సెల్ఫ్‌ గోల్స్‌

0
392
మనస్సాక్షి  – 1018
కలకత్తా… సీఎం ఆఫీసు ఆరోజు హడా విడిగా ఉంది. దానిక్కారణం ఢిల్లీ నుంచి అరుణ్‌జైట్లీ ప్రత్యేక ఫ్లయిట్‌లో అర్జంటుగా వస్తుండడమే. దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా జైట్లీ రాక ప్రాధాన్యత సంతరించుకుంది. యింతకీ ఆ సమావేశం ఎందుకనేది అంతా ఆసక్తిగా మారింది. యింకో గంట తర్వాత ఆ సమావేశమేదో మొదల యింది. కొంతసేపు మామూలు మాటల యిన తర్వాత జైట్లీ ”మమతాజీ… ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులుమీకు తెలుసు. ఈ సమయంలో ప్రభుత్వానికి మీలాంటి వాళ్ళందరి సహకారం చాలా అవసరం” అన్నాడు. మమత తలూపి ”నేనేదో స్టేట్‌మెంట్‌ యిచ్చానంటే దాని వెనుకో అర్థం ఉంటుంది. మొన్న తమిళనాడులో హఠాత్తుగా సీఎస్‌ మీద ఐ.టి., రెయిడ్‌ ఎందుకు జరిపించినట్టు? అసలే ఓ పక్క తమ సీఎంని కోల్పోయి ప్రజలంతా ఎంతో బాధలో ఉన్నారు. అలాంటిదిప్పుడు సీఎస్‌మీద ఐటి దాడులు చేయించేస్తారా? అసలు సీఎస్‌ అంటే ఎవరు? ఓ రకంగా సీఎం కంటే ఎక్కువ. పేరుకి సీఎం పరిపాలన చేసినా వెనకాల ఉండి నడిపించేదంతా  సీఎస్సే కదా.  అలాంటి సీఎస్‌ మీద యిలాంటి ఆకస్మిక దాడులు చేయించడం ఏంటని?” అంది. దాంతో అరుణ్‌ జైట్లీ యిబ్బందిపడి ”అబ్బే… అందులో గవర్నమెంట్‌ పాత్ర ఏవీ లేదు. ఐ.టి. డిపార్ట్‌మెంట్‌ తన పని తను చేసుకుపోతుందంతే” అన్నాడు. అయితే  ఆ మాటలేవీ మమతకి రుచించినట్టుగా లేదు. మొహంలో అసహనం తొంగిచూసింది. దాంతో జైట్లీ ”అయితే ఓ పనిచేద్దాం మమతాజీ… ఆ డిపార్ట్‌ మెంట్లో రెండు రీజియన్‌లకి మీరే చీఫ్‌ అడ్వయిజర్‌గా ఉండండి. వాళ్ళు చేసే పనులన్నీ మీ మార్గదర్శకంలోనే నడుస్తాయి” అన్నాడు.  దానికి మమత మమతతో తలూపింది. అక్కడితో సమావేశం ముగిసింది. ఆరోజు నుంచీ రెండు రీజియన్లలో ఐ.టి.రెయిడ్‌లన్నీ మమత సూచించిన విధానాల్లోనే జరగడం మొదలయింది….
—-
సీఎం కార్యాలయం… సీఎం బాబు ఫైల్సేవో చూస్తుండగా యిన్‌ కంటాక్స్‌ ఛీఫ్‌ కమీషనర్‌ వెంకటేశం రావడం జరిగింది. సదరు వెంకటేశం సివిల్స్‌ రాసి  ఐఆర్‌ఎస్‌ ద్వారా డిపార్ట్‌మెంట్‌లో కొచ్చి అంచెలంచెలుగా చిన్న వయసులోనే ఈ స్థాయికి ఎదిగినవాడు. మామూలుగా అయితే అతగాడు యిప్పుడిలా సీఎంగారి దగ్గర కొచ్చే పనిలేదు. అయితే ఈమధ్యే డిపార్ట్‌మెంట్లో వచ్చిన మార్పు… అదే… తన రీజియన్‌ అంతా మమతాబెనర్జీ సూచన లతో నడిచే పరిస్థితి రావడంతో యిప్పుడు చేయబోయే ఓ రెయి డింగ్‌ నిమిత్తం మాట్లాడడానికి యిక్కడికి రావలసి వచ్చింది. వెంకటేశం విష్‌ చేసి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని తను వచ్చిన పని చెప్పాడు. ”సర్‌… మీ ఆత్మబంధువు అయిన సురేంద్ర గారి మీద రెయిడ్‌ చేద్దామనుకుంటున్నాం. అందుకే ముందుగా మీకో మాట చెబుదామని” అన్నాడు. అంతలోనే మళ్ళీ ”మీ వ్యవహారాలన్నీ ఆయనే చూస్తాడని తెలుసు. ఆయన మీద రెయిడింగదీ చేస్తే ఒకట్రెండు రోజులు మీ పని పాడవుతుంది కదా. అందుకే ఎప్పుడా రెయిడింగ్‌ పెట్టుకోవాలో చెబితే అప్పుడే పెట్టుకుంటాం. నెలా ఖరుకి పెట్టుకోవచ్చా?” అన్నాడు. బాబు ఏవో లెక్కలేసుకుని ”యింకా రెండువారాలుందా…సరే…” అన్నాడు. దాంతో వెంక టేశం శెలవు తీసుకుని అక్కడ్నుంచి బయటపడ్డాడు. అక్కడ్నుంచి నేరుగా సురేంద్ర దగ్గరకెళ్ళాడు. తానొచ్చిన పనిచెప్పి ”సార్‌… మీమీద ఆకస్మిక దాడి…అదే… ఐ.టి.రెయిడ్‌ చేద్దామను కుంటున్నాం. సీఎం సార్‌కి కూడా చెప్పాం… నెలాఖరుకి” అన్నాడు. దాంతో సురేంద్ర విసుక్కుని ”ఏం వేళాకోళంగా ఉందా? రెండు వారాల టైం ఎలా సరిపోద్దంట? నెలన్నా కావాలి. అందుకే పండగల తర్వాత జనవరి 20న పెట్టుకోండి. ఆ… యింకో విషయం ఆరోజు తెల్లవారుజామునే వచ్చి నిద్రలేపొద్దు. తొమ్మిదిన్నరా పదింటికొస్తే టిఫిన్లవీ చేసేసి ఉంటాం” అన్నాడు.  ఈసారి వెంకటేశం నసుగుతున్నట్టుగా ”సీఎం గారికి నెలాఖరునే అని చెప్పేశాం. ఎలాగా?” అన్నాడు. దాంతో సురేంద్ర నవ్వేసి ”అది నేను చూసుకుంటా” అంటూ ఫోన్‌ చేసి ”సార్‌… నాకు సర్ధుకో డానికి నెలన్నా కావాలి. అందుకే ఈ రెయిడిం గేదో జనవరి 20న పెట్టుకోమంటున్నా” అంటూ ఫోన్‌ పెట్టేశాడు. దాంతో వెంకటేశం సంతృప్తిగా వెనుదిరిగాడు. అలాగే జనవరి 20వ తేదీన వెంకటేశం టీం ఉదయం తొమ్మిదిన్నరకి సురేంద్ర యింటికి రెయి డింగ్‌కి వెళ్ళిపోయింది. ఆ ముందురోజు కూడా వెంకటేశం ఎందు కయినా మంచిదని సురేంద్రకి ఈ రెయిడింగ్‌ విషయం గుర్తు చేశాడు. ఆ రెయిడింగ్‌ తంతేదో రెండుగంటలపాటు సాగింది. ఏవీ దొరకలేదు. దాంతో ఆఫీసర్‌ ”సారీ సర్‌… మాకేదో రాంగ్‌ యిన్ఫర్‌మేషనొచ్చింది అంటూ సురేంద్రకి సారీ చెప్పేసి తన వాళ్ళతో బయటికొచ్చేశాడు.
—–
”గురూగారూ… అదీ నాకొచ్చిన కల. చదవేస్తే  ఉన్నమతిపోయిం దన్నట్టుగా బొత్తిగా యిలాంటి కలొచ్చిందేంటంటారు? మెడ కాయ మీద తలకాయ ఉన్న వాళ్ళెవరయినా యిలా రెయిడింగ్‌ చేస్తారా అని…! అసలు ఐ.టి. రెయిడింగంటే ఎంత ప్రొసీజర్‌ ఉంటుందని.  ఎవరి మీద రెయిడింగ్‌ జరిగేదీ చివరి నిమిషం దాకా రెయిడ్‌ చేసేవాళ్ళకి కూడా తెలీదు. సీల్డ్‌ కవర్‌లలో పేర్లు రాసి మూడు అంచెలుగా ఆ కవర్లు అందజేయబడతాయి. ఆ రెయి డింగ్‌ చేసే టీమ్‌లో వాళ్ళకి సైతం చివరి నిమిషం దాకా తాము ఎవరి మీదకి రెయిడింగ్‌కి వెళ్ళేదీ తెలీదు కదా” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం నవ్వేసి ”నీ తెలివితేటల కొచ్చిన లోటేంలేదోయ్‌. అసలిదంతా బాధ్యతారాహిత్యానికి సంబంధించిన కలనుకో” అన్నాడు. వెంకటేశానికయితే ఏం అర్థం కాలేదు. యింతలో గిరీశం ”అదేంటో నువ్వే చెప్పాలి. అదే ఈ వారం ప్రశ్ననుకో” అన్నాడు చుట్ట అంటిస్తూ. దాంతో వెంకటేశం ఆలోచనలోపడ్డాడు. ఆలోచించి ఆలోచించి అప్పుడు చెప్పడం మొదలెట్టాడు. ”ఒక సామాన్యుడు మాట్లాడే మాటకి అంతగా ప్రాముఖ్యత ఉండదు. దానిక్కారణం అతడికున్న పరిధి పరిజ్ఞానం చాలా తక్కువ. ప్రభావిత శక్తీ తక్కువే. అయితే  స్థాయి పెరిగే కొద్దీ వ్యక్తులు మాట్లాడే ప్రతీమాటా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. విషయానికి వస్తే… బెంగాల్‌ సీఎం మమత ఎంతో బాధ్యతాయుతమయిన పోస్ట్‌లో ఉన్న వ్యక్తి. అలాంటి మమత ‘తమిళనాడు సిఎస్‌ మీద ఆకస్మిక ఐ.టి. రెయిడ్‌లు చేయడం తప్పనీ, అయినా అలా చేయవలసి వస్తే ముందే తెలియజేసి మరీ దాడులు చేయాలనీ శెలవిచ్చింది. ఆవిడని అనుసరిస్తే నీకలలోలాంటి వ్యవహారాలే జరుగుతాయి. అలాగే రాహుల్‌ గాంధీని తీసుకున్నా ‘మోదీ నలభై కోట్లు లంచం తీసుకున్నారు’ అని ఓ ప్రకటన చేయడం జరిగింది. అయితే మోదీ తలుచు కుంటే వేలకోట్లు సంపాదించడం ఓ లెక్కా… ప్రజలకి ఏదో సేవ చేయాలన్న తపనతో సర్వం వదులుకుని వచ్చిన రాజర్షి మోదీని అలా నిందించడం ఎంతవరకూ సబబని? చివరికి అది కాంగ్రెస్‌కి సెల్ఫ్‌గోల్‌ అయింది. యిలాంటి ప్రకటనలు ఆయా నాయకుల పొలిటికల్‌ మైలేజ్‌ని పెంచవచ్చు. కానీ తమ వ్యక్తిత్వాన్నీ, గౌర వాన్నీ పోగొడతాయి. అందుకే బాధ్యతాయుతమయిన పోస్టుల్లో ఉన్నవాళ్ళు బాధ్యతారహిత్యమయిన స్టేట్‌మెంట్లు యివ్వకూడదు” అంటూ తేల్చాడు. వెంకటేశం చెప్పిందేదో బాధ్యతాయుతంగా ఉందన్నట్టుగా గిరీశం చుట్ట ఓసారి గుప్పుగుప్పుమనిపించాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి