హామీల అమలులో ప్రభుత్వం విఫలం

0
346

ప్రజా పక్షంగా సిపిఎం పోరాటాలు : మాజీ ఎంపి డాక్టర్‌ మిడియం

రాజమహేంద్రవరం, జనవరి 6 : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో ప్రభుత్వం విఫలం చెందిందని, ఇళ్ళ నిర్మాణంలో ఘోర వైఫల్యం చెందిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, పార్లమెంట్‌ మాజీ సభ్యులు డాక్టర్‌ మిడియం బాబూరావు పేర్కొన్నారు. స్ధానిక ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బాబురావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన, విధులు, నిధులు, అనేక ప్రాజెక్టులు రాకున్నప్పటికీ మాట్లాడని ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రధానిని, రాష్ట్రపతిని కలుస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పనులు జరగడం లేదని ఈ పరిస్థితుల్లో 2019నాటికి నీరు ఎలా అందిస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి భూసేకరణ, పునరావాసం కార్యక్రమం అనేది జరగలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు కింద 80వేల కుటుంబాలు, 2లక్షల జనాభా నిర్వాసితులవుతున్నారని, అయితే వందలమందికి మాత్రమే ప్రభుత్వం పునరావాసం కల్పించి, బలవంతంగా తరలించిందన్నారు. జన్మభూమి సభలు ఎన్నికల ప్రచార సభలుగా జరుగుతున్నాయే తప్ప, ప్రజా సమస్యలను తెలియజేయడానికి ప్రజలకు గానీ, ప్రతిపక్షాలకు గానీ అవకాశం ఇవ్వడం లేదన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌ఎస్‌ మూర్తి, పి తులసి, నగర కార్యదర్శి పోలిన వెంకటేశ్వరరావు, బి రాజులోవ, బి పవన్‌లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here