శ్వేతపత్రాల్లో కొరవడిన వాస్తవికత 

0
235
వీటిపై చర్చ నిర్వహించాలి : మాజీ ఎం.పి. ఉండవల్లి
చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత – జగన్‌కు లభిస్తున్న ఆదరణ అనూహ్యం
రాజమహేంద్రవరం, జనవరి 2 : రాష్ట్ర ప్రభుత్వం శాఖల వారీగా విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై చర్చ నిర్వహించాలని రాజమహేంద్రవరం పార్లమెంట్‌ మాజీ సభ్యులు ఉండవల్లి అరుణకుమార్‌ డిమాండ్‌ చేసారు. స్ధానిక ఎవి అప్పారావు రోడ్డులోని శ్రీకన్య పార్శిల్‌పైన గల సమావేశపు హాలులో ఈరోజు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఉండవల్లి మాట్లాడుతూ శ్వేతపత్రం అంటే వాస్తవిక అంశాలతో ఇచ్చేవని, అయితే ప్రభుత్వం ప్రకటిస్తున్న శ్వేతపత్రాలలో అది కొరవడిందన్నారు. పరిశ్రమ శాఖకు సంబంధించి శ్వేతపత్రాన్నే పరిశీలిస్తే రూ.18లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రకటించారని, అయితే క్షేత్రస్ధాయిలో పరిశ్రమలు ఎక్కడ వచ్చాయో కన్పించడం లేదన్నారు. జిల్లాకు సంబంధించి 40నుండి 50 పరిశ్రమలు వచ్చినట్లుగా పేర్కొన్నారని, అవి ఎక్కడ వచ్చాయో చూపించాలన్నారు. పోలవరం విషయంలో గానీ, ఇతర అంశాలలో కూడా శ్వేతపత్రాల్లో ఇచ్చిన అంశాలకు వాస్తవిక పరిస్థితులకు ఎక్కడా పొంతన లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా మే నాటికి గ్రావిటీపై నీరు ఇచ్చేస్తామని ప్రకటించారని, మేలో గోదావరిలో నీరు ఉండదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు గేటు పెట్టేసామని చెప్పుకుంటున్నారని, అయితే ఆ గేటు అక్కడ వేలాడుతుందని, మరొ నెలరోజులకు గానీ అది సెట్‌ కాదన్నారు. ప్రభుత్వం పోలవరం ద్వారా గ్రావిటీపై మే నాటికి నీరు ఇచ్చే పరిస్థితిలోనే ఉంటే సుప్రీంకోర్టుకు 6నెలలు ముందుగా అఫిడివిట్‌ దాఖలు చేయాల్సి ఉందని, అయితే ఆవిధంగా అఫిడివిట్‌ ఇచ్చిన దాఖలా కన్పించలేదన్నారు. ఎడమ కాలువకు టన్నెల్‌ తవ్వాల్సి ఉందని, దీనికి సంబంధించి సూర్య అనే కంపెనీకి నామినేషన్‌ పద్దతిపై పనులు అప్పగించే ప్రయత్నం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అన్ని వ్యవస్ధల్లో అవినీతి పేరుకుపోయిందన్నారు. పంచాయితీల్లో ఏర్పాటు చేస్తున్న ఎల్‌ఇడి బల్బు రూ. 650కు ఫిటింగ్‌ చేసే అవకాశం ఉండగా మూడు నెలలకు రూ.150 చప్పున పదేళ్ళ కాలానికి రూ.6వేలు చెల్లిస్తున్నారంటే ఇందులో అవినీతి ఏమేరకు జరుగుతుందో అర్ధం అవుతుందన్నారు. అధికారులకు ఇచ్చిన సాంసంగ్‌ జె2 ప్రో ఫోన్‌ ఖరీదు రూ. 8,800లు అయితే రూ. 10వేలకు కొన్నారని, ఇలా అన్నింటా అవినీతి చోటు చేసుకుంటుంటే… నేను నిప్పు అంటూ ఎలా చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టులో 60(సి) రూల్‌ చెప్పి, మిగిలిపోయిన వర్కులు పూర్తిచేయడానికి వందల, వేల కోట్ల కాంట్రాక్ట్‌ నామినేషన్‌ పద్దతిలో ఇచ్చేస్తున్నారని ఆరోపించారు. పోలవరంపై తాను లేవనెత్తే సందేహాలపై నివృత్తి చేసేందుకు ఇప్పటికైనా ప్రభుత్వం తరపున ఎవరో ఒకరిని పంపాలన్నారు. శ్వేతపత్రాలపై చర్చ జరపాలని తాను ప్రజల పక్షాన కోరుతున్నానన్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలపై ఛీఫ్‌ సెక్రటరీ స్ధాయిలో పనిచేసిన వ్యక్తులు విమర్శలు చేస్తున్నారంటే కనీసం వారి విమర్శలకైనా వారి స్ధాయి వ్యక్తులతో సమాధానం చెప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అధికారంలో ఉన్నాం తాము ఏదైనా చేస్తాం, ప్రజలకు సమాధానం చెప్పం అన్న వైఖరి ప్రజా స్వామ్యానికి చాలా ప్రమాదకరమన్నారు. నగరంలో ఇటీవల అపార్టుమెంట్‌ ప్రహారీ గోడ కూలిన ఘటనలో అక్కడ నిర్మిస్తున్న మల్టీప్లెక్స్‌ నిర్మాణం ఎటువంటి అనుమతులు లేకుండా చేపట్టారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తే, వెంటనే వారి ఇళ్ళపైకి సిటీ ప్లానింగ్‌ అధికారులను పంపించి భయపెట్టడం సరికాదన్నారు.  ఎన్నికలకు ఆరునెలల ముందు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారని, ఇలా అయితే ఐదేళ్ళకు కాకుండా ప్రతిఏటా ఎన్నికలు జరిగితేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. అన్న క్యాంటీన్‌లో భోజనానికి ప్రభుత్వం రూ.55 ఇస్తుందని, ఇదే భోజనాన్ని ఇస్కాన్‌లో మధ్యాహ్నం భోజన పధకం పిల్లలకు పెడుతున్నారని, దానికి ఇచ్చే దానితో పోల్చితే ఇది చాలా ఎక్కువన్నారు. అన్నక్యాంటిన్‌ భవన నిర్మాణం కూడా రూ.15లక్షలకు అయిపోతుందని, కానీ రూ. 45లక్షలు, రూ.55 లక్షలతో నిర్మించారన్నారు. దీనిని అవినీతి రహిత పాలనగా ఎలా చూస్తామని ప్రశ్నించారు. తెలంగాణాలో నిప్పును నీళ్ళు పోసి ఆర్పేశారన్నారు. కూటమి వల్ల టిఆర్‌ఎస్‌కు కష్టమే అన్న మాట విన్పించిందని, అయితే విజయాన్ని తన ఖాతాలో వేసుకుందామని చంద్రబాబు ప్రచారానికి వెళ్ళడంతో కేసీఆర్‌కు మంచి ఆయుధం దొరికినట్లు అయ్యిందన్నారు. ఎపిలో బీజేపికి బలమేమీ లేదని, విభజన నేపధ్యంలో కాంగ్రెస్‌ను తిట్టి చంద్రబాబు లబ్ధిపొందారని, అదే తరహాలో ఇప్పుడు బీజేపిని తిట్టి లాభం పొందాలని చూస్తున్నారన్నారు. అయితే  ఇక్కడ ఏమాత్రం బలంగా లేని బీజేపిని తిట్టడం వల్ల బాబుకు ఏ ప్రయోజనం ఉండదన్నారు. ఒక పక్క రాష్ట్రం నాశనం అయిపోయిందని గగ్గోలు పెడుతూనే మరో పక్క జీడీపిలో తామే దేశంలో టాప్‌లో ఉన్నామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అడ్డుక్కోవడానికి ఆడీ కారులో వెళితే ఎవరైనా ముష్టివేస్తారా అని ప్రశ్నించారు. ప్రజలు ఎప్పుడు కూడా గెలిపించడానికి ఓటు వేయరని, ఓడించడానికే ఓటు వేస్తారని, చంద్రబాబు నాయుడుపై గతంలో ఎన్నడూ లేనంతగా వ్యతిరేకత ఉందన్నారు. గతంలో వైఎస్‌, చంద్రబాబులు పాదయాత్రలు చేయడం ద్వారా అధికారంలోకి వచ్చారని గుర్తుచేస్తూ, జగన్‌ పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన ఉందన్నారు. పాదయాత్రకు భారీగా జనం వస్తున్నారని, ఇంత స్పందన దేశంలో మరో నేతకు చూడలేమన్నారు. జగన్‌ 2014లోనే అధికారంలోకి రావాల్సి ఉందన్నారు. ప్రక్క రాష్ట్రం ముఖ్యమంత్రిపై కేసీఆర్‌ అంతగా నోరు పారేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. విలేకరుల సమావేశంలో పొడిపిరెడ్డి అచ్చుతదేశాయ్‌, అల్లు బాబి, బండారు మధు, పసుపులేటి కృష్ణలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here