సమాజ సేవతోనే ఆత్మ సంతృప్తి

0
244

కేశవభట్ల చారిటబుల్‌ ట్రస్ట్‌ సేవలు ఆదర్శప్రాయం

కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమంలో గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 11 : సమాజంలో ఎన్నో రంగాలు ఉన్నా సేవా రంగంలో మాత్రమే ఆత్మ సంతృప్తి కలుగుతుందని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. కేశవభట్ల చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈ నెల 4 వ తేదీన రామకృష్ణ ధియేటర్‌ వద్ద ఉన్న ఆవ ప్రాంతంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో నేత్ర పరీక్షలు చేయించుకున్న వారిలో కళ్ళజోళ్ళు అవసరమైన 500 మందికి ఈరోజు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గన్ని కృష్ణ, ప్రత్యేక అతిథులుగా ప్రముఖ కాంట్రాక్టర్‌ రంకిరెడ్డి సుబ్బరాజు, ప్రముఖ న్యాయవాది గొందేశి శ్రీనివాసులు రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ ఒక వైపు రైల్వేలో ఉద్యోగం చేస్తూ మరో వైపు విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కేశవభట్ల శ్రీనివాస్‌ అభినందనీయులన్నారు. గతంలో కార్తీకమాసం సందర్భంగా చెవిటి, మూగ విద్యార్ధులతో కలిసి వన సమారాధన నిర్వహించడం, ఆ కార్యక్రమానికి తనను ఆహ్వానించడం జరిగిందన్నారు. తాను కూడా సేవా రంగం నుంచే ఈ స్థాయికి వచ్చానని అన్నారు. ఒత్తిడి లేని జీవితమే తన ఆరోగ్య రహస్యమని, ప్రతి ఒక్కరూ కంటి సంరక్షణ విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. నగరంలో ఎంతో మంది కాంట్రాక్టర్లు ఉన్నా సేవా రంగంలో, ఆధ్యాత్మిక రంగంలో ఇతోథికంగా సహాయం చేసే వ్యక్తుల్లో రంకిరెడ్డి సుబ్బరాజు ఒకరని, గౌతమ ఘాట్‌లో బాసర సరస్వతీ దేవి నమూనా ఆలయాన్ని నిర్మించడంలో ఆయన ముఖ్య పాత్ర వహిస్తున్నారని కొనియాడారు. రంకిరెడ్డి సుబ్బరాజు మాట్లాడుతూ కేశవభట్ల చారిటబుల్‌ ట్రస్ట్‌ సేవలు భవిష్యత్తులో మరింత విస్తృతం కావాలని, అందుకు తన వంతు సహాకారాన్ని అందిస్తానన్నారు. గొందేశి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ మంచి స్ఫూర్తిదాయకంగా కేశవభట్ల సేవలు నిలుస్తున్నాయని, స్ధానిక ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేశవభట్ల మాట్లాడుతూ పెద్దల సూచన మేరక ప్రతి ఏటా ఈ ప్రాంతంలో వైద్య శిబిరం నిర్వహిస్తామని, గత వారంలో నిర్వహించిన శిబిరంలో 1500 మంది పాల్గొని వైద్య సేవలు పొందారన్నారు. వారిలో 500 మందికి కళ్ళజోళ్ళు అవసరమయ్యాయని తెలిపారు. గన్ని కృష్ణ రాజకీయాల్లో నీతి నిజాయితీగా ఉంటూ ఒకే పార్టీని నమ్ముకుని పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో రొటీన్‌కు భిన్నంగా పుట్టినరోజులు, ఇతర సందర్భాల్లో ఆయా వ్యక్తులకు మొక్కలను పంపిణీ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఈ సందర్భంగా అవసరమైన వారికి కళ్ళజోళ్ళను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఏడీఇ రామానుజం శ్రీనివాసులు, ట్రస్ట్‌ సభ్యులు చందన్‌, ఎస్‌.రాజారావు, అడపా వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here