శునకాలు, వరాహాల నిరోధంపై దృష్టి సారించండి

0
267
నగర పాలక సంస్థకు ఎమ్మెల్యే ఆకుల సూచన
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 19 : నగరంలో పందుల సంచారాన్ని నిరోధించడంపై, కుక్కల బెడదను నివారించడంపై దృష్టి సారించాలని సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సూచించారు. నగరంలోని పలు డివిజన్లలో పందులు, కుక్కల స్వైర విహారాన్ని నిరోధించడంలో నగర పాలక సంస్థ నిర్లక్ష్య వైఖరిని నిరశిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి అర్బన్‌ జిల్లా మాజీ అధ్యక్షులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యసింగ్‌,  పార్టీ నాయకులు లాల్‌బహుదుర్‌ శాస్త్రి మాట్లాడుతూ  నగరంలో కుక్కలతో పాటు పందుల బెడద పెరిగిందని, పందుల వల్ల వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు.  ఇప్పటికే డెంగ్యూ, చికెన్‌గున్యా వ్యాధులతో పాటు కుక్క కాటు బాధితులు పెరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నగర పాలక సంస్ధ అధికారులు స్పందించకపోతే కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. బిజెపి శ్రేణులు ఆందోళన చేస్తుండగా ఎమ్మెల్యే ఆకుల అక్కడికి చేరుకుని వారిని వారించారు. ఈ సమస్యపై కమిషనర్‌ విజయరామరాజుతో చర్చించారు. పందుల నివారణకు చెన్నై నుంచి 30 మంది సభ్యుల బృందాన్ని రప్పించామని, పందుల ఏరివేతకు వెళ్తుండగా కొంతమంది అడ్డుకోవడంతో పాటు దాడులు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో పోలీసుల సహకారం తీసుకుని పందుల్ని నివారించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మట్టాడి జయప్రకాష్‌, గుల్లిసల్లి యేసు వెంకటరమణ, అడ్డాల ఆదినారాయణ, అమరపల్లి సత్యనారాయణ, కారుమూరి గవర్రాజు, రౌతు వాసు, వానపల్లి శంకర్‌, నిల్లా ప్రసాద్‌, కుమ్మరపురుగు చిన్ని, పిల్లాడి రుద్రయ్య, ఎర్రా శ్యామలరావు, పెద్దిరెడ్డి రాజేశ్వరి, బొమ్మి తులసి, తంగుడు వెంకట్రావ్‌, కొత్తపల్లి గీత, కె కమల, గునిశెట్టి విజయ్‌కిరణ్‌, వాడపల్లి వరప్రసాద్‌, ఏలూరి జయశ్రీ,  కోరాడ సాయిబాబు, మావూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.