స్వచ్చందమే సుందరం

0
419
మనస్సాక్షి  – 1015
తెల్లగా తెల్లారిపోయింది. గిరీశం గారింటికి తాళం వేసుంది. వెంకటేశం మాత్రం యింటరుగుమీద కూర్చుని పాత పాటేదో పాడుకుంటున్నాడు. ఈలోగా సైకిలు తొక్కుకుంటూ అబ్బులు అక్క డికి రావడం జరిగింది. గిరీశం గారింటికి తాళం వేసుండడం చూసి కొంచెం నిరాశపడ్డాడు. అంత లోనే అరుగుమీదున్న వెంకటేశం కనపడేసరికి ”నమస్కారం బాబయ్యా… పెద్దబాబు గారు లేరా?” అన్నాడు. వెంకటేశం తల అడ్డంగా ఊపి ”యిందాక నేనొచ్చేసరికే లేరు. వాకింగ్‌కి వెళ్ళి నట్టున్నారు” అన్నాడు. దాంతో అబ్బులు ”మరేం ఫర్వాలేదు బాబయ్యా… చిన్న పని మీదొచ్చాను. మీరయినా సరిపోతారు” అన్నాడు. వెంకటేశం ఏంటన్నట్టుగా చూశాడు. ఈలోగా అబ్బులు అరుగుమీద చతికిలబడుతూ ”ఏం లేదు బాబయ్యా… నేనేదో చిన్నపాటి యాపారం చేసుకుంటుంటా. ఎప్పట్నుంచో ఎనకేసు కున్న డబ్బులు ఓ పదిలక్షల దాకా ఉంటాయి. అయ్యన్నీ అయి దొందలూ, వెయ్యి నోట్లే. గవురుమెంటోడు ఆటన్నిటినీ రద్దు చేసేత్తాడండి. ఏం చేయాలో పాలుపోక సలహా అడుగుదామని వచ్చా” అన్నాడు. దాంతో వెంకటేశం ”ఓస్‌ అంతేనా…ఆ పది లక్షలూ ఉన్నాయని గవర్నమెంటుకి తెలియజెయ్యడమే. దాంతో సగం వాళ్ళు తీసేసుకుని మిగతా అయిదు లక్షల్లో ఓ రెండున్నర లక్షలు నాలుగేళ్ళ తర్వాత యిస్తారు. ఓ రెండున్నర లక్షలు వెంటనే నీకిచ్చేస్తారు. వాటిని జాగ్రత్తగా ఖర్చుపెట్టుకోవచ్చు” అన్నాడు. దాంతో అబ్బులు దిగాలుగా ”అంటే నాలుగో వంతే చేతికి వస్తుందన్నమాట” అన్నాడు. వెంకటేశం తలూపి ”అవును. యిప్పుడు నాలుగోవంతు చేతికిచ్చినా యింకో నాలుగేళ్ళ తర్వాత యింకో నాలుగో వంతు వస్తుంది కదా” అన్నాడు. అబ్బులు తలూపి అసంతృప్తిగానే వెనుదిరిగాడు.
అఅఅఅ
మర్నాడు మధ్యాహ్నం… ఎవరో తలుపులు కొట్టేసరికి గిరీశం వెళ్ళి తలుపులు తెరిచాడు. ఎదురుగా అబ్బులు. అయితే మనిషే కొంచెం దిగాలుగా ఉన్నాడు. దాంతో అబ్బులు ”నాకో సమస్యొ చ్చింది బాబయ్యా.. ఎప్పట్నుంచో పోగేసుకుంటున్న పది లచ్చల డబ్బూ పనికి రాకుండా పోద్దంట. నిన్నొత్తే మీ బామ్మర్ది గారు ఏదో సలహా యిచ్చేరు. అలా చేత్తే నా చేతికొచ్చేదేం ఉండదు ఎంత యినా మీలెక్క ఏరు కదా. అందుకే మీతో మాట్లాడదావని వచ్చా” అన్నాడు. దాంతో గిరీశం ఓసారి చుట్ట గుప్పుగుప్పుమనిపించి ”ఎంతయినా నాతో మాట్లాడ్డవే ఎడ్యుకేషన్‌ని అంతా అంటారు. నీకు బ్రహ్మాండమయిన ఉపాయం నేను చెబతా. అలా కూర్చో” అన్నాడు. ఆపాటికి అబ్బులు మొహంలో వెలుగొచ్చింది. అక్కడే హాల్లో కింద చతికిలబడ్డాడు. అప్పుడు గిరీశం ఏం చేయాలో చెప్పడం మొదలెట్టాడు. ”ఈ పదిలక్షలూ పట్టుకెళ్ళి నీకు బాగా నమ్మకమున్న రైతుల ఖాతాల్లో తలో లక్షా వేయించెయ్‌. తర్వాత వారానికింతని డ్రా చేయించి తీసేసుకో. యిలా చేసేసింతర్వాత వాళ్ళందరికీ  తలో అయిదు వేలూ యిచ్చెయ్‌. వెరసి నీకో యాభైవేలు ఖర్చవుతుంది. ఆనక తొమ్మిదిన్నర లక్షలూ నీచేతికొచ్చేస్తాయి. ఏవంటావ్‌?” అన్నాడు. అది వినగానే అబ్బులు మొహం వెలిగిపోయింది. ”బాబయ్యా… ఎంతయినా మీ తెలివితేటలే వేరు. మళ్ళీ వచ్చినప్పుడు జున్ను పాలు పట్టు కొత్తా” అంటూ లేచి చక్కాపోయాడు.
అఅఅఅ
”అది గురూగారూ…నాకొచ్చిన కల ” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం కయ్యిమని ”అంటే నువ్వేదో గొప్ప దేశభక్తుడివీ, ఆదర్శవంతుడివీ అన్నమాట. నేనేమో టుమ్రీ సలహాలిచ్చే వెధ వాయినీ అన్నమాట” అన్నాడు. దాంతో వెంక టేశం కంగారుపడి ”అదేం కాదు గురూగారూ… జరుగుతున్న  చరిత్రని బట్టి అలాంటి కలొచ్చుంటుంది” అన్నాడు. గిరీశం తలూపి ”సరే… ఈ వారం ప్రశ్నేదో దీనిమీదే లాగించేస్తా. ఈ కలల గురించి కొంచెం విశ్లేషించు” అన్నాడు. దాంతో వెంకటేశం ”ఏవుంది గురూగారూ… జరుగుతున్న పరిస్థితులు సగటు మనిషిని రకరకాలుగా ఆలోచించేలా చేస్తున్నాయి. ఓ పక్కన ప్రభుత్వం స్వచ్చందంగా నల్లధనాన్ని ప్రకటించేస్తే సగం తీసేసుకుని నాలుగోవంతు యిచ్చి, యింకో నాలుగోవంతు నాలుగేళ్ళ తర్వాత వడ్డీ లేకుండా యిస్తానంటుంది. ఏతావాతా ఈ పద్ధతిలో లెక్కేసుకుంటే వెంటనే చేతికొచ్చే 25 శాతం, నాలుగేళ్ళ తర్వాత వడ్డీ లేకుండా వచ్చే 25 శాతంతో కలిపి చేతికొచ్చేది. దాదాపుగా 37 శాతానికి సమానం. అంటే 63 శాతం నష్టపోవడమే. అలాక్కాకుండా వాళ్ళే పట్టుకుంటే నష్టపోయేది 85 శాతం. ఓ రకంగా ఈ రెండింటి మధ్యా తేడా అంత ఆకర్షణీయంగా లేదు. అందుకే ఈ స్వచ్చంధ స్కీమ్‌ అంతా సక్సెస్‌ కాకపోవచ్చు. యిక కలలో మీరు చూపించిన అడ్డదారి ఉండనే ఉంది కదా. దానివైపే మొగ్గు చూపే అవకాశం ఎక్కువుంది” అన్నాడు. దాంతో గిరీశం ”అయితే నువ్వు కూడా ఈ తప్పుడు దారికే సపోర్టా?” అన్నాడు. దాంతో వెంకటేశం ”ఛ…ఛ… లేదు గురూగారూ… నేను సిసల యిన దేశభక్తుడిని.  ప్రభుత్వం ఏం చేసినా అది వ్యవస్థ బాగు కోసం, బంగారు భవిష్యత్తు కోసం అని నేను నమ్ముతాను. అందరూ నమ్మాలి కూడా. యిప్పుడు జరిగే ఈ నల్లధనం వెలికితీత అనబడే  మహాయజ్ఞం వలన వ్యవస్థ బాగుపడుతుంది. కేవలం కొన్ని వేలమంది దగ్గర ఉండిపోయిన లక్షల కోట్ల ధనాన్ని వెలికితీసి కోట్లాదిమందికి లబ్ధి చేకూర్చడమే ఈ యజ్ఞం ధ్యేయం. అయితే అందరూ గమనించవలసింది ఏంటంటే… ఊరంతా బాగుపడా లని కోరుకున్నవాడు ముందుగా తన యింటి ముందు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. తన యిల్లు కూడా ఆ ఊరిలో భాగమే అని గుర్తెరగాలి. అలాగే వ్యవస్థలో నల్లధనం అనేది అంత రించిపోవాలి అని కోరుకున్నవాడు తన దగ్గరున్న నల్లధనం విషయంలోనూ ఆ నిజాయతీ పాటించాలి. అది ఎక్కువయినా తక్కువయినా సరే” అంటూ వివరించాడు. వెంకటేశం చెప్పిం దంతా వినేసరికి గిరీశం చాలా ఆనందపడ్డట్టే కనిపించాడు. శభాష్‌ అంటూ వెంకటేశం భుజం తట్టాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి