సౌకర్యాల మెరుగుతో తగ్గిన ఖైదీల మరణాలు 

0
164
పునశ్చరణ తరగతుల ప్రారంభంలో జైళ్ళ శాఖ ఐజి హర్షవర్ధన్‌
రాజమహేంద్రవరం, మార్చి 6 : జైళ్లశాఖలో నెలకొన్న సమస్యల పరిష్కారానికే ప్రతీ ఏటా పునశ్చరణ తరగతులను నిర్వహిస్తున్నట్లు జైళ్ల శాఖ ఐజి జి జయవర్థన్‌ వెల్లడించారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌జైలులో రాష్ట్రస్థాయి జైళ్లశాఖ అధికారుల పునశ్చరణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ  పునశ్చరణ తరగతుల్లో అధికారులు పరస్పరం జైళ్లలో  పదురయ్యే సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధించి  ఇప్పటి వరకు సుమారు 360 జిఓలను జారీ చేశామన్నారు. ముఖ్యంగా ఖైదీల ఆహారం, ఆరోగ్యానికి సంబంధించిన పలు చర్యలు తీసుకున్నామన్నారు. ఖైదీలకు మెరుగైన ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. జైళ్లలో మెరుగైన సౌకర్యాలు కల్పించడం వల్ల ఖైదీల మరణాల రేటు గణనీయంగా తగ్గిందన్నారు. గతంలో 150 మరణాలు సంభవించేవని, ప్రస్తుతం వాటి సంఖ్య 30కి తగ్గిందని వివరించారు. నూరుశాతం ఖైదీలకు పనికల్పించడమే ధ్యేయంగా సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు.  2001 నుంచి పునశ్చరణ తరగతులను నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత ఇది నాలుగో కార్యక్రమన్నారు.  త్వరలో 100 మంది వార్డర్ల నియామకానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే అభ్యర్థుల పంపిక పూర్తయ్యిందన్నారు. ఈకార్యక్రమంలో గెయిల్‌ అధికారి కెపి రమేష్‌, జైళ్లశాఖ డిఐజి ఐ శ్రీనివాసరావు, జైలు సూపరింటెండెంట్‌ పిజి సాయిరామ్‌ప్రకాష్‌, రాష్ట్రంలోని వివిధ జైళ్లకు చెందిన అధికారులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు పునశ్చరణ తరగతులు కొనసాగనున్నాయి. పునశ్చరణ తరగతులు అనంతరం ఖైదీలు తయారు చేసిన వివిధ ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ఐజీ ప్రారంభించారు. అలాగే ఫొటో ప్రదర్శనను తిలకించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here