శతమొండి…రణపెంకి

0
51
(నవీనమ్‌)
శతమొండి…రణపెంకి…ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి ఈ రెండు పదాలూ వర్తిస్తాయి. ఈ లక్షణాలే పట్టిన పట్టులో ఆయన్ని మడమ తిప్పని యోధుడిగా నిలబెట్టాయి. ఈ లక్షణాలే ఆయనకు చిన్న వయసులో ముఖ్యమంత్రి పదవిని తెచ్చిపెట్టాయి. ఈ లక్షణాలే ఆయన కక్ష సాధించే ఫాక్షనిస్టు అని పదేపదే గుర్తుచేస్తున్నాయి. అయితే, ఆయనకు తాను తలపెట్టిందే తప్ప ప్రజాభిప్రాయం మీద మన్ననా గౌరవాలు లేవని రాజధాని వివాదం ప్రపంచానికి తెలియచేస్తోంది. ముఖ్యమంత్రి అభీష్టాన్ని నెరవేర్చుకునే ప్రక్రియలో జిఎన్‌ రావు, బోస్టన్‌, హైపవర్‌ కమిటీలు తంతు ముగించే లాంఛనాలు మాత్రమే ! ప్రజాభిప్రాయ సేకరణలో కమిటీ ప్రమేయమేమీ లేదని జగన్‌ శాసనసభలో ముందుగానే వెల్లడించిన విషయాలనే రిపోర్టుగా ఇవ్వడాన్ని బట్టి స్పష్టమై పోయింది.  అమరావతిలో ఒకటి, కర్నూలులో ఒకటి, విశాఖలో ఒకటి అంటున్న మూడు రాజధానుల ప్రస్తావన కూడా న్యాయస్ధానానికి గంతలు కట్టడానికే ! రాజధానుల విస్తరణేతప్ప మార్పులేదని కనికట్టు కట్టడానికే ! ఆచరణలోజరగబోయేది రాజధానిని విశాఖకు మార్చడం తప్ప మరేమీ కాదు. అమరావతి ప్రాంతం ప్రజల్లో ఉద్యమం మొదలయ్యాక, వొద్దంటే మరింత రెచ్చిపోయే జగన్‌  లక్షణం కూడా బయట పడింది. ల్యాండ్‌ పూలింగ్‌లో ఇచ్చిన భూములపై రైతులతో ఒప్పంద పడిన సిఆర్‌ డిఎనే రద్దుచేయాలన్న ఆలోచన వచ్చింది. రాజధాని మార్పుపై తుది నిర్ణయాన్ని ప్రకటించడానికి, ఆ మేరకు చట్టం చేయడానికి శాసనసభను 20 నుంచి 3 రోజులు జరపాలని నిర్ణయమైంది. ఈ లోగానే హైపరర్‌ కమిటీ రిపోర్టు రావాలని సూచన వెళ్ళింది. సంఖ్యాబలం లేని శాసన మండలిలో కొత్తచట్టానికి ఆమోదం దొరకకపోవచ్చు కనుక, దీన్ని ద్రవ్య బిల్లుగా ప్రవేశపెట్టాలని వ్యూహం పన్నారు. రైతులకు పరిహారం ఇవ్వవలసి వున్నందున ద్రవ్యబిల్లు అని లేబుల్‌ వేస్తున్నారు. ద్రవ్యబిల్లును తోసిపుచ్చే అధికారం శాసనమండలికి లేదు. 24 కల్లాల మొత్తం ముగించెయ్యాలన్నది జగన్‌ ఆలోచన…సొంత శక్తితో 151 మందిని గెలిపించుకున్న ఆయనప్రతిపక్షాన్ని పట్టించుకోరు. అఖిల పక్షమంటే గౌరవం లేనివారు. సిబిఐ ని పర్యవేక్షించే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాని తప్ప జగన్‌ బహుశ మరెవరినీ ఖాతరు చేయరు.  ఈ నేపధ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌  బిజెపితో జతకట్టారు. దీంతో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. 20 న జరగవలసివున్న కేబినేట్‌ మీటింగ్‌ 18 కి ప్రీపోన్‌ అయ్యింది. 18 న నివేదిక ఇవ్వవలసివున్న హైపవర్‌ కమిటీ మరోసారి సమావేశమయ్యాకే రిపోర్ట్‌ ఇవ్వాలని నిర్ణయించింది. పర్యావసానంగా కేబినెట్‌ సమావేశం 20 కి పోస్ట్‌ పోన్‌ అయ్యింది. బీజేపీ రాజధానిగా అమరావతే ఉండాలని పట్టుబడుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై ఎటువంటి జోక్యం చేసుకోమని తేల్చి చెప్పారు. రాజధాని అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి రాంమాధవ్‌ చెప్పారు. కానీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాత్రం ఇందుకు బిన్నంగా మాట్లాడుతున్నారు.  ఈ నేపధ్యంలో జగన్‌ ఆకస్మికంగా 18 న ఢిల్లీటూర్‌ పెట్టుకున్నారు. అమిత్‌ షా అపాయింట్‌ మెంటు కోరారని తెలిసింది. ఆ సమావేశాన్ని బట్టే రాజధాని విషయంలో నిర్ణయం వాయిదా పడొచ్చు ! మార్పులు జరగవచ్చు ! లేదా తదుపరి పర్యావసానాలకే జగన్‌ సిద్ధమైపోవచ్చు ! రాజధానిపై నిర్ణయంలో మార్పు లేదా వాయిదా జరిగితే అది పవన్‌ కల్యాణ్‌ ఎఫెక్టేనని ఖచ్చితంగా చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here