వైకాపా అభ్యర్ధుల విజయానికి శక్తివంచన లేకుండా కృషి

0
256
సీసీసీ మేనేజింగ్‌ డైరక్టర్‌ పంతం కొండలరావు
రాజమహేంద్రవరం, మార్చి 22 :  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధుల విజయానికి తాను, తన మిత్ర బృందం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సీసీసీ మేనేజింగ్‌ డైరక్టర్‌ పంతం కొండలరావు అన్నారు. ఆ పార్టీ సిటీ అభ్యర్థి రౌతు నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న పంతం, మాజీ కార్పొరేటర్‌ ప్రసాదుల హరనాథ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. వైఎస్‌ జగన్‌ పిలుపు మేరకు హైదరాబాద్‌ వెళ్ళి ఆ పార్టీలో చేరామని, తాను చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఆయనకు ఎంతగానో  నచ్చాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బేషరతుగా పార్టీలో చేరుతున్నట్లు చెప్పిన ఆయన  అధినేత మోముపై చిరునవ్వు కొనసాగాలన్నదే తన ఉద్ధేశ్యమన్నారు. ఒకట్రెండురోజుల్లో తన బృందం కూడా జగన్‌ సమక్షంలో పార్టీలో చేరుతారన్నారు. తన భార్య, మేయర్‌ పంతం రజనీ శేషసాయి తెదేపాలోనే కొనసాగుతున్నారని, ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ఉద్ధేశ్యం తనకు లేదన్నారు. రాజకీయాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆదర్శవంతంగా ఉండాలన్నది తన కోరిక అని, అందుకు భగవంతుడు అవకాశం కల్పించాల్సి ఉందన్నారు. రౌతు సూర్యప్రకాశరావు తనకు మంచి మిత్రుడని, కాంగ్రెస్‌ పార్టీ నుంచి తమ సాన్నిహిత్యం కొనసాగుతోందన్నారు. గత నగర పాలక సంస్థ ఎన్నికల్లో తన భార్య రజనీ మేయర్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నప్పుడు రౌతు సూర్యప్రకాశరావు సతీమణి ఎన్నికల బరి నుంచి తప్పుకుని స్నేహానికి విలువ ఇచ్చారని అన్నారు. అందుకు కృతజ్ఞతగా ఈ ఎన్నికల్లో రౌతును గెలిపించడమే తన లక్ష్యమన్నారు.  గత ఎన్నికల్లో రూరల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గోరంట్ల విజయానికి తమ బృందం ఎంతో కృషి చేసిందని, అయినా ఆ పార్టీ నుంచి తగిన గుర్తింపు లభించలేదని అన్నారు. తమకు  కుటుంబ సభ్యులైన ఆకుల వీర్రాజు  వైకాపా అభ్యర్థిగా  బరిలోకి దిగిన నేపథ్యంలో ఆయన విజయానికి కూడా కృషి చేస్తామన్నారు. తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన దివంగత జక్కంపూడి రామ్మోహనరావు తనయుడు రాజాను రాజానగరం నియోజకవర్గం నుంచి గెలిపించడానికి కృషి చేస్తామన్నారు. అందరూ ఏకత్రాటికి వచ్చి ఈ మూడు చోట్ల వైకాపా అభ్యర్ధుల విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here