సమస్యల పరిష్కారంపై హామీ

0
115
30వ డివిజన్‌లో ఎమ్మెల్యే భవాని పర్యటన
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 20 : స్థానిక 30వ డివిజన్‌లో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు)తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా సక్రమంగా చేయాలని, శిధిలమైన సీసీ రోడ్డు, డ్రైనేజీలను పునం నిర్మించాలని, అలాగే వీధి దీపాలు సక్రమంగా వెలిగేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే భవానీ దృష్టికి తీసుకువచ్చారు. స్థానికుల సమస్యలపై స్పందించిన ఆమె నగరపాలక సంస్థ అధికారులతో మాట్లాడారు. స్థానిక ప్రజలు వెల్లడించిన సమస్యలను సత్వరం పరిష్కరించి, వారికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే స్థానిక ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు సమకూర్చేందుకు నగరపాలక సంస్థ అధికారులు చొరవ చూపాలని కోరారు. తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, చాపల రాజు, వార్డు ప్రెసిడెంట్‌ ఎరకా కొండబాబు, వార్డు సెక్రటరీ రాజు, రామకృష్ణ, నాయుడు సూర్య, స్థానిక నాయకులు, 30వ డివిజన్‌ తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు వారి వెంట ఉన్నారు.
36వ డివిజన్‌లో బోరు ఏర్పాటు పనులు ప్రారంభం :
అలాగే స్థానిక 36వ డివిజన్‌ ఆదెమ్మ దిబ్బ వద్ద వాంబే గృహాల్లోని ఎ-బ్లాక్‌ వారి సౌకర్యార్ధం మంచి బోరును ఏర్పాటు చేయనున్నారు. బోరు ఏర్పాటు చేసే పనులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎ-బ్లాక్‌ వారికి ఇకపై మంచినీటి కష్టాలు ఉండవని, అలాగే స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ తంగెల బాబి, తణుకు ప్రసాద్‌, తేజ, వీరబాబు, 36వ డివిజన్‌ తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here