వేగంగా పోలవరం ప్రాజక్ట్‌  పూర్తి చేస్తాం..

0
315
కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ
రాజమహేంద్రవరం, జులై 12 : కేంద్ర ఉపరితల రవాణా,  జలవనరుల శాఖ మంత్రి నితిన్‌గడ్కరి గత సాయంత్రం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సాయంత్రం ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం చేరుకున్న మంత్రి అక్కడి నుంచి హెలికాఫ్టర్‌ ద్వారా పోలవరం నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి పోలవరం స్పిల్‌వే పనులను పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన నిర్మాణ పనుల వివరాలను అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. పనుల్లో పురోగతి, ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగిస్తున్న సాంకేతికత తదితర అంశాలపై గడ్కరీ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రతి నెలా ప్రాజెక్టును సందర్శిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తిచేసేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కొరత సమస్య కాదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు పూర్తి వ్యయం ప్రస్తుతం 60 వేల కోట్లకు చేరుతోందన్న మంత్రి పూర్తి వ్యయంలో సగం భూసేకరణకే ఖర్చవుతోందన్నారు. ఓ రైతుగా తనకు నీట ివిలువ తెలుసని, పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ఎన్నో సమస్యలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. భూసేకరణ చాలా కీలకమైన సమస్య అని, నూతన భూసేకరణ చట్టం ప్రకారమే నిధులు కేటాయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. ప్రాజెక్టు పరిధిలోని గిరిజనులకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు కేంద్రం క షి చేస్తుందని తెలిపారు. 2019 ఫిబ్రవరికి ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఆర్ధిక శాఖ అనుమతులు మంజూరు చేసిన వెంటనే ముందస్తు నిధులు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రాజెక్టును పూర్తిచేసేందుకు చంద్రబాబు గట్టిగా ప్రయత్నిస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి వంటిదని అన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి డయాఫ్రం వాల్‌ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, మొత్తంగా 26 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తయినట్లు ఆయన తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ వ్యయం బాగాపెరిగిందని, ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం క షి చేస్తోందని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here