హర్షకుమార్‌కు అండగా నిలబడతాం..

0
100
కేసులు ఎత్తేసే వరకు ఉద్యమం – ఎంఆర్‌పిఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 19 : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమ సమయంలో తునిలో రైలు దహనం చేస్తే ఆ కేసులను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం రాజమహేంద్రవరంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబానికి అండగా నిలబడితే మాత్రం మాజీ ఎంపీ జివ హర్షకుమార్‌పై కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమని ఎంఆర్‌పిఎస్‌ వ్యవస్ధాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నిలదీసారు. హర్షకుమార్‌కు మద్ధతుగా స్థానిక కోరుకొండ రోడ్‌లో ఉన్న ఆయన నివాసంలో రిలే దీక్షలు చేస్తున్న నాయకులకు గురువారం మందకృష్ణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరిత చర్యలేనని మండిపడ్డారు. ఉభయ రాష్ట్రాల్లో ఒక దళిత నాయకుడిగా మాజీ ఎంపీ జివి హర్షకుమార్‌ పేరు తెచ్చుకున్నారన్నారు. అటువంటి వ్యక్తి పట్ల ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరించడం సరికాదన్నారు. దళితుల పట్ల ప్రభుత్వ వైఖరి ఏమిటో ఈ అరెస్టుతో తేటతెల్లమైందన్నారు. అక్కడ ఏ-1గా ఉన్న ముద్రగడ పద్మనాభం పట్ల అంత జాలితో వ్యవహరించి కేసులు రద్దు చేసిన ప్రభుత్వం ఇక్కడ మాత్రం ఒక దళిత నాయకుడిపై కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకి పంపిందని ధ్వజమెత్తారు. ఆయనను ప్రభుత్వం భేషరతుగా విడుదల చేసే వరకు కుటుంబానికి అండగా నిలబడతామని ఆయన కుమారులకు స్పష్టం చేసారు. ప్రభుత్వ నిర్లక్ష్య విధానానికి వ్యతిరేకంగా ఎంఆర్‌పిఎస్‌ పోరాటం కొనసాగుతుందన్నారు. హర్షకుమార్‌పై అక్రమంగా పెట్టిన కేసులన్నీ తక్షణమే ఎత్తి వేసి జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్‌ చేసారు. ఇలా ప్రజలకు అండగా నిలబడే వారిపై పెట్టే అక్రమ కేసుల వ్యవహరాన్ని అందరూ గమనిస్తున్నారని పేర్కొన్నారు. దీక్షలో కూర్చున్న వారికి సంఘీభావం తెలిపారు. ఆయన వెంట ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర నాయకుడు ముమ్మిడివరపు చిన సుబ్బారావు, వైరాల అప్పారావు, కొత్తపల్లి రఘు తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here