విపత్తుల నుంచి రక్షణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లు

0
302
అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జనరల్‌ కిల్లాడ సత్యనారాయణ వెల్లడి
రాజమహేంద్రవరం, ఆగస్టు 23 : అగ్ని ప్రమాదాలతోపాటు, వరదలు, తుఫాన్లు, రోడ్డు ప్రమాదాల్లో బాధితులను కాపాడేందుకు  ప్రతీ జిల్లాలోనూ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసినట్లు అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జనరల్‌ కిల్లాడ సత్యనారాయణ వెల్లడించారు. గోదావరి వరదల నేపథ్యంలో అగ్నిమాపక శాఖ చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించేందుకు ఈరోజు ఆయన రాజమహేంద్రవరంలోని ఫైర్‌ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ వినియోగించే పరికరాలతోపాటు, ముంపు ప్రాంతాల్లో అగ్నిమాపక శాఖ సిబ్బంది చేసిన సేవలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లో అగ్నిమాపక శాఖ సిబ్బంది సేవలను వినియోగించేలా రాష్ట్రంలో 800 మంది సిబ్బందిని ప్రత్యేకంగా ఎంపిక చేసి ఒరిస్సా, గోవా, హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ ఇప్పించినట్లు చెప్పారు. ప్రకృతి విలయతాండవంతో అతలాకుతలం అయిన కేరళ రాష్ట్రంలో మన రాష్ట్రం నుంచి ప్రత్యేక శిక్షణ పొందిన 75 మంది సిబ్బందితోపాటు, 12 బోట్లు, ఇతర పరికరాలతో తరలించినట్లు చెప్పారు.  ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ప్రతీ జిల్లాలోనూ ఏర్పాటు చేశామని, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లో ఎంపిక చేయబడిన సిబ్బందికి నాగాలాండ్‌లో ప్రత్యేక శిక్షణ ఇప్పించినట్లు చెప్పారు. విజయనగరానికి చెందిన సిబ్బంది కొన్ని నూతన పరికరాలను కనుగొన్నారని, వీటికి పేటెంట్‌ ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేస్తున్నట్లు చెప్పారు. అధికారుల కొరత లేకపోయినప్పటికీ సుమారు 1200 మంది సిబ్బంది కొరత ఉందని, త్వరలోనే ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సమావేశంలో డిఎఫ్‌ఒ శ్రీహరిజగన్నాధం, ఫైర్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం పుష్కర ఘాట్‌ వద్ద గోదావరి వరద ఉధృతిని ఆయన పరిశీలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here