వృశ్చికోపాఖ్యానం

0
523
మనస్సాక్షి
వెంకటేశం మామూలోడు కాదంటారు. లేకపోతే మహా మహా పురాణాలు రాసిన పురాణకర్తలు సైతం ఏదో తమకి కుసింత పాపులారిటీ పెంచామని వెంకటేశాన్ని అడగడమేంటని…! వినడానికి యదేదో గిరీశం గారి చుట్టపొగంత ఘాటుగా ఉన్నా నిజంగా నిజమే. అదెలాగంటే…
                         వెంకటేశం చిన్నగా ఈలేసుకుంటూ వచ్చాడు. వెంకటేశం అలా వచ్చాడంటే దానర్థం ఏదో బలమయిన నిర్ణయానికి వచ్చాడన్నమాటే. అదేదో అర్ధమయినట్టు గిరీశం ” ఏవివాయ్‌ వెంకటేశం… కొత్తగా ఏం చేద్దామనుకుంటున్నావ్‌?” అన్నాడు. దాంతో వెంకటేశం హుషారుగా ” ఏం లేదు గురూగారూ… రాజకీయాల్లో దూరడానికి నిర్ణయం తీసేసుకున్నా” అన్నాడు. గిరీశం తలూపి ” శుభం…యింతకీ సైకిలెక్కుతావా…ఫ్యాన్‌ కింద దూరతావా…లేకపోతే  పవనో, హస్తమో, కమలమో అంటావా?” అన్నాడు. వెంకటేశం తల అడ్డంగా ఊపి ” కుంపట్లో దూకుదామనుకుంటున్నా” అన్నాడు. దాంతో గిరీశం అర్థం కానట్టు ” కుంపటా… అదగే పార్టీ గుర్తుంటావ్‌ ?” అన్నాడు. దానికి వెంకటేశం ” ఏ పార్టీ  గుర్తూ కాదూ సొంత కుంపటి పెడదామనుకుంటున్నా” అన్నాడు. గిరీశం తలూపి ” అదేం పనోయ్‌… అయినా దానికి బోల్డంత డబ్బులు కావాలేమో” అన్నాడు. వెంకటేశం తలూపి ” యిప్పుడున్న ఏ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. నాకెందుకో హంగ్‌ వస్తుందనిపిస్తుంది. అలాంటప్పుడు యిండిపెండెంట్లే కీలకమవుతారు. యిక డబ్బులంటారా…. ఆ మాత దయ ఉంటే ఆ డబ్బేదో అలా అలా వచ్చి  పడిపోతుంది” అంటూ బయటికి నడిచాడు. దాంతో గిరీశం ‘ మాత దయ అంటాడేంటీ… వీడు డబ్బులడిగితే వాళ్ళమ్మ కాళ్ళు విరగ్గొట్టేలా ఉంది. మరీ  మాత ఎవరో… అని గొణుక్కున్నాడు.
——-
 పాముల నరసయ్య యింట్లోంచి బయటికి రాబోతుంటే  వెంకటేశం వచ్చాడు. దాంతో నరసయ్య ” ఏం కావాలి బాబూ? అన్నాడు. వెంకటేశం  లోపలికి చూస్తూ ” పామేవయినా ఉందా?” అని అడిగాడు. నరసయ్య ” నిన్నే యిచ్చేశా బాబూ…’ అన్నాడు. దాంతో వెంకటేశం కొంచెం నీరసంపడి ” పోనీ తేలేవయినా ఉందా?” అనడిగాడు. ఈలోగా లోపల నుంచొచ్చిన కాంతం ” వారం నాడు తేలొకటి గడప కలుగులో దూరింది. చెప్పా గుర్తుందా” అంది. నరసయ్య గుర్తొచ్చినట్టుగా తలూపి ” అవునవును. సరే” ఆ తేలేదో పట్టిస్తాగానీ ఎంతిస్తావ్‌?” అంటూ వెంకటేశాన్ని అడిగాడు. వెంకటేశం తేలిగ్గా ”  ఎంతయినా యిస్తాను. ఓ అయిదు వేలివ్వనా? ” అన్నాడు. దాంతో నరసయ్య గబగబా లోపలకెళ్ళి గునపం తెచ్చి తేలు దూరిన కలుగులో తవ్వే పనిలో పడ్డాడు. ఓ పావు గంట ప్రయత్నం తర్వాత లోపల నెరలలో ఆ తేలేదో కనపడింది. యింతలోనే అది కాస్తా బయటికి పరిగెత్తుకొచ్చింది. దాంతో నరసయ్య  దానిమీద ఓ గిన్నెలాంటిది మూతపెట్టేశాడు. ఈలోగా  ఆ తేలు బయటికి రావడానికి ప్రయత్నాలు మొదలెట్టింది. దాంతో నరసయ్య ఆ గిన్నేదో కొద్దిగా పైకెత్తాడు.దాంతో ఆ తేలు బాపతు కొండె బయటికొచ్చింది. నరసయ్య  చటుక్కున ఆ కొండె విరిచేశాడు. తర్వాత ఆ గిన్నె తీసేసి ఆ తేలుని చేతిమీద కెక్కించుకున్నాడు. ఆ  తర్వాత దానిని చిన్న పెట్టెలో పెట్టి వెంకటేశానికిచ్చి ” యింక దీంట్లో ఇషం లేదు బాబూ” అన్నాడు. వెంకటేశం ఓ అయిదువేలు తీసి నరసయ్య చేతిలో పెడుతూ ” దీన్ని మత్తులో ఉంచాలంటే ఎలా?” అన్నాడు. దాంతో  నరసయ్య నవ్వేసి ” యిదీ మసుసుల్లాగే బాబూ… మత్తు బిళ్ళలు దొరుకుతాయి కదా. అదేదో కొంచెం పౌడరు చేసి పెట్టు” అన్నాడు. వెంకటేశం తలూపి ఆ తేలుని తీసుకుని బయటికి నడిచాడు.
మర్నాడు…
వెంకటేశం నిత్యానందం ఎక్కడున్నాడా అని వెతుకుతున్నాడు. మొత్తానికా నిత్యానందం గుడి అరుగు మీద కనిపించాడు. వెంకటేశం ఏం తెలీనట్టు వెళ్ళి నిత్యానందం పక్కన కూర్చుని పలుకరించాడు. తర్వాత గొంతు తగ్గించి  ”యిదిగో నిత్యానందం….రాత్రి నాకో కలొచ్చింది. దాంట్లో వేదవ్యాసుల వారు వచ్చారు. ఆయనో  గొప్ప రహస్యం చెప్పారు తెలుసా? అంటూ ఆపాడు. దాంతో నిత్యానందం అదేంటన్నట్టుగా కుతూహలంగా చూశాడు. యింతలో వెంకటేశం ” మరా రహస్యం ఎవరికీ చెప్పకూడదు. నువ్వయితే ఎవరికీ చెప్పవని నీకు చెబుతున్నా” అంటూ తిరిగి కొనసాగించాడు.  ” రాత్రి కలలో వేదవ్యాసుల వారు తెగ బాధపడిపోయారనుకో. అసలాయన రాసినవి అష్టాదశ పురాణాలేనని అంతా అనుకుంటున్నారట. అయితే ఆయన రాసినవి నవాదశ పురాణాలంట. ఆ పందొమ్మిదోది వృశ్చిక పురాణమంట. అసలయిన పురాణం అదేనంట. అంతే కాదు. తేలు తల్లి అదే…వృశ్చిక మాత నా ద్వారా  ఆ వృశ్చిక పురాణాన్ని వెలుగులోకి తెస్తుందట.  యిదంతా గొప్ప దేవ రహస్యం. ఎవరికీ చెప్పకూడదు” అన్నాడు. వెంకటేశం రహస్యం అనగానే నిత్యానందం చెవులు గట్టిగా  మెదిలిపోయాయి. అసలే నిత్యానందం అందరిలాంటి కాదాయె. అందుకే వెంకటేశం నిత్యానందాన్ని సెలక్ట్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత నిత్యానందం ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. యిది జరిగిన పన్నెండు నిమిషాల్లో ఈ విషయం అయిదుగురికి చేరింది. ఆ తర్వాత గంటకల్లా ఊరిలో సగం మందికీ చేరితే, గంటన్నరలో దాదాపు ఊరంతటికీ చేరిపోయింది…
————
 మర్నాడు వెంకటేశం రామయ్యతో కలిసి తన పొలం వైపు బయల్దేరాడు. యింతలో ఓ విశేషం జరిగింది. వెంకటేశం తాలూకా పొలం వైపు బయల్దేరాడు. వెంకటేశం తాలూకా పొలం గట్టు మీద పెద్ద తేలోకటి కనిపించింది. అయితే అదేదో పెద్దగా కదలడం లేదు. అంతకు ముందే వెంకటేశం దానికి మత్తు మందిచ్చాడాయె. యింకెలా కదులుతుందని…! ముందుగా  రామయ్య ఆ తేలుని చూశాడు. అంతలోనే  ఏదో తట్టినట్టు ” వెంకన్న బాబూ…వృశ్చిక మాత అనుగ్రహం నీకుందని తెలిసింది. ఆ లెక్కన యిది ఆ వృశ్చిక మాతే అయ్యుండాలి. మూములు తేలు అయితే అటూ యిటూ పోవాలి. యిదేదో  నిన్ననుగ్రహించడానికి కనిపెట్టుకుని ఉంది” అన్నాడు. వెంకటేశం  అదేదో నిజమే అన్నట్టుగా తలూపాడు. క్షణాల్లో ఈ విషయం ఊరంతా పాకిపోయింది. దాంతో వృశ్చిక మాతని దర్శించుకోవడానికి అంతా తరలివచ్చారు. ఈలోగా ఎవరో దాన్ని కదిపి చూశారు. అదేదో చిన్నగా కదులుతోంది. యింతలోనే ఆ వచ్చిన భక్తుల్లో ఒకరికి పూనకం వచ్చేసింది. ఎడాపెడా ఊగిపోతూ ‘ రేయ్‌… నేను రుచ్చిక మాతనురా… నాకిక్కడే గుడి కట్టండి’ అంటూ అరిచింది. దాంతో భక్తులంతా భయభక్తులతో తలాడించారు. అంతే కాదు వెంకటేశం అప్పటికప్పుడే తన పొలంలో వృశ్చిక మాత గుడిని కట్టించే పనిలో పడ్డాడు. యిక విరాళాలయితే ఎడాపెడా వచ్చి పడ్డాయి. తొందర్లోనే గుడేదో కట్టేసి ఆ వృశ్చిక మాతని అందులో పెట్టేశారు. యిక అక్కడ్నుంచి  వృశ్చిక మాతకి రోజూ పూజలూ, నైవేద్యాలే. ఓ రోజయితే ఆ వృశ్చిక మాత కాస్తా కాలం చేసింది. దాంతో ఆ గుడిలోనే  ఆ వృశ్చికాన్ని సమాధి చేసేసి పూజలు కొనసాగించారు. యింకో పక్క గుడి కొచ్చే భక్తులయితే  రోజురోజుకీ పెరిగిపోతున్నారు. వచ్చిన భక్తుల విరాళాలతో హుండీలు నిండిపోతున్నాయి. వాటిని లెక్క పెట్టుకోడానికే  వెంకటేశానికి టైం సరిపోవడం లేదు.
 ————-
” అది గురూ గారూ… నా కొచ్చిన కల. ఆ విరాళాల డబ్బుతో ఎలక్షన్లో పోటీ చేస్తా” అన్నా వెంకటేశం. గిరీశం తలూపి ” పోనీ ఎలక్షన్లో కూడా ఆ తేలు గుర్తే పెట్టుకో.యింకా బ్రహ్మాండంగా ఓట్లు పడతాయి” అన్నాడు. ఆ వేళాకోళానికి వెంకటేశం గతుక్కుమని ” అయినా ఈ కలెందుకు వచ్చినట్టంటారు?” అన్నాడు. దాంతో గిరీశం ” మరేంలేదోయ్‌.. మనకి కొన్ని నమ్మకాలు విశ్వాసాలు ఉంటాయి. అందులో తప్పు లేదు. అయితే సమస్యంతా అవేవో అతి అయినప్పుడే  వస్తాయి. మొన్న దుర్గాడలో ఏం జరిగింది ? పొలంలో పాము కన్పించింది. దాంతో కంగారుపడి  అందరినీ పిలిచాడు. అయితే ఆ పాము అనారోగ్యంతోనో, వృద్ధాప్యంతోనే పెద్దగా కదలికలులేకుండా  అక్కడే ఉండిపోయింది. దాంతో యిదేదో నాగదేవత వేంచేసిందని అంతా పూజలవీ మొదలెట్టేశారు. యింకా పూనకాల్లాంటివి సరే. ఈలోగా దానిని టీవీ 9 లో చూసిన  స్నేక్‌ ప్రేమికులెవరో ‘ అది అనారోగ్యంతో తినలేని పరిస్థితిలో  ఉంది. ప్రశాంతంగా వదిలి  పెట్టేయండి” అని చెప్పవలసి వచ్చింది. ఏతావాతా చెప్పేదేంటంటే నమ్మకానికీ మూఢత్వానికీ మధ్య ఉంటే అంతరం తక్కువ. ఆ అంతరాన్ని గుర్తించి  ప్రవర్తించడమే అసలయిన విజ్ఞత” అంటూ వివరించాడు.
                                                                                                                డా. కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here