స్తంభించిన బ్యాంకింగ్‌ సేవలు 

0
109
దిగిరాకపోతే ఏప్రిల్‌ 1 నుంచి నిరవధిక సమ్మె : యుఎఫ్‌బియు నాయకులు
కోటిపల్లి బస్టాండ్‌ ఆంధ్రాబ్యాంక్‌ వద్ద ఉద్యోగుల ధర్నా
రాజమహేంద్రవరం,జనవరి 31 : బ్యాంక్‌ ఉద్యోగులకు వేతన సవరణ చేయడంతో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణం భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ రెండ్రోజుల సమ్మె ప్రారంభించారు. యునైటెడ్‌ ఫోరమ్‌ ఫర్‌ బ్యాంక్‌ యూనియన్స్‌  పిలుపుమేరకు ఉద్యోగులు నేటి నుంచి సమ్మెకు దిగడంతో రాజమహేంద్రవరం నగరంలోని బ్యాంకులన్నీ మూతపడ్డాయి. బ్యాంకుల తాళాలు తెరుచుకోకపోవడంతో అన్ని లావాదేవీలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా స్థానిక కోటిపల్లి బస్టాండ్‌ వద్దనున్న ఆంధ్య్రాబాంక్‌ వద్ద యుఎఫ్‌బియు నేతలతో కలిసి ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. యుఎఫ్‌టియు నేతలు ఎన్‌.లక్ష్మీపతిరావు, కొండలరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బ్యాంకు ఉద్యోగుల వేతనాలను 13 శాతం మాత్రమే పెంచేందుకు అనుమతి ఇవ్వడం సరికాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు బాధ్యతలను కూడా బ్యాంకులకే అప్పగించడం వల్ల ఇటీవల కాలంలో విపరీతమైన పనిభారం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసారు. బ్యాంకుల్లో రిటైర్డ్‌ అవుతున్న ఉద్యోగుల స్థానంలో కొత్తగా అధికారులు, సిబ్బందిని నియమించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. లక్షల కోట్లు నొక్కేసి విదేశాలకు పారిపోయి బ్యాంకుల రుణాలను ఎగ్గొట్టిన బడా వ్యాపారులను దేశానికి రప్పించి వెంటనే వారి నుంచి సొమ్ములను రికవరీ చేయాలని డిమాండ్‌ చేసారు. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు విన్నవిస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇదే విధానాన్ని కొనసాగిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరవధిక సమ్మెకు దిగడానికి ఇప్పటికే యుఎఫ్‌బియు నిర్ణయం తీసుకుందన్నారు. ఉద్యోగులపై పనిభారం పెరిగిపోయిందని, ఖాతాదారుల కోసం శ్రమించి, సేవలందిస్తున్నా, తమను పట్టించుకోకుండా, డిమాండ్ల పరిష్కారం విషయంలో సాగతీత ధోరణిలోనే ప్రభుత్వం ఉందని యూనియన్‌ నాయకులు ఆరోపించారు. దీనికి ముందు మార్చి 11 నుంచి మూడు రోజుల సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు. 1వ తేదీన కంబాలచెరువు ఎస్‌బిఐ మెయిన్‌ బ్రాంచ్‌ వద్ద నిరసన ప్రదర్శన చేస్తామన్నారు. కేంద్రం దిగొచ్చేవరకు బ్యాంకు ఉద్యోగుల ఆందోళన ఆగదని స్పష్టం చేసారు. సిఐటియు నాయకుడు ఎస్‌ఎస్‌ మూర్తి, రిటైర్డ్‌ బ్యాంక్‌ ఉద్యోగుల అసోసియేషన్‌ నాయకులు సంఘీభావం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here