వెనుకబడిన వర్గాలకు చట్టసభల్లో స్ధానం దక్కాలి

0
179
కర్నాటక బిసీ కమీషన్‌ మాజీ ఛైర్మన్‌ ద్వారకానాధ్‌
రాజమహేంద్రవరం,సెప్టెంబర్‌ 15 : వెనుకబడిన వర్గాలకు చట్టసభల్లో స్ధానం దక్కినప్పుడు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని కర్ణాటక బిసి కమీషన్‌ మాజీ చైర్మన్‌ ద్వారకానాధ్‌ పేర్కొన్నారు. రాజకీయ చైతన్య వేదిక పేరుతో నూతనంగా ఒక పార్టీని ఏర్పాటు చేస్తున్నామని దీని ద్వారా బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులరిజర్వేషన్లకు జనాభా ప్రాతిపదిక అవసరం లేదు..వెనుకబాటుతనమే ప్రామాణికం కావాలన్నారు. బిసీలో 150 కులాలు వున్నాయని చెబుతున్నారని అయితే 95శాతం కులాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. రాజ్యాధికారాన్ని అనుభవించని సామాజిక వర్గాలలో రాజకీయచైతన్యం వచ్చినప్పుడే సమాజంలో మార్పు వస్తుందన్నారు. రాజకీయ పార్టీలు బడుగు,బలహీన వర్గాలను ఓటు బ్యాంకులుగానే చూస్తున్నారు తప్ప సీట్లు కేటాయించకపోవడంతో వారికి రాజకీయ ప్రాధాన్యత దక్కడం లేదన్నారు. సామాజిక వర్గ దామాషా ప్రాతిపదికన రాజకీయపక్షాలు సీట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసారు. కర్నాటకలో బడుగు బలహీనవర్గాలు రాజ్యాధికారంలో వుంటే, ఏపీలో మైనారిటీ సామాజిక వర్గాలే రాజ్యమేలుతున్నాయని వ్యాఖ్యానించారు. వెనుకబడిన వర్గాలను అన్ని రాజకీయ పార్టీలు గుర్తించి తగిన ప్రాతినిధ్యం కల్పించే వరకు తాము పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నామన్నారు. కాపు రిజర్వేషన్ల బిల్లు ప్రక్రియ సక్రమంగా లేదు. వెనుకబడిన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యతే ప్రధానాంశంగా ఆదివారం రాజమహేంద్రవరంలో రాజకీయ చైతన్య వేదిక ఆధ్వర్యంలో సదస్సుు ప్రముఖ న్యాయవాది ఎస్‌.జి.రామారావు  వెల్లడించారు. ద్వారకానాధ్‌ భిన్నమైన ధృక్పధంతో బిసి కమీషన్‌ చైర్మన్‌గా విధులు నిర్వర్తించారన్నారు. అక్కడ బిసి జాబితాల్లో తొలగించిన కులాలను తిరిగి చేర్చడంలో కూడా సఫలీకృతులయ్యారని ప్రశంసించారు. కులాల పరిస్థితులపై అధ్యయనం చేయడం ద్వారా వారికి రిజర్వేషన్లు కేటాయించాలని ప్రయత్నించారని పేర్కొన్నారు. సమావేశంలో చాంబర్‌ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, మాజీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్‌, ఎన్‌ఎన్‌ఎస్‌ చంద్రశేఖర్‌, పెదిరెడ్ల శంభూప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here