సిఎం చంద్రబాబుకు పాలించే అర్హత లేదు..

0
347
సిపిఐ-సిపిఎం రాష్ట్ర సదస్సులో నిప్పులు చెరిగిన రామకృష్ణ
రాజమహేంద్రవరం, జులై 14 : ఆంధ్రప్రదేశ్‌లో సిఎం చంద్రబాబుకు పాలన సాగించే అర్హత లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి, లంచగొండితనం విపరీతంగా పెరిగిపోయాయని ఎమ్మెల్యేలు మట్టి, ఇసుక, లిక్కర్‌ మాఫియాగా ఏర్పడి ప్రజలను దోచుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు. రాష్ట్రంలో నూతన రాజకీయ ప్రత్యామ్నాయం సాధించేందుకు అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేసారు. సామాజిక న్యాయం- దళితుల సంక్షేమం నినాదంతో స్థానిక రివర్‌బే ఆహ్వానం హాల్‌లో సిపిఐ-సిపిఎం సంయుక్తంగా రాష్ట్ర సదస్సును ఈరోజు నిర్వహించాయి. సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ అతిథులకు స్వాగతం పలకగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్ద సభ్యుడు దడాల సుబ్బారావు సభను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటాలు సాగిస్తున్నాయన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబును 2019 ఎన్నికల్లో ఓడించి ఇంటికి పంపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ప్రజల్లో మార్పు తీసుకుని రావడానికి వామపక్షాల కార్యకర్తలు శాయశక్తులా కృషిచేయాలని పిలుపునిచ్చారు. మేధావులు కూడా ప్రత్యామ్నాయం రావాలనే ఆలోచనలోనే ఉన్నారన్నారు. సాధారణ ప్రజలకు ప్రాతినిధ్యం లేని ప్రజాస్వామ్యం ఉన్నా ఒక్కటే.. ఊడినా ఒక్కటేనన్నారు. రాష్ట్రంలో టీడీపీ, వైసిపిలు రైతులు, గిరిజనులు, వ్యవసాయ కార్మికులు, పేద, మధ్య తరగతి వర్గాలను గాలికొదిలేసి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రాంతీయ అసమానతలు తొలగి, రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి జరగాలంటే వామపక్షాలు అసెంబ్లీలో ఉండాలన్నారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా సామాజిక న్యాయం జరగాలని కోరుకుంటున్నారని అందుకే రాష్ట్రంలో వామపక్షాలతో కలిసి పనిచేస్తున్నారని వెల్లడించారు. 13 జిల్లాల్లో బస్సు యాత్రల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై చైతన్యం తేవడానికి బయలుదేరుతున్నామన్నారు. సెప్టెంబర్‌ 15వ తేదీ 13 జిల్లాల వామపక్ష నాయకులు, నూతన రాజకీయ ప్రత్యామ్నాయానికి సహకరించే వారితో కలిసి విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. నాలుగేళ్లుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వారు అసెంబ్లీలో ప్రజలకు ఏం చేసారని నిలదీసారు. వైసిపికి ప్రజా సమస్యలు పట్టవని అసెంబ్లీకి వెళ్లకుండా ఎమ్మెల్యేలు బయట తిరుగుతున్నారన్నారు. చంద్రబాబు చెప్పే సోది వింటూ ఆహా.. ఓ¬అంటూ పొగుడుతుంటే ఆయనకు చాలా బావుందని ఎద్దేవా చేసారు. ఎమ్మెల్యేలు, అధికారులు ఇంత దారుణంగా అవినీతి చేస్తూంటే చంద్రబాబు కంటికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెప్పే సమయం ఆసన్నమైందని దానికి అందరూ సహకరించాలని కోరారు. దళితులపై దాడులు అరికట్టడంతో పాటు వారికి భరోసా కల్పించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఓట్లు అమ్ముకున్నంతవరకు ప్రజాస్వామ్యంలో మార్పు రాదని కోట్లు ఉన్న వాళ్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికై పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. దీనికి ముందు పలువురు కళాకారులు విప్లవ గీతాలు ఆలపించారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, డిహెచ్‌పిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి కరవది సుబ్బారావు, ఆర్‌పిఐ రాష్ట్ర అధ్యక్షుడు అంజయ్య, వివిధ పార్టీల నాయకులు బాలసింగమ్‌, విద్యాసాగర్‌, ఎం.భాగ్యారావు, కె.ఆనందరావు, శివశంకర్‌, జివి హర్షకుమార్‌, పట్టపు శీనయ్య, గ్రిట్టన్‌, బ్రహ్మయ్య, టిఎస్‌ ప్రకాష్‌, టి.తులసి, నల్లా రామారావు, ఎస్‌ఎస్‌ మూర్తి, యడ్ల లక్ష్మి, జనసేన నాయకుడు వై.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here