సౌకర్యాలు మెరుగుపరుస్తాం….సంస్కరణలు తీసుకొస్తాం

0
270
సెంట్రల్‌ జైలులో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం
నగరంలో చంద్రబాబు 12 గంటల సుడిగాలి పర్యటన
రాజమహేంద్రవరం, నవంబర్‌ 19 : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు నగరంలో సుడిగాలి పర్యటన జరిపి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విజయవాడ నుంచి నిర్ణీత సమయానికే  ఉదయం 9-30 గంటలకు మధురపూడి విమానాశ్రయం చేరుకున్న సీఎం రాత్రి వరకు రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌, రాజానగరం నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. తీరిక లేని షెడ్యూల్‌తో పర్యటన సాగించి అభివృద్ధి పనులతో పాటు కొద్ది సేపు పార్టీ సమావేశానికి కూడా సమయం కేటాయించారు. సెంట్రల్‌ జైలు నుంచి శాటిలైట్‌ సిటీ గ్రామానికి చేరుకుని అక్కడ జరిగిన జన చైతన్య యాత్రలో పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. అక్కడ నుంచి జెఎన్‌రోడ్డులోని చెరుకూరి కళ్యాణ మండపానికి చేరుకుని అక్కడ పార్టీ జిల్లా సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన డ్వాక్రా సదస్సులో పాల్గొని ఇంకా పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. తొలుత విమానాశ్రయం నుంచి నేరుగా సెంట్రల్‌ జైలు వద్దకు చేరుకుని అక్కడ రూ. 7 కోట్లతో నిర్మించిన పరిపాలనా భవనాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఆ తర్వాత జైలు ప్రాంగణంలోనే ఖైదీల కోసం రూ. 4 కోట్లతో నిర్మించే  50 పడకల ఆసుపత్రి భవనానికి సీఎం శంకుస్థాపన చేశారు. దాదాపు 1800 మంది ఖైదీల సామర్ధ్యం కలిగి ఉన్న సెంట్రల్‌ జైలులో ఖైదీలకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తితే సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళేవారు. దీంతో ఎస్కార్ట్‌ సమస్య, ప్రత్యేక సిబ్బంది నియామకం వంటి ఇబ్బందులు ఉండేవి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఖైదీల కోసం ప్రత్యేకంగా ఓ ఆసుపత్రిని జైలులోనే నిర్మిస్తున్నారు. ఆసుపత్రికి శంకుస్థాపన చేశాక కొద్దిసేపు సీఎం చంద్రబాబు జైలును పరిశీలించారు.  ఖైదీలు ఉత్పత్తులను పరిశీలించారు.ఫోటొ ఎగ్జిబిషన్‌ తిలకించారు. కొద్దిసేపు ఖైదీలతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ఖైదీలను ఉద్ధేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ చిన్న తప్పులకు పెద్ద శిక్షలు పడకుండా చట్టాల్లో మార్పులు తెస్తామన్నారు. జైళ్ళలో సౌకర్యాలను మెరుగుపర్చి సంస్కరణలు తీసుకొస్తామని అన్నారు. ఖైదీలకు శిక్ష కంటే పరివర్తన ముఖ్యమని ఆయన అన్నారు. ఖైదీల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, హోం శాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకులు తోట నరసింహం, రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళిమోహన్‌, రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌, రాజానగరం ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పెందుర్తి వెంకటేష్‌, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, జెడ్పీ చైర్మన్‌ నామన రాంబాబు,  డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, జిల్లా కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ సత్యనారాయణ, సబ్‌ కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌, నగర పాలక సంస్ధ కమిషనర్‌ విజయరామరాజు, ఇంటిలిజెన్స్‌ విభాగం చీఫ్‌ ఎ.బి.వెంకటేశ్వరరావు, జైళ్ళ విభాగం ఐ.జి వినయ్‌ రంజన్‌ రే, జైళ్ళ డి.ఐ.జి. చంద్రశేఖర్‌, జైలు సూపరింటెండెంట్‌ వరప్రసాద్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ రఘు, మహిళా జైలు సూపరింటెండెంట్‌ ఆర్‌. శారదా తదితరులు పాల్గొన్నారు. మావోల  సమస్య, కాపు ఉద్యమ ప్రభావం నేపధ్యంలో సీఎం పర్యటనకు గట్టి పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.
విమానాశ్రయంలో ఘన స్వాగతం
గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయానికి వచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రి రాజప్ప, ఇన్‌ఛార్జి మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావులతో పాటు తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకులు తోట నరసింహం,రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళిమోహన్‌, నగర మేయర్‌ పంతం రజనీ శేషసాయి, ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పెందుర్తి వెంకటేష్‌, నల్లమిల్లి రామకృష్ణారెెడ్డి, దాట్ల బుచ్చిరాజు, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, ఆదిరెడ్డి అప్పారావు, సోము వీర్రాజు, కె.రవికిరణ్‌ వర్మ, జెడ్పీ చైర్మన్‌ నామన రాంబాబు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, నల్లమిల్లి వీర్రెడ్డి, జిల్లా కలెక్టర్‌ హెచ్‌. అరుణ్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ సత్యనారాయణ, సబ్‌ కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ విజయరామరాజు, ప్రముఖ కాంట్రాక్టర్‌ ఆర్‌. సుబ్బరాజు తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.