స్వచ్ఛమైన నీరు అందించేందుకు బృహత్తర ప్రాజెక్టు 

0
196
9 జిల్లాలలో వాటర్‌ గ్రిడ్‌కు రూ. 45వేల కోట్లు : ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని
వాటర్‌ గ్రిడ్‌పై అధికారులతో సమీక్ష – హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 10 :  రాష్ట్రంలోని 9 జిల్లాల్లోని ప్రతీ గ్రామానికి స్వచ్ఛమైన మంచినీటిని అందించేందుకు రూ.45వేల కోట్లతో బృహత్తర ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుడుతున్నారని ఉపముఖ్యమంత్రి,  రాష్ట్ర వైద్యశాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆళ్ళ నాని వెల్లడించారు. స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిధి గృహంలో ఈరోజు వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుపై ఉభయగోదావరి జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇరిగేషన్‌ శాఖ, మున్సిపల్‌ ఇతర శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాలలోని ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన మంచినీటిని సరఫరా చేయడానికి రూ.8,500 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు చేపడుతున్నామన్నారు. గ్రామ గ్రామానికి పైపులైన్‌లు ద్వారా మంచినీరు అందించాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. అందులో భాగంగానే ఈ బృహత్తరమైన ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం జరిగిందన్నారు.  సమగ్ర ప్రాజెక్టు రూపకల్పన చేసి, ఇందులో లోటుపాట్లను పూర్తిస్ధాయిలో అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. ఇరిగేషన్‌ శాఖ ఇంజనీరింగ్‌ ఇన్‌ ఛీఫ్‌ మాట్లాడుతూ గ్రామాల్లో 105 లీటర్‌లు, మున్సిపాలిటీలలో 150 లీటర్‌లు, నగరాల్లో 160 లీటర్‌లు తలసరి ఒక్కొక్కరికి నీరు అందించే విధంగా ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగిందన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో గోదావరి జలాలను వినియోగించుకుని ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం జరిగిందన్నారు. 2051 నాటికి జనాభా ప్రాతిపదికన ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నామన్నారు. ఇరిగేషన్‌ శాఖ అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఉభయగోదావరి జిల్లాల్లో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు వివరాలను మంత్రులు, ప్రజాప్రతినిధులకు వివరించారు. ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర  రెవెన్యూ శాఖామంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ గ్రామగ్రామానికి స్వచ్ఛమైన మంచినీటిని అందించేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం ఆనందదాయకమన్నారు. వ్యవసాయశాఖామంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ వాటర్‌ గ్రిడ్‌కు సంబంధించి గోదావరి చెంతనే ఫిల్టర్‌ బెడ్‌ ఏర్పాటు చేసుకోవాలా, లేకుంటే ‘రా’ వాటర్‌ తీసుకువెళ్ళి అవసరమైన చోట ఫిల్టర్‌ బెడ్‌లు ఏర్పాటు చేసుకోవాలా అన్న అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలన్నారు. గత ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టు రూపకల్పనకు సంబంధించి రూ.38 కోట్లకు కన్సెల్టెన్సీకి అప్పగించారని, అయితే జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు రూపకల్పన బాధ్యత ఇరిగేషన్‌ శాఖ అధికారులకే అప్పగించారని, వారు ఈ ప్రాజెక్టు రూపకల్పన చేయడం అభినందనీయమన్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు మాట్లాడుతూ వాటర్‌ గ్రిడ్‌కు సంబంధించి సాంకేతికంగా ఎదురయ్యే సవాళ్ళను, నిర్వహణ ఖర్చులకు సంబంధించి కూడా అధ్యయనం చేయాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖామంత్రి పినిపే విశ్వరూప్‌ మాట్లాడుతూ ధవళేశ్వరం వద్ద 365రోజుల పాటు నీరు అందుబాటులో ఉంటుంది కనుక అక్కడే ఫిల్టరేషన్‌ ప్లాంట్‌లు ఏర్పాటుచేసి, స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసే విధంగా ప్రాజెక్టు రూపొందించాలన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు వద్ద ఫిల్టరేషన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసి ఏజెన్సీ ప్రాంతానికి మంచినీటి సరఫరా చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ గోదావరి చెంతే ఫిల్టరేషన్‌ జరిగితే 10 శాతం వృధా తగ్గుతుందన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖామంత్రి తానేటి వనిత, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు మాట్లాడారు. రాజమహేంద్రవరం పార్లమెంట్‌ సభ్యులు మార్గాని భరత్‌ రామ్‌ మాట్లాడుతూ  నగరానికి సంబంధించి ముందుగా డ్రైనేజి వ్యవస్ధను ప్రక్షాళన చేసిన తర్వాత వాటర్‌ గ్రిడ్‌ ప్రాజక్టును అమలు చేస్తే బాగుంటుదన్నారు. దీనిపై నరసాపురం ఎంపి రఘురామకృష్ణంరాజు అభ్యంతరం తెలిపారు. వాటర్‌ గ్రిడ్‌, డ్రైనేజి వ్యవస్ధ ప్రక్షాళ వేరువేరు అంశాలని అభిప్రాయపడ్డారు. ఎంపిలు వంగా గీత, చింతా అనూరాధా, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, గోరంట్ల బుచ్చయ్యయచౌదరి, డాక్టర్‌ సత్తి సూర్యానారాయణ రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, పెండెం దొరబాబు, చంద్రశేఖర్‌రెడ్డి, పర్వత ప్రసాద్‌, జ్యోతుల చంటిబాబు, తెల్లం బాలరాజు, జివిఎస్‌ నాయుడు, కొఠారి అప్పయ్య చౌదరి, గ్రంధి శ్రీనివాస్‌, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, నగరపాలక సంస్ధ కమిషనర్‌ సుమిత్‌కుమార్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here