వేడెక్కిన హస్తిన

0
211

పార్లమెంట్‌లో తెదేపా ఎంపీల ఆందోళన

ఏపీ డిమాండ్లకు మద్ధతు ఇవ్వాలని లోక్‌సభ పక్ష నేతలకు చంద్రబాబు లేఖలు

ఢిల్లీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధుల మహాధర్నా

ఈ సాయంత్రం ఢిల్లీకి మంత్రి యనమల

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 : పార్లమెంట్‌ మలి విడత బడ్జెట్‌ సమావేశాల్లోనూ ఆంధ్రప్రదేశ్‌ ఎం.పీ.ల నిరసన కొనసాగింది. గత నెలలో ముగిసిన పార్లమెంట్‌ బడ్జెట్‌ తొలి విడత సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎంపీలు పార్లమెంట్‌ బయట, లోపల నిరసనలు తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ నిరసనలు కొనసాగుతుండగానే పార్లమెంట్‌ సమావేశాలు వాయిదా పడ్డాయి. అయితే ఈలోగా ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాకపోవడంతో తెలుగుదేశం పార్టీ ఎం.పీ.లు తమ నిరసన కొనసాగించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈరోజు ప్రారంభమైన సమావేశాల్లో అటు లోక్‌సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ తెదేపా ఎంపీలు తమ నిరసన కొనసాగించడంతో సభల్లో గందరగోళం నెలకొని సమావేశాలు సజావుగా సాగే పరిస్థితులు లేకపోవడంతో లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కొద్దిసేపు వాయిదా వేశారు. అయితే తిరిగి సమావేశమయయ్యాక కూడా తెదేపా ఎంపీలు ప్లకార్డులు చేతపట్టి స్పీకర్‌ పోడియం వద్ద నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. కాగా ఏపీకి న్యాయం చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలంటూ వివిధ పార్టీల లోక్‌సభ పక్ష నేతలకు తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు లేఖలు రాశారు. ఇలా ఉండగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్‌షాలతో చర్చించేందుకు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ సాయంత్రం ఢిల్లీ వెళుతున్నారు. ఈ సమావేశంలో ఏపీకి ఇంకా రావలసిన నిధులు, అమలు కావలసిన హామీలు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈరోజు ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద మహా ధర్నా నిర్వహిస్తున్నారు. ఆ పార్టీ ఎంపీలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here