వెలుగునీడలు

0
354

మనస్సాక్షి – 1080

గిరీశం ఒకటే హడావిడి పడిపోతున్నాడు. దానిక్కారణం అవతల పెళ్ళి చూపులవాళ్ళు వస్తుండడమే. యింతకీ ఆ పెళ్ళి చూపు లేవో తనకనుకుంటే పొరబాటే. అవేవో అచ్చంగా తన శిష్య రత్నమూ, బంధుపర మాణువూ అయిన వెంకటేశానికి..! మామూ లుగా అయితే యింకా ఏ ఉద్యోగం, సద్యోగం లేని వెంకటేశానికి సంబంధాలు రావడం గగనమయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఈ సంబంధం వచ్చిందాయె. మామూలుగా అయితే ఈ పెళ్ళిచూపులేవో అమ్మాయి యింట్లో పెట్టాలి. అయితే అమ్మాయివాళ్ళు ముందుగా అబ్బాయిని చూసుకుని, మాట్లాడింతర్వాత ఓ నిర్ణయానికి వచ్చి అప్పుడు అమ్మాయిని చూపిస్తానన్నారు. అందుకే ముందుగా వాళ్ళొస్తోంది. ఆ వచ్చేది కూడా ఏదో ఒకళ్ళో యిద్దరో కాకుండా ఓ పాతికమంది దాకా వస్తున్నారు. అందులోనూ అమ్మాయి తరపున మేనమామ గిరీశాన్ని ”ఎంతయినా ఈ వ్యవహారంలో మీరు పెద్దగా ఉంటే బావుంటుంది” అని ఓ మాటనేశాడు. యింకేముంది.. గిరీశం ఆ బోడి పెద్దరికమేదో భుజాన వేసుకుని ఆ పెళ్ళి చూపుల కార్యక్రమమేదో తన యింట్లోనే ఏర్పాటు చేశాడు. పైగా వచ్చినోళ్ళందరికీ భోజనాలు కూడా పురమాయించాడు. వాళ్ళంతా ఉదయం పదకొండింటికల్లా వచ్చి ఆ పెళ్ళి చూపుల తంతేదో కానిచ్చేసి, ఆనక భోజనాలు కానిచ్చేసి వెళ్ళిపోవాలి. అందుకే గిరీశం కూడా వంటలవీ బాగా చేసే సుందర్రావుకి ఆ పని పురమాయించాడు. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ పన్నెండింటికల్లా అన్ని రకాల వంటలూ వండెయ్యాలి’ అని మరీ మరీ చెప్పాడు. అనుకున్నట్టుగానే అనుకున్న సమయానికి గిరీశం యింట్లో పెళ్ళి చూపుల జనాలేవో వచ్చెయ్యడం, వాళ్ళకి వెంకటేశం పిచ్చ పిచ్చగా నచ్చెయ్యడం జరిగిపోయాయి. తర్వాత అందరూ కబుర్లలోపడ్డారు. దాదాపు పన్నెండున్నర కావస్తుండగా గిరీశం గబగబా వంటలు వండుతున్న పెరట్లోకి నడిచాడు. అక్కడున్న సుందరంతో ”తొందరగా వడ్డించెయ్‌” అన్నాడు. దాంతో సుందరం యిబ్బందిపడి ”ఒక్క రెండు నిమిషాలు సారూ.. 85 శాతం రడీ అయిపోయాయి. రెండు నిమిషాలాగితే మిగతాదీ పూర్తయిపోద్ది” అన్నాడు. దాంతో గిరీశం ఏవనుకున్నాడో ”ఎలాగా రెండు నిమి షాల్లో అంతా పూర్తయిపోతుందంటున్నావు కదా.. ముందా 85 శాతం వడ్డిం చెయ్‌.. వాళ్ళు తింటున్నప్పుడే మిగతాది వడ్డించేయొచ్చు. ఆలస్యమయితే ఆ వచ్చినోళ్ళు వెళ్ళిపోయేలాగుతున్నారు” అన్నాడు. దానికి సుందరం ఏదో చెప్పబోయేంతలోనే గిరీశం కాస్తా లోపలకెళ్ళిపోయి అందరినీ భోజనానికి పిలిచేశాడు. యింకో రెండునిమిషాల్లో అంతా వచ్చి వరసగా భోజనాలకి కూర్చు న్నారు. అందరి ముందా విస్తర్లు వేసేసి, దాంట్లో స్వీటూ, పచ్చడి, కూరలూ, ఉప్పు, అప్పడంలాంటివన్నీ వేసేశారు. యింకా గ్లాసులో మంచినీళ్ళు, యింకో కప్పులో పెరుగూ ఆ పక్కనుంచారు. యింకో పక్క అరటిపండూ, కిళ్ళీ కూడా పెట్టేశారు. అయితే ప్లేటులో అన్నం, బిర్యానీ, పులిహోరల్లాంటివేవీ యింకా వడ్డించకపోవడంతో వాళ్ళు పచ్చడీ, కూరా రుచి చూస్తున్నారు. ఈలోగా అక్కడకొచ్చిన గిరీశం అదిరిపోయి, సుందరాన్ని పక్కకి పిలిచి ”యిదేంటీ.. 85 శాతం రడీ అయిపోయాయన్నావు..” అన్నాడు. దాంతో సుందరం కూడా గట్టిగానే ”అవునండీ.. నేను ముందే చెప్పాగా. మొత్తం అయిటెమ్స్‌ 20. అందులో 17 రకాలు అయిపోయాయి. అదిగో.. ఉప్పు, పచ్చడి, అరటిపండు, మంచినీళ్ళు, కూరలు, స్వీటూ, పెరుగు.. యివన్నీ లెక్కేస్తే 17 రకా లుంటాయి. అంటే 85 శాతం రడీ అయిపోయినట్టే కదా” అన్నాడు. దాంతో గిరీశం నీరసంగా ”యింకా రడీ అవ్వాల్సిన మూడు అయిటెమ్స్‌ ఏంటం టావ్‌?” అన్నాడు. దాంతో సుందరం తేలిగ్గా ”ఏవుంది సారూ.. అన్నం, బిర్యానీ, చపాతి” అన్నాడు. దాంతో గిరీశం తల పట్టుకున్నాడు. వెంకటేశం ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. తీరా చూస్తే అంతా కల..! ‘యిదేంటీ.. యిలా నా పెళ్ళికే ఎసరుపెట్టే కలొచ్చిందేంటీ’ అను కున్నాడు. అటూ యిటూ చూస్తే యింకా గిరీశం వచ్చిన జాడలేదు. దాంతో మళ్ళీ అలా అరుగుమీదే చిన్న కునుకు లాగించాడు. ఈసారి ఆ నిద్రలో యింకో కలొచ్చింది…

——

వెంకటేశానికి ఉన్నట్టుండి తన ఊరికి ఏదో చెయ్యాలన్న కోరిక పుట్టేసింది. అయితే తనుం డేది రాజమండ్రిలోనాయె. మరెలా అని ఆలో చిస్తుంటే అప్పుడు ఓ మహత్తరమయిన ఆలో చన తట్టింది. తన ఊళ్ళో ఎవరూ లేక రోడ్ల మీద ఆకలితో తిరిగే పిల్లలు చాలా మందు న్నారు. వాళ్ళకి ఏదయినా ఒక హోమ్‌లాంటిది. ఏర్పాటు చేస్తే బాగుంటుందనిపించింది. అను కున్నదే తడవుగా ఊళ్ళో ఒక అద్దె యిల్లు తీసుకుని దాంట్లో హోమ్‌లాంటిది పెట్టేశాడు. యిక ఆ వ్యవహారాలవీ చూడటానికి గంగల కుర్రులో ఉండే తనకి నమ్మకస్తుడయిన జానకి రామ్‌ని పెట్టుకున్నాడు. దాంతో ఓ మంచి పని చేస్తున్న సంతృప్తితో వెంకటేశం తిరిగి రాజమండ్రి వెళ్ళిపోయాడు. ఓ పదిహేనురోజులాగి వెంకటేశం జానకిరామ్‌కి ఫోన్‌ చేసి వ్యవహారాలు ఎలా నడుస్తున్నాయా అని ఆరా తీశారు. అవతల్నుంచి జానకిరాం ”ఆ.. బాగానే నడుస్తున్నాడు. ముందు ఖర్చులికి ఓ పదివేలు పంపించు” అన్నాడు. ‘అతెందుకూ..’ అనబోయి అంతలోనే ఏవనుకున్నాడో వెంకటేశం ఆ డబ్బేదో పంపించేశాడు. యింకోనెల గడిచింది. ఈసారి జానకిరామ్‌ ఫోన్‌ చేశాడు. ”పిల్లలకి బిర్యానీలవీ పెట్టాలి. అర్జంటుగా ఓ యిరవై వేలు పంపించు” అన్నది ఆ ఫోన్‌ సారాంశం. దాంతో వెంకటేశానికి అనుమానమొచ్చింది. ‘అసలు యింత ఖర్చు పెట్టే అవసరం ఉందా.. ఖర్చు పెడుతున్నాడా’ అనుకున్నాడు. దాంతో ఆ డబ్బులేవీ పంపించకుండా గంగలకుర్రులో ఉండే యింకో మిత్రుడు మూర్తికి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. ఆరోజు సాయంత్రం మూర్తి నుంచి ఫోనొచ్చింది. ”రేయ్‌.. యిక్కడ హోమ్‌లో పిల్లలంతా ఎండిపోయినట్టే ఉన్నారు. అంతేగానీ వాళ్ళేవీ రోజూ బిర్యానీలూ గట్రా లాగించే పరిస్థితులేం కనపళ్ళేదు” అన్నాడు. దాంతో వెంకటేశంలో అనుమానం బలపడిపోయింది. దాంతో అప్పటికప్పుడే జానకిరాంకి ఫోన్‌ చేసి ”ముందో వెయ్యి పంపు తున్నాను. ముందు యింతకు ముందు ఖర్చు పెట్టిందానికి లెక్కలు రాసి పంపించు. అప్పుడు నువ్వుడిగిన డబ్బేదో ఆలోచిస్తానులే ! అంటూ ఫోన్‌ పెట్టేశాడు.

——

..వెంకటేశానికి మెలకువొచ్చేసింది. ఈసారి యింకో రకం కలొచ్చిందేంటీ అనుకున్నాడు. తనకొచ్చిన కలల గురించి ఆలోచిస్తుండగానే మార్నింగ్‌ వాక్‌ నుంచి గిరీశం తిరిగొచ్చాడు. వస్తూనే వెంకటేశం వాలకం చూసి ”ఏవివాయ్‌.. ఏదో తెగ ఆలోచించేస్తున్నట్టున్నావ్‌?” అన్నాడు. దాంతో వెంకటేశం ”అవును గురూగారూ.. రెండు కలలొచ్చాయి. రెండింటికీ ఏ సంబంధం కనిపించడం లేదు” అంటూ తనకొచ్చిన కలలు చెప్పాడు. అప్పుడు గిరీశం ”రెండూ ఒకటేనోయ్‌.. అదే.. ఒకే విషయానికి రెండు భిన్న కోణాలు. అదెలాగంటే.. యిందులో మొదటి కల మన రాష్ట్రానికి నిధులిచ్చే విషయంలో కేంద్రం తీరు గురించి టిడిపి వాళ్ళు అనేది. ఎంతసేపటికీ బీజేపీ నాయకులు యివ్వవలసిన దాంట్లో 85 శాతం దాకా యిచ్చేశామనీ, యిక యివ్వాల్సింది నామమాత్రమే అన్నట్టుగా మాట్లాడుతున్నారాయె. యిక నీ రెండో కల బీజేపీవాళ్ళ వెర్షననుకో. రాజధాని నిర్మాణానికో, పోలవరానికో, యింకో యితర పథకాలకో కేంద్రం చెప్పాలనీ వాళ్ళ వాదన” అంటూ ఆపాడు. దాంతో వెంకటేశం ఆసక్తిగా ”యింతకీ యిందులో ఎవరిమాట నమ్మాలంటారు?” అన్నాడు. దాంతో గిరీశం భారంగా నిట్టూర్చి ”చెట్టుముందరా.. విత్తు ముందరా అంటే ఎలా చెబుతాం? అలాగే యిదీనూ. యిద్దరికిద్దరూ తమ వాదనల్లో స్ట్రాంగే. అయితే ఒకటి మాత్రం నిజం. యిద్దరి వైపూ లొసుగులున్నాయి. ఓ రకంగా అవతలివాళ్ళ మీద ఆధారపడి నడవాల్సిన పరిస్థితి. అందుకే కటీఫ్‌ అంటూనే సహజీవనం కొనసాగిస్తున్నారు” అంటూ తేల్చాడు. దాంతో వెంకటేశం మనసులో ‘వాళ్ళ సంగతేమోగానీ మధ్యలో మన రాష్ట్రం నిండా మునిగిపోయింది’ అని గొణుక్కున్నాడు.

– డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here