సమస్యలు పరిష్కరించండి..అభివృద్ధిని పరుగులెత్తించండి

0
238
కొత్త కమిషనర్‌ను కలిసిన గుడా మాజీ చైర్మన్‌ గన్ని కృష్ణ, ఆదిరెడ్డి బృందం
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 24 : ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పలు రహదారులు గోతులమయంగా మారాయని, వాటికి మరమ్మతులు చేయడంతో పాటు నగరంలో ఎక్కువగా ఉన్న దోమల బెడదపై ప్రత్యేక దృష్టి సారించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అభిషిక్త్‌ కిషోర్‌ను గుడా మాజీ చైర్మన్‌ గన్నికృష్ణ కోరారు.  నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్‌ని గత సాయంత్రం గన్ని మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. గన్నితో పాటు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు,మాజీ ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ కాశి నవీన్‌ కుమార్‌, తెదేపా నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, మాజీ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు కమిషనర్‌ను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ నగరంలో నెలకొన్న పలు సమస్యలను కమిషనర్‌ దృష్టికి తీసుకువచ్చారు. దోమల వ్యాప్తి కారణంగా నగరంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఆరోగ్య విభాగాన్ని అప్రమత్తం చేయాలని కోరారు. నగరపాలక సంస్థలో అవినీతిని అరికట్టాలని సూచించారు. నగరపాలక సంస్థ పరిధిలో గత ప్రభుత్వంలో ఏర్పాటైన గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(గుడా) ద్వారా సుమారు రూ.2.21 కోట్ల పనులు చేపట్టామని, నగరపాలక సంస్థ ద్వారా పనులు చేయించి వాటి బిల్లులను కూడా చెల్లించామన్నారు. అయితే కొన్నిచోట్ల పనుల నిర్వాహణ అధ్వాన్నంగా మారడం ఆవేదన కలిగిస్తుందన్నారు.సెంట్రల్‌ జైల్‌ సమీపంలో గుడా ఏర్పాటు చేసిన ‘లవ్‌ రాజమహేంద్రవరం’ సింబల్‌ నిర్వహణ అధ్వాన్నంగా మారిందని, వాటిలో కొన్ని అక్షరాలు ఊడిపోవడంతో పాటు లైటింగ్‌ నిర్వహణ లేదన్నారు. అక్కడ సెక్యూరిటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నగర నడిబొడ్డున ఉన్న కంబాలచెరువు పార్కు ప్రక్షాళనలో స్పూర్తిప్రదాతగా నిలిచిన మాజీ లోక్‌సభ స్పీకర్‌ దివంగత జి.ఎం.సి.బాలయోగి విగ్రహ ఏర్పాటుకు గుడా ద్వారా రూ.12 లక్షలు మంజూరు చేశామని, అయితే విగ్రహంపై షెల్టర్‌(గొడుగు) నిర్మించాలని కోరారు. మాజీ పార్లమెంట్‌ సభ్యులు మాగంటి మురళీమోహన్‌ తమ ఎంపి నిధులతో కంబాలచెరువు పార్కులో భారీ జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేశారని, కాని ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదన్నారు. మధురపూడి విమానాశ్రయం రోడ్డులో గ్రీనరి అభివృద్ధికి గుడా ద్వారా రూ.48 లక్షలు మంజూరు చేయగా, గ్రీనరి నిర్వాహణలో గుడా భాగస్వామ్యం ఉన్నట్లు సరైన సూచికలు ఏర్పాటు చేయలేదన్నారు. 42వ డివిజన్‌లోని మునిసిపల్‌ కాలనీ గ్రౌండ్‌లో మరుగుదొడ్ల నిర్మాణం, మంచినీటి బోరు ఏర్పాటుకు నిధులు మంజూరు చేసినా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదన్నారు. అలాగే కమ్యూనిటీ హాల్‌ పై అంతస్తు నిర్మాణానికి గుడా ద్వారా రూ.17 లక్షలు మంజూరు చేయగా దాని నిర్మాణం అసంపూర్ణంగా ఉందని,ఈ విషయంపై సంబంధిత కాంట్రాక్టర్‌ ని అడిగితే తమకు బిల్లులు చెల్లించలేదనే సమాధానం వచ్చిందన్నారు. గుడా ద్వారా చేపట్టిన పనులకు బిల్లులు మంజూరు చేయడంలో ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేవని,కావున బిల్లులు చెల్లించడంతో పాటు నిర్వహాణను మెరుగుపరచాలని కోరారు. దీనికి కమిషనర్‌ సానుకూలంగా స్పందించారు. తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత అన్ని పరిశీలిస్తున్నాని,పెండింగ్‌లో ఉన్న పనులు, నిర్వహణ ఇతర అంశాలపై దృష్టి సారించానన్నారు. మరి ముఖ్యంగా అవినీతి రహిత పాలన అందించడమే తన ప్రధాన కర్తవ్యమని చెప్పారు. వినతిపత్రంలో అన్ని అంశాలను పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here