స్వయంసంవృద్ది సాధన దిశగా ‘గుడా’ కృషి

0
291

గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 18 : పట్టణాభివృద్దిసంస్ధలు స్వయం సమృద్ధిని సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన సూచనలకు అనుగుణంగా గోదావరి అర్బన్‌ డవలప్‌మెంట్‌ అథారిటీ(గుడా)కు ఆర్ధికపరిపుష్టి కల్పించేందుకు ఆలోచనలు చేస్తున్నామని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ తెలిపారు. రాష్ట్రంలో మిగిలిన పట్టణాభివృద్ది సంస్దలతో పోలిస్తే చాలా విషయాల్లో గుడా ముందంజలో వుందని ఆయన తెలిపారు. గుడా పరిధిలోని లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు, టెక్నీషియన్లకు అవగాహన సదస్సును స్ధానిక సర్వారాయకళామందిరంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంతకుముందు వైస్‌చైర్మన్‌ తయారు చేయించిన సాఫ్ట్‌వేర్‌తో అనుమతులు అన్నీ ఆన్‌లైన్‌లో ఇవ్వకలుగుతున్నామన్నారు. ఎపిడిపిఎమ్‌ఎస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో అనుమతులు ఇవ్వడంలో గుడా ప్రథóమస్ధానంలో వుందన్నారు. గత అక్టోబరు నుండి ప్లాన్‌లకు అనుమతులు ఇస్తున్నామన్నారు. కాకినాడ, రాజమహేంద్రవరంలో మూడేసి లేఅవుట్‌లకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. మిగిలిన పట్టణాభివృద్దిసంస్ధలు ఇంకా ఈ సాప్ట్‌వేర్‌ను ఏర్పాటు చేసుకోలేదన్నారు. దేశంలో అభివృద్ది చెందిన పట్టణాభివృద్ది సంస్ధలను అధ్యయనం చేసి వచ్చామని, వాటి ఆధారంగా ఏఏ కార్యక్రమాలు చేపట్టవచ్చో స్ధానిక పరిస్థితులకనుగుణంగా నివేదికలు తయారు చేసి ఇమ్మనమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారన్నారు. గుడా పరిధిలో 201 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు పేర్లు నమోదు చేసుకున్నారని, వీరంతా గుడా పరిధిలో ఎక్కడైనా చేయవచ్చునన్నారు. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో గుడాను ఆదర్శవంతమైన సంస్ధగా తీర్చిదిద్దుతామన్నారు. సంస్ధ డైరెక్టర్‌ గట్టి సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడలో అచ్చంపేట జంక్షన్‌ నుండి సర్పవరం వరకు సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన చేశామన్నారు. పరిమితమైన సిబ్బంది వున్నప్పటికి ఫలితాల సాధనలో మాత్రం ముందున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లేఅవుట్‌లు రెగ్యులరైజేషన్‌, బిపిఎస్‌లను ఉపయోగించుకుని ఆదాయవనరులు పెంపొందించుకునే యోచన చేస్తున్నామన్నారు. ప్లానింగ్‌ ఆఫీసర్‌ సంజయ్‌ మాట్లాడుతూ లేఅవుట్‌లు వేసేటప్పుడు పార్కులు, రోడ్లుపై భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. వైస్‌చైర్మన్‌ అమరేంద్ర మాట్లాడుతూ లేఅవుట్‌లు, జిప్లస్‌3 నిర్మాణాలకు సంబంధించి తీసుకోవలిసిన అనుమతులు గురించి సిబ్బందితో అవగాహన కలిగేవిధంగా పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. అనధికార లేఅవుట్‌లను గుర్తించి నోటీసులు జారీ చేశామని, అక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. విధానపరమైన నిర్ణయం తీసుకోవలిసివుందన్నారు. పంచాయితీ పరంగా అనధికార లేఅవుట్‌లో రోడ్లు వేసినా ఏమీ చేయలేమన్నారు. ఈ కార్యక్రమంలో గుడా ఉద్యోగులు, గుడా పరిధిలోని సర్వేయర్లు హజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here