోయారు. దాంతో అందరి దృష్టీ వీరిపై పడింది. యిక చిట్టచివరకొచ్చేసరికి వెంకటేశం ఎవరిని సపోర్ట్‌ చేస్తే ఆ పార్టీయే అధికారంలోకొచ్చే పరిస్థితి వచ్చేసింది. దాంతో రెండు పార్టీలూ వెంకటేశం వెనకపడ్డారు. ముందుగా తనని కలిసిన పార్టీ వాళ్ళతో ‘నాకు విద్యాశాఖామంత్రి యివ్వాలి. అంతేకాకుండా నేనేం చేసినా అడ్డుచెప్పకూడదంతే’ అని తేల్చిచెప్పాడు. దాంతో వాళ్ళు మర్నాటి కల్లా ఆలోచించి తమ నిర్ణయం చెబుతామని వెళ్ళిపోయారు. యిక తర్వాత వచ్చిన రెండో పార్టీ వాళ్ళయితే దానికి వెంటనే ఒప్పేసుకున్నారు. ముందు ఏదోలా అధికారంలోకి రావడం అనేది వాళ్ళకి ముఖ్యమాయె. యింకేముంది.. మర్నాటికల్లా ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, దాంట్లో వెంకటేశం విద్యాశాఖా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. యిక అసలు కథ అప్పుడే మొదలయింది…
——–
వారం గడిచింది. ఆపాటికి వాతావరణం అంతా మామూల యింది. ఎలక్షన్లో  ఓడిపోయినోళ్ళు ఎంత ఖర్చయిందీ ఎన్ని అప్పులు మిగిలాయిలాంటి లెక్కల్లో ఉంటే, అధికారంలోకొచ్చి నోళ్ళు తాము పెట్టిన ఖర్చుకి పదిరెట్లో, పదహారు రెట్లో ఎలా రాబట్టుకోవాలా అన్న ప్రయత్నంలో పడ్డారు. సరిగ్గా అప్పుడు వెంకటేశం తన విశ్వరూపం చూపించాడు. మంత్రిస్థాయిలో వెంక టేశం ఓ చారిత్రక నిర్ణయం తీసుకున్నాడు. అది.. రాష్ట్రంలో యిక మీదట విద్యా సంస్థకీ ప్రభుత్వం నుంచి ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ యివ్వడం జరగదు అన్న నిర్ణయం..! దాంతో అంతా గగ్గోలెత్తి పోయారు. యిదేదో రాష్ట్రమంతటా చర్చనీయాంశం అయింది. ప్రభుత్వం మీదయితే స్కూల్స్‌ నుంచి గట్టి వొత్తిళ్ళే వచ్చాయి. అయితే వెంకటేశం ముందే చెప్పిన మీదట యిక చేసేదేవీ లేకపోయింది. తొందర్లోనే  కేబినెట్‌ ఆ బిల్లేదో ఆమోదించేసింది కూడా. యిక అక్కడ్నుంచి రాష్ట్రంలోని బడాబడా కార్పొరేట్‌ సంస్థలకి వేటికీ లక్షల్లో, కోట్లలో రీఎంబర్స్‌మెంట్లు అందడం మానేశాయి. దాంతో ప్రభుత్వం దగ్గర వేలకోట్ల నిధులు మిగిలిపోతున్నాయి. యిక్క డింకోసారి వెంకటేశం తన మేధస్సు ఉపయోగించాడు. ఆ నిధు లతో రాష్ట్రం అంతా విస్తారంగా స్కూల్స్‌, కాలేజీలు కట్టించేశాడు. అది ఏదో ఆషామాషీగా కాదు. కార్పొరేట్‌ స్కూల్స్‌ని తలదన్నేలా., దాంతో సంవత్సరం తిరిగేసరికల్లా ప్రైవేటు సంస్థల్లో చదివేవారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. యిక గవర్నమెంటు స్కూల్స్‌లో కాలేజిల్లో సీట్ల కోసం అంతా ఎగబడు తున్నారు. ఎప్పుడో నాలుగేళ్ళకోసారి పెట్టే డీఎస్సీ పరీక్షలు సంవత్సరానికి రెండుసార్లు పెట్టి టీచర్లని రిక్రూట్‌ చేసుకోవలసి వస్తోంది. లెక్చరర్లు అంతే. ఓ పక్కన బ్రహ్మాండమయిన సౌకర్యాలతో, యింకా నాణ్యమయిన విద్యా ప్రమాణాలతో ప్రభుత్వ స్కూల్స్‌ కాలేజీల ముందుకి దూసుకుపోతుంటే యింకో పక్క ప్రైవేటు స్కూల్స్‌ల్లో పరిస్థితి మరీ దారు ణంగా తయారయింది. వాళ్ళు తమ ఫీజుల్ని వేలూ, లక్షల నుంచి ఒకట్రెండు వేలకి దింపే శారు. అయినా చేరేవాళ్ళు ఉంటేగా..!
——-
”గురూగారూ.. యిందాక తెల్లవారుజామున యిలాంటి మహత్తరమయిన కలొకటి వచ్చింది. నేను ఈసారి ఎలక్షన్లో పోటీ చేసి యిలాంటి సంస్కరణలేవయినా చేపట్టేదా?” అంటూ అడిగాడు వెంకటేశం. దాంతో గిరీశం వెంక టేశం భుజంతట్టి ”లక్షలూ, కోట్లుగా ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ చేయడం…, అదీ బలిసిన సంస్థ లకి చేయడం విషయమేదో నీ మనసులో ఎక్కడో అసంతృప్తి రగి లించినట్టుంది. యిలా జరిగితే బాగుండును” అన్న ఆలోచనతో ఈ కలొచ్చినట్టుంది. అయినా ఈ వ్యవస్థలో పాతుకుపోయిన కొన్ని కార్పొరేట్‌ శక్తులూ, వాటికి ప్రభుత్వంతో ఉండే సంబంధ బాంధవ్యాల నేపథ్యంలో యిలాం టివి జరగనిస్తారా అని” అన్నాడు. దాంతో వెంకటేశం కొంచెం నిరాశపడ్డట్టుగా కనిపించాడు. యింతలో గిరీశం కొనసాగిస్తూ ”అయితే యిక్కడ మనం గ్రహించవలసింది ఒకటుందోయ్‌… కొంచెం వివరంగా చెప్పాలంటే… ఆ ఆరోగ్యశ్రీ పథకాల వ్యవ హారమే తీసుకో. అసలీ పథకాలు ఎవరి కోసం? కొన్ని కార్పొరేట్‌ హాస్పిటల్స్‌కి లబ్ధి చేకూర్చడానికీ, యింకా పరిమిత సంఖ్యలో రోగులకి లబ్ధి చేకూర్చడానికీ అంతే. అయితే దానికంటే యిలా ఖర్చుపెట్టే ఆ వేలాది కోట్ల నిధులేవో గవర్నమెంటు హాస్పిటల్స్‌ అన్నింటిలో వైద్య సౌకర్యాలు పెంచడానికో అన్ని రకాల వైద్య విభాగాలనీ పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికో, యింకా టెస్ట్‌లన్నీ చేసే పరికరాలు ఏర్పాటు చేయడానికో, అవసర మయిన ఏ మందల యినా లభ్యమయ్యేలా చేయడానికో చేస్తే ఎంత బాగుంటుం దని.. అలా చేస్తే యిప్పుడు కేవలం వందల మందికీ పరిమిత మయిన ఆ సేవలేవో వేలూ, లక్షలమందికి చేరతాయి. యిది ఎందరో మేధావులమాట. అలాగే ఎంతో ఆర్థిక పరిపుష్టంగా నడిచే ఈ కార్పొరేట్‌ విద్యా సంస్థలకి వేల కోట్ల ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ యివ్వడం ఎంతవరకూ సబబని? వాస్తవికంగా ఆలోచిస్తే డిఎస్సీ సెట్‌ పాసయి వచ్చిన ‘క్రీమ్‌’ టీమంతా గవర్న మెంట్‌ సంస్థల్లోనే ఉంటారు. అయితే యితరత్రా  సౌకర్యాలో, యింకో హంగులో లేని కారణంగా ఎవరూ గవర్నమెంటు విద్యా సంస్థల వైపు మొగ్గు చూపడం లేదు. దాంతో వారి మేధస్సు మరుగున పడిపోతోంది. అదే కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో తాము చదివిన చదువుకి సంబంధం లేకుండా యితర సబ్జెక్ట్‌ల పాఠాలు బోధించే వ్యవహారం చూడొచ్చు. అయినా పైపై హంగుల వలన అంతా ఈ సంస్థల వైపే వెడుతున్నారు. యిక్కడ అసలయిన ప్రశ్న యిటువంటి సంస్థలకి అన్ని లక్షలూ, కోట్లూ ఫీజుఎంబర్స్‌మెంట్లు ఎందుకని? మొత్తం అవన్నీ ఆపేసి, ఆ వేలకోట్ల నిధులతో గవర్నమెంటు విద్యా వ్యవస్థని బ్రహ్మాండంగా డెవలప్‌చేసి పారేస్తే సమాజంలో మొత్తం అందరికీ ఉచిత విద్య అందించినట్టేగా. అంతా ఆలోచించాలి” అంటూ వివరించాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here