సంపెంగ నూనె

0
335
మనస్సాక్షి  – 1116
వెంకటేశానికి ఉన్నట్టుండి వొంటినిండా దురదలు మొదలయ్యాయి. యింతకీ అవేవో చర్మ వ్యాధులు డాక్టరు గారు మందులిచ్చి తగ్గించే దురదలు కాదు. మరి.. సేవా దురదలు. అప్పుడప్పుడూ యిలా జరగడం వెంకటేశానికి మామూలే. అలాంటప్పుడు వెంకటేశం గబగబా జనాలకి ఆ సేవలేవో చేయడం, దాంతో ఆ దురదలేవో తగ్గడం జరుగుతుంటాయి. సాధారణంగా ఎలక్షన్ల ముందే యిలాంటివి వస్తుంటాయి కూడా. ప్రస్తుతం వచ్చిన దురదలు కూడా ఆ బాపతే. దాంతో వెంకటేశం ఏం చేయాలా అని ఆలోచించి తన సొంతూరైన గంగలకుర్రుకి ఏదో బలమైన సేవ చేసేద్దాం అన్న నిర్ణయానికి వచ్చేశాడు. అలా చేస్తే జనాల్లోనూ తన పేరు నానుతుంది., యింకా  మీడియాలోనూ హల్‌చల్‌ చేయొచ్చు.. అదంతా రాబోయే ఎలక్షన్స్‌లో పనికొస్తుంది… యిదీ వెంకటేశం ఆలోచన. దాంతో యింకాలస్యం చేయకుండా ఎర్రబస్సెక్కి గంగలకుర్రు బయలుదేరాడు.. అక్కడివరకూ ఊపుగానే  వెళ్ళిపోయాడు గానీ యిక అక్కడ్నుంచి ఏం చేయాలో అర్థం కాలేదు. ఊరికి ఏ రూపంలో ఖర్చు పెట్టాలన్నదే ఆ సమస్య. ఊరంతా ఎడాపెడా రోడ్లు వేయించేద్దామన్నా దానికో పాతికో లక్షలయ్యే లాగుంది. పోనీ మంచినీటి సౌకర్యాలు కల్పించేద్దామన్నా అదీ తడిసి మోపుడయ్యే లాగుంది. యింతకీ తను ఖర్చు పెట్టబోయేది అయిదు లక్షలే. మరలాంటప్పుడు అదిక్కడ ఏమూలకి వస్తుందో తెలీని పరిస్థితి. ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే అప్పుడింకో దివ్యమయిన ఆలోచననొచ్చింది. దాంతో ఊరికి చివరగా ఉన్న బాగా వెనకబడిన ప్రాంతానికి బయల్దేరాడు. అక్కడెలాగా బాగా తక్కువమందే ఉంటారు. ఆ చేసేదేదో వాళ్ళకి చేస్తే తనని దేవుడిలా చూస్తారు. యిక వాళ్ళ ఓట్లన్నీ తనకే పడటం ఖాయం… అదీ వెంకటేశం ఆలోచన. వెంకటేశం వెళ్ళేసరికి ఆ పేట పెద్ద ముసలయ్య తన గుడిశలోనే ఉన్నాడు. వెంకటేశాన్ని చూడగానే గబగబా బయటకొచ్చాడు. అలా వెంకటేశం రావడంతో ముసలయ్య మొహంలో సంభ్రమాశ్చర్యాలు తొంగి చూస్తున్నాయి. అంతలోనే ”రా..వెంకన్న బాబూ.. యిలా వొచ్చావేం?” అన్నాడు. వెంకటేశం ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచించి ”ఏం లేదు ముసలయ్యా.. యిక్కడ మన పేట వాళ్ళకి ఏదో చేద్దామనుకుంటున్నా” అన్నాడు. దాంతో ముసలయ్య మొహంలో సంతోషం కనపడింది. యింతలో వెంకటేశం ”అసలు యిక్కడెంతమంది ఉంటున్నారు? యింకా వాళ్ళలో చదువుకునే పిల్లలెంతమందున్నారు?” అన్నాడు. ముసలయ్య కొద్దిగా ఆలోచించి ”యిక్కడుండేది ఓ నలభై  కుటుంబాలు బాబయ్యా… ఆళ్ళ పిల్లల్లో చదువుకునే  పిల్లలయితే  ఓ 70, 80 మంది దాకా ఉంటారు” అన్నాడు. వెంకటేశం తలూపి ”పరే.. ఓ పని చేద్దాం. ఎలాగా ఈ పిల్లలంతా గవర్నమెంటు స్కూళ్ళలో ఫ్రీగానే చదువుకుంటున్నారు కదా.. మరి వాళ్ళకి కావలసిన పుస్తకాలూ, పెన్సిళ్ళూ, యింకా కావలసినవీ నేను ఏర్పాటు చేస్తా. యింకా వాళ్ళందరికీ టెన్త్‌ అయ్యే వరకూ అయ్యే ఖర్చులు ఏవయినా ఉంటే అవేవో నేనే చూసుకుంటా” అన్నాడు. అయితే  ఆ మాటలకి ముసలయ్య ఆనందపడిపోలేదు. అంతేకాదు. ఆపాటికి  అక్కడ మూగిన మిగతా పేటవాళ్ళు కూడా పెద్దగా ఆనందించినట్టు కనపడలేదు. యింతలో ముసలయ్య ”బాబయ్యా.. అసలు పిల్లల కోసం మీరు ఎంత ఖర్చు పెడదామనుకుంటున్నారు?” అన్నాడు. వెంకటేశం వెంటనే ”మొత్తం ఓ అయిదు లక్షలు ఖర్చు పెడదామనుకుంటున్నా. యిప్పుడేం కావాలో వాళ్ళకి కొనిచ్చేసి, మిగతా డబ్బంతా బేంకులో వేసేసి ఆ వచ్చే వడ్డీతో తర్వాత ఈ పిల్లలకి కావలసిన చదువు ఏర్పాట్లు చూస్తా” అన్నాడు. అయిదు లక్షలనే సరికి అందరి మొహాలూ వెలిగాయి గానీ చప్పట్లయితే కొట్టలేదు. వెంకటేశం ఏం జరిగిందా అని ఆలోచించేలోపు ముసలయ్య యిప్పుడే వస్తానని అందర్నీ పక్కకి తీసుకెళ్ళి మాట్లాడాడు. తర్వాత వెంకటేశం దగ్గరకొచ్చి ”బాబయ్యా… యిదంతా నువ్వెందుకు చేద్దామనుకుంటున్నావ్‌?” అన్నాడు. వెంకటేశం యింకేం తడుముకోకుండా ”ఏవుందీ… మీ పేటలో అందరిలో సంతోషం నింపాలనీ, యింకా మీ జీవితాల్లో వెలుగులు నింపాలనీ” అన్నాడు. అప్పుడు ముసలయ్య ”అలాగయితే బాబయ్యా… యివన్నీ కాదు గానీ యింకో పనిచేసి పెట్టాలి. అదే మా అందరి కోరిక” అన్నాడు. వెంకటేశం అదేంటీ అన్నట్టుగా చూశాడు. అప్పుడు ముసలయ్య ”మరేం లేదు బాబయ్యా… యిక్కడ మా పేట దేవత నూకాలమ్మ. తరతరాల నుంచీ ఆ యమ్మనే కొలుచుకుంటున్నాం. అయితే ఆ యమ్మకి సరయిన గుడే లేదు. యిదిగో… ఈ రావి చెట్టుకే బొట్టులు పెట్టి ఈ బండరాయినే ఆ యమ్మ కింద కొలుచుకుంటున్నాం. ఆ యమ్మకి ఓ చిన్న గుడి కడితే చాలు” అన్నాడు. దాంతో వెంకటేశం అదిరిపోయి ”అలాగయితే మీ పేట వాళ్ళు ఎలా ఆనందంగా ఉంటారు?” అన్నాడు. అప్పుడు ముసలయ్య ”అవును బాబయ్యా.. అలా గుడికడితే ఆ యమ్మ సంతోషిస్తుంది. యింక ఎండకీ, వానకీ తడవదు. తను అలా సల్లగా ఉంటే మమ్మల్నీ సల్లగా చూస్తుంది. ఆ యమ్మ సల్లగా చూస్తే మా బతుకులు బాగుపడిపోతాయి” అన్నాడు. ముసలయ్య చెప్పిందానికి అంతా అవునన్నట్టుగా అరిచారు. దాంతో వెంకటేశం నోరెళ్ళబెట్టాడు.
అఅఅఅ
” అది గురూగారూ… నాకొచ్చిన కల. ఏంటో ఈ జనాల తీరు నాకేం అర్థం కావడం లేదనుకోండి. ఏదో శుభ్రంగా వాళ్ళ జీవితాలు బాగు చేద్దామనుకుంటే ”అబ్బే అక్కర్లేదు… ఆ గుడేదో కడితే చాలంటున్నారు. దాని వలన పిల్లలకి చదువబ్బుతుందా… కడుపునిండుతుందా?” అన్నాడు వెంకటేశం బాధపడిపోతూ. దాంతో గిరీశం ”జనాల తీరనేవుందోయ్‌… అవతల పాలకుల తీరూ అలాగే తగలడిందిగా” అన్నాడు. దాంతో వెంకటేశం అదేంటన్నట్టుగా చూశాడు. ఈలోగా గిరీశం ఓ చుట్ట అంటించుకుని ”అసలిదంతా ‘మింగ మెతుకు లేదు. మీసాలకి సంపంగి నూనె వ్యవహారం’ అని బ్రిటీష్‌ పార్లమెంటులో మన గురించి అన్నారు. యింకొంచెం వివరంగా చెప్పాలంటే..” ఈమధ్య మూడువేల అయి దొందల కోట్లు ఖర్చుపెట్టి అహ్మదాబాద్‌లో పటేల్‌ గారి విగ్రహం పెట్టిం చడం జరిగింది. ప్రపంచంలో అది పెద్దదయిన విగ్రహం అదే. పటేల్‌ గారిని ఈ రకంగా స్మరించుకుని యింత గుర్తింపునివ్వడం మంచి  విషయమే.  అయితే యిక్కడాలోచించవలసింది ఆ విగ్రహం కోసం అన్ని వేల కోట్లు ఖర్చుపెట్టే స్తోమత భారతదేశానికి పేద వ్యవస్థకి ఉందా అని” అని బ్రిటీష్‌వాళ్ళు  ఓ పక్క దేశంలో ఎందరో యిప్పటికీ ఆకలి బాధల్లో ఉన్నారు. యింకా ఎన్నో ప్రజోపయోగ పథకాలు సరయిన నిధులు లేక మూలపడున్నాయి. యిటువంటి పరిస్థితిలో రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే యింకో పరంగానో ఆ విగ్రహానికి అన్ని వేల కోట్లు ఖర్చుపెట్టడం ‘మింగ మెతుకు లేదు..’ అని విపక్షాలు గోలెడుతున్నాయి… అంటూ వివరించాడు. అంతా విన్న వెంకటేశం ”అయితే మా మోడీ గారికి చిన్న చురక వేశారన్నమాట. అలాగయితే ఎవరు తక్కువ తిన్నారని… మీ బాబుగారు మాత్రం రాష్ట్రంలో సమస్యలు పక్కన పెట్టి అమరావతి రాజధానికి సింగపూర్‌ హైటెక్‌ షాపులు అద్దడం లేదూ” అన్నాడు. దానికి ఎలా కౌంటరివ్వాలా అని ఆలోచిస్తూ గిరీశం యింకో చుట్ట నోట్లో పెట్టుకున్నారు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here