హక్కుల పరిరక్షణకు కార్మికవర్గం ఐక్యం కావాలి 

0
406
ఎఐటియుసి జాతీయ సమితి సభ్యులు
రాజమహేంద్రవరం, నవంబర్‌ 1 : హక్కుల పరిరక్షణకు కార్మికవర్గం ఐక్యం కావాల్సిందిగా ఎఐటియుసి జాతీయ సమితి సభ్యులు మీసాల సత్యనారాయణ పిలుపునిచ్చారు. 97వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా సోమవారం స్ధానిక జట్లు లేబర్‌ యూనియన్‌ కార్యాలయం పైన, అపరాల సెక్షన్‌ కార్యాలయంపై ఎఐటియుసి పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ బ్రిటిషు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశంలో కార్మికవర్గాన్ని ఐక్యం చేసిన మొట్టమొదటి యూనియన్‌ ఎఐటియుసి అని గుర్తు చేశారు. 1926లోనే ట్రేడ్‌ యూనియన్‌ యాక్ట్‌ను బ్రిటిషు ప్రభుత్వం నుంచి సాధించడం జరిగిందని, స్వాతంత్య్రానంతరం వచ్చిన ప్రధానమైన కార్మిక చట్టాలన్నింటికి రూపకల్పన ఎఐటియుసి ఘనతేనన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు పోరాటాల ద్వారా సాధించిన కార్మిక చట్టాలను సవరణల పేరుతో నీరుగార్చాలని ప్రయత్నిస్తున్నందున కార్మికవర్గం తమ హక్కులను కాపాడుకునేందుకు సమైక్యం కావాలని మీసాల పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యపరిచి కార్పొరేట్‌ వర్గాలకు కొమ్ముకాస్తూ కార్మికులను వారికి బానిసలుగా చేసేందుకు సవరణలు తలపెట్టారని పేర్కొన్నారు. ప్రభుత్వరంగం పరిరక్షణ ద్వారానే దేశం పరిరక్షించబడుతుందన్నారు. కాంట్రాక్టు విధానాన్ని రద్దు పరచి, కనీసవేతనం రూ.18వేలు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఇఎస్‌ఐ, బోనస్‌లపై పరిమితులు ఎత్తివేయాలని, సంక్షేమ బోర్డులు ఆటో కార్మికులు, హమాలీ కార్మికులకు కూడా ఏర్పాటు చేయడంతో పాటు సంక్షేమ బోర్డులలో నిధులు ఆయా వర్గాలకు వినియోగించాలని డిమాండ్‌ చేశారు. బ్యాంకుల విలీనం పేరుతో బ్యాంకింగ్‌ వ్యవస్థను నాశనం చేసే ప్రభుత్వ విధానాలను తక్షణం విడనాడాలని హితవు పలికారు.  జిల్లా ప్రధాన కార్యదర్శి కిర్లకృష్ణ కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈకార్యక్రమంలో జట్లు లేబర్‌ యూనియన్‌ కార్యదర్శి బల్లిన రాము, ఉపాధ్యక్షులు రెడ్డి అప్పారావు, వేమల నారాయణ, సహాయ కార్యదర్శి డిఎల్‌ నాయుడు, అపరాల సెక్షన్‌ అధ్యక్షులు కొండలరావు తదితరులు పాల్గొన్నారు.