శరావణ

0
155
మనస్సాక్షి  – 1149
అప్పుడే తెల్లవారింది. గిరీశం యింట రుగు మీద కూర్చుని వెంకటేశం కోసం ఎదురు చూస్తున్నాడు. వెంకటేశం కూడా వస్తే యిద్దరూ మార్నింగ్‌ వాక్‌కి వెళ్ళడం అలవాటు. యింకో గంటయినా వెంక టేశం జాడలేదు. అయితే అప్పుడో విశేషం జరిగింది. వెంకటేశం అయితే రాలేదు గానీ వెంకటేశానికి సంబం ధించిన ఫోనొకటి వచ్చింది. అదీ పోలీస్‌ స్టేషన్‌ నుంచి..! దాంతో గిరీశం ఆదరా బాదరా పోలీస్‌స్టేషన్‌కి పరిగెత్తాడు. ఆపాటికి వెంకటేశం సెల్‌లో ఉన్నాడు. ఆ పరిస్థితిలో వెంకటేశాన్ని చూడగానే గిరీశం అదిరిపోయి ”ఏంటోనోయ్‌..ఎక్కడికో వెడతావనుకున్నా.. చివరికి యిక్కడకొచ్చి పడ్డావన్నమాట. యింతకీ ఏవయింది?” అన్నాడు. దాంతో వెంకటేశం కూడా ఉక్రోషంగా ”కందుకూరి వీరేశ లింగం గారి ఆదర్శాలు నిలబెడదామని ప్రయత్నం చేస్తుంటే యిలా లోపలేసేశారు” అన్నాడు. దాంతో గిరీశం షాకయి ”అదేం దారుణమోయ్‌.. అసలేం జరిగింది?” అన్నాడు. దాంతో వెంక టేశం జరిగిందంతా చెప్పడం మొదలెట్టాడు..
——
గంగలకుర్రులో వెంకటేశం గారిల్లు.. వెంకటేశం తండ్రి, వెంక టేశం మేనమామ నరసింహం యింటి ముందు ఆవరణలో కూర్చుని ఉన్నారు. యింతలోనే పెళ్ళిళ్ళ వ్యవహారాలన్నీ చూసే అవధాని లోపలకొచ్చాడు. అవధానిని చూడగానే నరసింహం ”ఏంటవ ధానీ.. మా మేనల్లుడికి సంబంధాలు చూడవా?” అన్నాడు. ఈలోగా అవధాని కుర్చీలో సెటిలై ”ఎందుకు చూడనూ.. బంగారంలాంటి కుర్రాడాయె. భేషుగ్గైన సంబంధం చూసే పూచీ నాది. ముందోసారి మీవాడిని పిలవండి” అన్నాడు. దాంతో నరసింహం ”రేయ్‌ వెంకన్నా.. ఓసారి యిలారా వింటున్న వెంకటేశం గబగబా వచ్చేశాడు. అవధాని గబగబా వెంకటేశం చేతిని తన చేతుల్లోకి తీసుకుని చేతి రేఖల్ని పరిశీలనగా చూశాడు. అవన్నీ  చూడగానే మొహం యింత చేసుకుని ”అబ్బో.. మహర్జాతకమే” అన్నాడు. దాంతో అంతా ఆసక్తిగా అవధాని వంక చూశారు. అవధాని కొనసాగిస్తూ ఈ జాతకుడిది మామూలు జాతకం అయితే కాదు. మహద్బుతమయిన జాతకం. అయితే యింకో జాతకురాలు యితని జీవితంలో ప్రవేశించి నప్పుడే ఆ ఫలితం ఏదో చేతికొస్తుంది” అన్నాడు. దాంతో వెంక టేశం తండ్రి ”అందుకే కదయ్యా.. వీడి కర్జంటుగా మంచి పిల్లని చూసి పెళ్ళి చేయమంటుంది” అన్నాడు. యింతలో ఓ విశేసం జరిగింది. వాళ్ళలా మాటల్లో ఉండగానే వాళ్ళ కళ్ళ ముందు ఓ మెరుపేదో మెరిసినట్టయింది. యింతకీ ఆ మెరుపు ఓ అంద మయిన అమ్మాయి. వాళ్ళ యింటి ముందు నుంచి నడుచు కుంటూ పోతోంది. వెంకటేశం అయితే వెళ్ళిపోతున్న అమ్మాయి వంక ఆసక్తిగా చూశాడు. దాంతో వెంకటేశం మేనమామ నర సింహం అలర్టయ్యాడు. ”యిదిగో అవధానీ.. ముందా అమ్మాయి ఎవరో తెలుసుకో” అన్నాడు. దాంతో అవధాని కూడా గబగబా లేచెళ్ళి దూరంగా పోతున్న ఆ మెరుపుతీగని ”యిదిగో అమ్మాయ్‌.. ఓసారి యిటురా” అంటూ పిలిచాడు. అంతటి పంతులుగారు పిలుస్తు న్నారు కదాని ఆ అమ్మాయి గబగబా దగ్గరకొచ్చింది. అప్పుడవ ధాని ”నీ పేరేంటమ్మాయ్‌?” అన్నాడు. దానికి ”నా పేరు మల్లికండీ” అని సమాధానమిచ్చింది. ఈలోగా అవధాని ”యిదిగో అమ్మాయ్‌.. ఓసారి ఆ చెయ్యిలా చూపించు” అన్నాడు. మల్లిక తలూపి తన ఎడమ చెయ్యి చూపించింది. అవధాని గబగబా ఆ రేఖల్ని పరిశీలించాడు. అవి చూడగానే అవధాని మొహంలో వెలుగొచ్చింది. ”నీది మహత్తర జాతకం అమ్మాయ్‌.. అసలు నువ్విక్కడ ఉండవలసిన దానివే కాదు. ఎక్కడో ఢిల్లీ పీఠం మీద ఉండవలసిన దానివి” అన్నాడు. దాంతో మల్లిక కొంచెంగా ఆనందపడింది. యింతలోనే అక్కడ కొచ్చిన  వెంకటేశం తండ్రి ”ఎవ రమ్మాయ్‌ నువ్వు?” అన్నాడు. దానికి మల్లిక ”నేనాండీ.. రామువి కూతు ర్నండి” అంది. ఈసారి షాక్‌ తినడం వాళ్ళందరి పనయింది. ఎందుకంటే రాములంటే వాళ్ళ పొలం పనులవీ చూస్తుంటాడు. పైగా వాళ్ళ వాళ్ళు కాదాయె..! వాళ్ళలా షాక్‌లో ఉండగానే మల్లిక ”మీరింకా ఏవయినా మాట్లాడా లేమో.. మానాన్నని పిలుస్తా” అంటూ తుర్రుమంది. యింకో పావు గంటలోపే మల్లిక వాళ్ళ నాన్నని వెంట బెట్టుకుని మరీ వచ్చింది. రాములు ఆ అందరికీ వినయంగా నమస్కరించి, ”ఏంటి బాబయ్యా.. రమ్మని పిల్లతో చెప్పారంట” అన్నాడు. నరసింహం తలూపి ”యిదిగో రాములూ.. మీ అమ్మాయి గొప్ప అదృష్టవంతురాలులే. అవునూ.. మీ అమ్మాయి పుట్టిన తారీకెంత?” అన్నాడు. దాంతో రాములు ఆలోచించి ”అయ్యన్నీ మాకేటి తెలుత్తాయి బాబూ.. ఆ.. అప్పుడు గోదారి పుష్కరాలు మొదలయిన రోజే ఉదయం పదింటికి పుట్టింది” అన్నాడు. దాంతో అవధాని గబగబా ఏవో లెక్కలేసి ”అబ్బో బ్రహ్మాండం… రాశి, నక్షత్రం, గ్రహాలస్థితి.. ఎలా చూసినా గొప్ప జాతకు రాలే” అన్నాడు.  యింతలోనే వెంకటేశం తండ్రి ”యిదిగో రాములూ.. మీ అమ్మాయి మల్లికని మా అబ్బాయి వెంకటేశానికొచ్చి పెళ్ళి చేద్దామనుకుంటున్నా” అన్నాడు. మామూలుగా అయితే ఆ మాటలు విని రాములు ఎగిరి గంతెయ్యాల్సిందే. అయితే అలాగేం జరగలేదు. ”బాబయ్యా…అది..అది.. మా పిల్లకి నాలుగేళ్ళనాడే మా మేనల్లుడికిచ్చి పెళ్ళి చేసేశా” అన్నాడు. దాంతో అంతా షాకయిపోయారు. అంతా ఒక్కసారిగా నిరాశపడ్డారు. ఎందుకంటే వెంకటేశానికి ఎలాగయినా మల్లికనే పెళ్ళాడాలనుంది. ఆ అందం అలాంటిదాయె. యింకోపక్క అమ్మాయి జాతక ప్రభావంతో కుర్రాడి జాతకం బ్రహ్మాండంగా మారిపోతుందని పెద్దవాళ్ళు కూడా ఆ అమ్మాయితో పెళ్ళికి మొగ్గుచూపుతున్నారు. యింతలో నరసింహం తేలిగ్గా ”యిదిగో రాములూ.. నువ్వప్పుడెప్పుడో తూతూ మంత్రంగా చేసిన  బాల్య వివాహాలేవీ చెల్లవు. అదేదో పక్కన పెట్టేసెయ్‌. మీ పిల్లని మావాడికిచ్చి బ్రహ్మాండంగా పెళ్ళి చేసేద్దాం. మహారాణిలా బతుకుతుంది” అన్నాడు. దానికి రాములేవీ మాట్లాడలేదు. ఈలోగా పక్కనున్న మల్లిక అలా తనకిష్టం లేదన్నట్టుగా రాములేవీ మాట్లాడలేదు. ఈలోగా పక్కనున్న మల్లిక అలా తనకిష్టం లేదన్నట్టుగా రాములి చేయి గిల్లింది. యిటువైపు ముగ్గురు పెద్దలు తన ముందు నిలబడి అంత గట్టిగా చెబుతుంటే రాములేవీ వాదించలేకపోతున్నాడు. దాంతో చివరికి ”సరే బాబయ్యా.. మీకెలా మంచిదనిపిస్తే అలాగ చేయండి” అన్నాడు. అలా అనేసి వెనుదిరిగాడు. అయితే దారిలో మల్లిక ”నాన్నా.. నేను బావని వదిలుండలేను” అంది.
——
”అది గురూగారూ… జరిగింది” కులాంతర వివాహానికి ప్రయత్నం చేశాను అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం అనుమానంగా ”మరి అదేనా వీరేశలింగం గారి సిద్ధాంతాలన్నావ్‌?” అన్నాడు. వెంకటేశం తలూపి ”అంతేకాదు గురూగారూ.. వీరేశలింగంగారు ఏవన్నారు? వితంతు వివాహాలు ప్రోత్సహించమన్నారు కదా. అదే ప్రయ త్నంలో ఉంటే పోలీసులు  పట్టుకొచ్చి లోపలేశారు. ఆ మల్లికకి తన మొగుడంటే వల్లమాలిన ప్రేమాయె. వాడు బతికుండగా తనతో పెళ్ళి జరగదు. అందుకే ముందుగా వాడిని బాల్చీ తన్నిం చేస్తే ఆనక మల్లిక విధవరాలయిపోతుంది. అప్పుడు పెళ్ళాడడం ఈజీ కదా అని వాడిని లేపించే ప్రయత్నం చేశా” అన్నాడు. దాంతో గిరీశం తలపట్టుకున్నాడు.
——
ఎవరో తట్టిలేపేసరికి వెంకటేశం ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఎదురుగా గిఋవం. ”ఏంటోయ్‌.. పగటి కలలేవో కంటున్నట్టు న్నావ్‌?” అన్నాడు. దాంతో వెంకటేశం తనకొచ్చిన కలంతా చెప్పాడు. అంతా విన్న గిరీశం ”అయితే ఈసారి నీ కలలోకి ఆ శరవణా గ్రూప్‌ అధినేత దూరినట్టున్నాడు. అతడినే తీసుకో. జీరోస్థాయి నుంచి ఎంతో కష్టపడి వేలకోట్ల స్థాయికి వెళ్ళాడు. వేలాదిమందికి ఉద్యోగాలిచ్చాడు. అందరితో దేవుడనిపించుకున్నాడు. అయి తేనేం.. ఒకే ఒక్క వీక్‌నెస్‌..అదే.. అందమయిన అమ్మాయంటే మోజు పడడమో, జాతకాలు నమ్మి యింకా మంచిదశ కోసం పెళ్ళయిన  అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకోవడమో.. ఆ ప్రయ త్నంలో ఆ అమ్మాయి భర్తని కూడా చంపించెయ్యడం జరి గింది. యిప్పుడది బయటపడి పరువుపోయి, సంపదలన్నింటికీ దూరంగా జైలులో యావజ్జీవిత శిక్ష అనుభవించాల్సి వస్తోంది. తెలుసుకోవల సింది ఏంటంటే.. ఎంతో కష్టపడి శిఖరాగ్రానికి చేరుకున్న వ్యక్తి  అక్కడ చేసే చిన్న ‘పొరబాటు’తో అగాధంలోకి పడిపోవచ్చు. మన వీక్‌నెస్‌లు కూడా ఆ ‘పొరపాట్లు’ లాంటివే అన్నాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here