షర్మిళారెడ్డి వ్యాఖ్యలపై  మేయర్‌ ఆగ్రహం

0
388
షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తాం
రాజమహేంద్రవరం,ఆగస్టు 10 : రాజమహేంద్రవరం కౌన్సిల్‌, మేయర్‌ పీఠాన్ని వైసిపి ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిళారెడ్డి అవమానించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని నగర మేయర్‌ పంతం రజనీ శేషసాయి అన్నారు.  ఈ మేరకు  షర్మిళారెడ్డికి షోకాజ్‌ నోటీసు జారీచేస్తామని అందుకు సమాధానం చెప్పకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో మేయర్‌ ఈరోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల ఓట్లతో కార్పొరేటర్‌గా ఎన్నికై ప్రజల సమస్యలను పరిష్కారం చేసే పవిత్రమైన స్థలంగా ఉండాల్సిన కౌన్సిల్‌ను ప్రతిపక్ష వైకాపా సభ్యులు రంగస్థలంగా మార్చారని మండిపడ్డారు. కార్పొరేటర్ల మనోభావాలు దెబ్బతీసేలా గాజులు తొడుక్కున్నారా? అంటూ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఎందరో మహానుభావులు ఇదే కౌన్సిల్‌లో ప్రతిష్టాత్మకంగా వ్యవహరించి రాజమహేంద్రవరం ఖ్యాతిని ఇనుమడింప చేసారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. చిన్న పిల్లల మనస్తత్వం ఇంకా పోకపోతే మేడపాటికి ఉన్న ఈట్‌ ఎన్‌ ప్లేలో ఆడుకోవాలని మేయర్‌ వ్యంగ్యంగా అన్నారు.  ఎజెండా ఆమోదించే సమయంలో కౌన్సిల్‌లో కోరం ఉందో ? లేదో? అధికారులను అడిగితే తెలుస్తుందన్నారు. ఒక ఐఎఎస్‌ అధికారి సహా సీనియర్‌ అధికారులు కౌన్సిల్‌లో ఉన్నారని వారిని అడిగి అన్ని విషయాలు, నిబంధనలు తెలుసుకోవాలని సూచించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇటువంటి ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తమ పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి టీడీపీ కుటుంబ సభ్యురాలిగా వెళితే ఆవిడకెందుకని ప్రశ్నించారు. నగరాన్ని అభివృద్ధి చేయడమే అజెండాగా సిఎం చంద్రబాబు మార్గనిర్ధేశనం మేరకు పాలన చేస్తున్నామని స్పష్టం చేసారు. మేడపాటి వ్యవహారాన్ని, వ్యాఖ్యలను మాత్రం చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని ఇటువంటి పోకడలను సహించేదీ లేదని హెచ్చరించారు. తన డివిజన్‌లో అంబేద్కర్‌ పేరుతో మ్యూనిటీ హాల్‌ కడుతుంటే రేకుల షెడ్డుగా విలువ లేకుండా మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. మంచినీరు, రోడ్లు, వీధిలైట్లు ఇలా అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తున్నామని తెలిపారు. షర్మిళారెడ్డి తన డివిజన్‌ను పట్టించుకోవడం మానేసి పక్క డివిజన్‌ కార్పొరేటర్ల పరిధిలో వేలుపెట్టడమేమిటని మేయర్‌ నిలదీసారు.   ఫ్లోర్‌లీడర్‌గా ఉన్న వర్రే శ్రీనివాసరావు సీనియర్‌ కార్పొరేటర్‌ అని ఆయన సలహాలు తీసుకుంటే తప్పేంటన్నారు. పారదర్శకంగా ఆన్‌లైన్‌లో పింఛన్లు, రుణాలు అందిస్తున్నామన్నారు. ఇంత భారీస్థాయి నిధులతో అభివృద్ధి చేస్తూ.. నిబద్ధతతో పనిచేస్తున్న తనను విమర్శించడానికి మేడపాటి సరిపోదని వ్యాఖ్యానించారు. సమావేశంలో కార్పొరేటర్లు రెడ్డి పార్వతి, తలారి ఉమాదేవి, తాడి మరియ, సింహ నాగమణి, అగురు పద్మావతి, రేలంగి శ్రీదేవి, పాలవలస వీరభద్రం, మర్రి దుర్గా శ్రీనివాస్‌, ద్వారా పార్వతి సుందరి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here