సుప్రీంకోర్టు ఆదేశాలపై గన్ని కృష్ణ హర్షం

0
335
బెల్ట్‌ షాపులు, ఎమ్మార్పీకి మించి విక్రయాలపై కూడా దృష్టి సారించాలి
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 15 : జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు వెంబడి మద్యం అమ్మకాలను నిలిపివేయాలని భారత సర్వోన్నత న్యాయస్ధానం సుప్రీంకోర్టు ఆదేశించడం పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయమ ఎంతో కాలంగా పోరాటం సాగిస్తున్న తనలాంటి ఎంతో మందికి ఈ ఆదేశం సంతోషాన్ని కలిగిస్తుందని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి మద్యం దుకాణాలు ఉండటం వల్ల వాహనదారులు ముఖ్యంగా లారీ డ్రైవర్లు మద్యం సేవించి నిర్లక్ష్యంగా మితిమీరిన వేగంతో ఇష్టానుసారం వాహనాలు నడపడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీని వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు. రహదారుల వెంబడి విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఉండటం వల్ల డ్రైవర్లు అదుపు లేకుండా తాగి వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న ప్రమాదాలు న్యాయస్ధానం ఆదేశాలతో అదుపులోకి వస్తాయన్న ఆశాభావాన్ని గన్ని వ్యక్తం చేశారు. కొందరు మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ఎంఆర్‌పి రేట్లకు మించి అధిక ధరలకు మద్యం విక్రయించడం, విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన బెల్ట్‌షాపుల తొలగించడంపై కూడా న్యాయస్థానం దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అక్రమాలకు పాల్పడుతున్న కొందరు మద్యం వ్యాపారులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న  కొందరు అధికారులపై విచారణ జరపాలని ఆయన కోరారు. బెల్ట్‌షాపులను తొలగించాలని, ఎమ్మార్పీకి మించి ధరలకు విక్రయాలు జరపకుండా చూడాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించినా కొందరు నాయకులు, కొందరు అధికారుల  అండదండలతో ఇవి యదేచ్ఛగా జరుగుతున్నాయని  గన్ని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల్లో ఈ అంశాలు కూడా ఉండి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. ఈ విషయాలపై  తాను న్యాయపోరాటం చేసే ప్రక్రియలో నిమగ్నమయ్యాయని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఖచ్చితంగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని గన్ని కోరారు.