సాధిస్తే సహించరు తమిళనాడు పాఠం (శనివారం నవీనమ్)

0
129

సాధిస్తే సహించరు
తమిళనాడు పాఠం
(శనివారం నవీనమ్)

శశికళ అవినీతిపరురాలు కాదంటే ఎవరూ నమ్మరు… అధికారాన్ని అడ్డంపెట్టుకోకుండానే జగన్ వేలకోట్ల రూపాయల ఆస్ధులు సపాదించారన్నా ఎవరూ నమ్మరు. అయినా ఇద్దరికీ ప్రజల్లో ఆమోదం వుంది. గట్టి మద్దతువుంది.

అవినీతి పరులను చట్టపరంగా శిక్షిస్తే ప్రజలు హర్షిస్తారు. కానీ తన పంచన చేరితే అవినీతిని మాయం చేయడం, తనకు ఎదురు తిరిగిన వారిని కక్ష కట్టి కేసుల్లో ఇరికించడం, పాత కేసులను తిరగదోడటం రాజకీయ దివాళాకోరుతనం. దీన్ని ప్రజలు ఒప్పుకోరు. కక్షసాధించే అధికారానికి వ్యతిరేకంగా దొంగలనైనా నెత్తిమీద పెట్టుకుంటారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్ కె నగర్ లో దినకరన్ గెలుపు ఇలాంటిదే!

జయలలిత మరణంతో తమిళ రాజకీయాల్లోకి కుట్రపూరితంగా జొరబడి సొమ్ము చేసుకోవాలని ఆత్రపడిన బిజెపికి లోతుగా వాత పెట్టినట్టు దినకరన్ గెలుపు అర్ధమౌతుంది.

తమిళనాట రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆర్‌కె నగర్‌ ఎన్నికపై దేశ వ్యాప్తంగా ఆసక్తి కేంద్రీకృతమైంది. జయ వారసత్వం, దినకరన్‌ గెలుపుల కంటే కూడా అధికార అన్నాడిఎంకె, ప్రతిపక్ష డిఎంకెలతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు నెరుపుతూ తమిళనాడులో పాగా వేయాలని ఆరాట పడుతున్న బిజెపికి బుద్ధి చెప్పడమన్న ఏకైక లక్ష్యంతో ఆర్‌కె నగర్‌ ప్రజలు తమ విస్పష్ట తీర్పు ఇచ్చినట్లు కనిపిస్తోంది.

మొత్తం తమిళనాడు ప్రజల్లో బిజెపి పట్ల నెలకొన్న ఆగ్రహానికి ఆర్‌కె నగర్‌ ప్రజల తీర్పు అద్దం పడుతోంది. బిజెపితో అంటకాగుతూ దాని కనుసన్నల్లో మెలుగుతున్న అధికార పళనిస్వామి-
పన్నీర్‌సెల్వంలను ఎన్నికల్లో చాచి కొట్టారు ఆర్‌కె నగర్‌ ఓటర్లు. అలాగే రాజకీయ అవసరాల కోసం బిజెపి వైపు మొగ్గు చూపుతున్న ప్రతిపక్ష డిఎంకెకి అంతకంటే ఎక్కువ స్థాయిలో బుద్ధి చెప్పారు. మామూలుగా అయితే అన్నాడిఎంకెలో కీచులాటలను ప్రతిపక్ష డిఎంకె ఉపయోగ పెట్టుకోవాలి.

బిజెపి విషయంలో గోడమీద పిల్లిలా ఉన్నందునే ఆ పార్టీని మూడో స్థానానికి నెట్టేశారు ఓటర్లు. డిపాజిట్‌ కూడా దక్కనీకుండా చేశారు. బిజెపి పరిస్థితి మరీ దారుణం. తమిళనాట పాగా వేస్తామని బీరాలు పలికిన ఆ పార్టీ అభ్యర్థికి ‘నోటా’ కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. నోటాకు 2,373 ఓట్లు రాగా బిజెపికి పడ్డ ఓట్లు 1,417 మాత్రమే. దీంతోనైనా తమిళనాట తమ స్థానమేంటో బిజెపికి బాగా అర్థమై తీరాలి.

జయ మరణం మొదలుకొని ఇప్పటి వరకు బిజెపి ఆడిన డ్రామాలు అన్నీ ఇన్నీ కావు. జయ మృతికి శశికళ బృందమే కారణమంటూ పన్నీరుసెల్వాన్ని లోబరుచుకొని ప్రచారం నిర్వహించింది. శశిని సిఎం కానీకుండా గవర్నర్‌ను ఉపయోగించింది. అవినీతి కేసులో శశికళ జైలుకు వెళ్లాక ఆమె ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయిన పళనిస్వామిని బిజెపి మచ్చిక చేసుకుంది. అన్నాడిఎంకెలో రెండు గ్రూపులకు నాయకత్వం వహిస్తున్న పన్నీర్‌, పళనిల మధ్య సయోధ్య కుదిర్చి శశికళ, ఆమె బృందాన్ని పార్టీ నుంచి వెలి వేసేలా చేసింది. అదేంటంటే శశికళ అవినీతి పరురాలని, ఆమెను ప్రభుత్వంలోకి తేనీకుండా బృహత్తర పాత్ర పోషిస్తున్నామని చెప్పుకొచ్చింది.

ఒకపక్క అన్నాడిఎంకెని చీలికలు పేలికలు చేసి ఆ స్థానాన్ని తాము భర్తీ చేసేలా ప్రయత్నిస్తూనే, మరోపక్క ప్రతిపక్ష డిఎంకెతో రాయబారాలు నడిపింది. అందులో భాగమే ప్రధాని మోడీ డిఎంకె నేత కరుణానిధిని చెన్నైలోని నివాసానికెళ్లి మరీ కలిసింది. డిఎంకె 2జి స్పెక్ట్రం కేసు అవసరాల కోసం బిజెపి వైపు మొగ్గు చూపింది. యాధృచ్చికమో లేక వ్యూహాత్మకమో కానీ ఆర్‌కె నగర్‌ పోలింగ్‌ రోజునే 2జి కేసులో డిఎంకెకి చెందిన రాజా, కనిమొళిలను సిబిఐ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ పరిణామం ఉప ఎన్నికల్లో డిఎంకెకు కలిసిరాకపోగా బిజెపికి, ఆ పార్టీకి మధ్య సబంధాలున్నాయనే సంకేతాలు ప్రజల్లో ప్రబలడానికి కారణమైంది.

కేంద్రంలో తమకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని తమిళ రాజకీయాల్లో వేలు పెట్టిన బిజెపిపై ఆ రాష్ట్ర ప్రజల అసంతృప్తి తమిళుల సంప్రదాయ క్రీడ జల్లికట్టు నిషేధానికి కేంద్రం ఉపక్రమించినప్పుడు వెల్లడైంది. లక్షలాది మంది వీధుల్లోకొచ్చి నిరసనలు తెలిపిన దరిమిల మోడీ సర్కారు దిగొచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టిలకు వ్యతిరేకంగా కొన్ని డైలాగులున్నాయన్న నెపంతో మెర్సల్‌ సినిమాపై బిజెపి దేశ వ్యాప్తంగా రాద్ధాంతం చేయడంపై తమిళ ప్రజలు అసహనంతో రగిలిపోయారు.

శశికళ జైలుకెళ్లాక కూడా ఆమె కుటుంబీకులు, సన్నిహితులు 200 మంది ఇళ్లపై వరుసగా ఆదాయపన్ను శాఖ దాడులు రాజకీయ కక్షతోనే సాగాయని తమిళ ప్రజల్లో బలంగా నాటుకున్నాయి. ఆర్‌కె నగర్‌ ఉప ఎన్నిక ఆలస్యానికి, ఏప్రిల్‌లో జరగాల్సిన ఎన్నిక వాయిదా పడటానికి బిజెపియే కారణమని ప్రజలు భావించారు. ఈ క్రమంలో శశికళ అవినీతిని తమిళ ప్రజలు పట్టించుకున్నట్లు లేరు. అందుకే శశికళ అవినీతి గురించి ఎన్ని వార్తలు వచ్చినా వాళ్లు పట్టించుకోకుండా ఆమె వారసుడిగా ముందుకొచ్చిన దినకరన్‌కు ఓటు వేశారనుకోవాలి.

స్వార్ధ రాజకీయాలకోసం అధికారంలో వున్నవారు పరిస్ధితుల్ని వాడుకుంటున్నారన్న అనుమానం బలపడితే చాలు ప్రజలు తమకు అవకాశం వచ్చినపుడు ఈడ్చికొడతారు. పోలవరం ప్రాజెక్టుపై తెలుగుదేశానికి పేరు ప్రఖ్యాతులు రాకూడదనే బిజెపి కాళ్లు చేతులు అడ్డం పెడుతూందన్న అనుమానం ప్రజల్లో బలపడుతున్నది. అలాగే జగన్ ను విమర్శించే కొద్దీ “ఏమీలేకుండానే సాధిస్తున్నారు” అనే భావన జనంలో వ్యాపిస్తూంది.

ఇది క్షుణంగా తెలిసున్న చంద్రబాబునాయుడు బిజెపిని గాని, జగన్ ని గాని విమర్శించకుండా ఓర్పు వహిస్తున్నారు. బిజెపి నాయకుల్లో ఆతృత అసహనాలే తప్ప అలాంటి ఓర్పు తక్కువ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here