వైకాపా పార్లమెంట్‌ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా మార్గాని భరత్‌ 

0
398
జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన మార్గాని నాగేశ్వరరావు, భరత్‌
రాజమహేంద్రవరం, నవంబర్‌ 12 : నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జెఏసీ కన్వీనర్‌ మార్గాని నాగేశ్వరరావు, ఆయన కుమారుడు ,యువ నటుడు భరత్‌ ఈరోజు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నాగేశ్వరరావు కొంత కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆర్‌. కృష్ణయ్య సారధ్యంలోని బీసీ సంక్షేమ సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నాగేశ్వరరావు అభిమానుల, శ్రేయోభిలాషుల సలహా, సూచనల మేరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. హత్యాయత్నం నుంచి సురక్షితంగా బయటపడి నేటి నుంచి తిరిగి విజయనగరం జిల్లాలో  ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించిన వైకాపా అధ్యక్షుడు జగన్‌ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. వైకాపా నేతలతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు వెంట రాగా నగరం నుంచి నిన్న భారీ ప్రదర్శనగా వెళ్ళి విజయనగరం జిల్లా సాలూరులో ఉన్న జగన్‌ను ఈరోజు కలిసి ఆయన సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. వారికి పార్టీ కండువాలు కప్పి జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. కాగా  వీరు చేరిన వెంటనే మార్గాని భరత్‌ను పార్టీ రాజమహేంద్రవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా జగన్‌ ప్రకటించారు. పార్లమెంట్‌ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేయవలసిందిగా ఈ సందర్భంగా భరత్‌కు జగన్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గం వైకాపా టిక్కెట్‌ను బీసీ సామాజిక వర్గానికి కేటాయిస్తామని జగన్‌ ఇదివరలోనే ప్రకటించిన నేపధ్యంలో నాగేశ్వర చేరిక ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా మార్గాని వెంట పార్టీ సీజీసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మీ, సిటీ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, పార్టీ నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్‌, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here