హొదా….హామీల కంటే ఎక్కువే సహాయం చేస్తున్నాం

0
306
పరిపాలనా నగరానికి శంకుస్థాపన సభలో అరుణ్‌జైట్లీ
అమరావతి నిర్మాణ దిశగా తొలి అడుగు
అమరావతి, అక్టోబర్‌  28 : నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ దిశగా ఈరోజు తొలి అడుగు పడింది.  రాజధాని అమరావతి తొమ్మిది నగరాలుగా నిర్మితం కానుండగా లింగాయపాలెం – రాయపూడి  మధ్య  పరిపాలనా నగరానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. రాజధాని అమరావతిలో ఇదే తొలి నిర్మాణం కావడం విశేషం. దాదాపు 950 ఎకరాల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి రూ. 5,600 కోట్లు అవసరమవుతాయని  అంచనా వేయగా వీటిని 2018 డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ల క్ష్యంగా పెట్టుకుంది. ఈ పరిపాలనా భవనంలో రాష్ట్ర సచివాలయం, శాసనసభ, మండలి భవనాలు, రాజ్‌భవన్‌, ముఖ్యమంత్రి నివాస భవనం, ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాలు, మంత్రులు, అధికారులు, ఉద్యోగుల నివాస గృహాలు ఉంటాయి.  ఈ సందర్భంగా అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ విభజన కష్టాల్లో ఉన్న ఏపీకి ఈ రెండున్నరేళ్ళలో రూ. 2,03,133 కోట్లు కేటాయించామని, హామీ ఇచ్చిన దానికంటే ఎక్కువే ఆంధ్రాకు సహాయం చేశామని, హొదా కంటే ఎక్కువే ప్రయోజనాలు చేకూర్చామన్నారు. పోలవరం ప్రాజక్ట్‌కు నాబార్డ్‌ ద్వారా సహాయం అందజేస్తామన్నారు.ఆంధ్రప్రదేశ్‌కు కావలసిన సహాయం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు సహాయం నిరంతర ప్రక్రియ అని, ఆంధ్రాను ఆదుకోవడంలో జైట్లీ పాత్ర కీలకమని అన్నారు. ప్రత్యేక శ్రద్ధ వలనే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని, ఏపీ అంటే కేంద్రానికి ప్రత్యేక శ్రద్ధ అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశోక్‌గజపతిరాజు, వై.సుజనాచౌదరి, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా కేంద్ర మంత్రి జైట్లీకి  సీఎం చంద్రబాబునాయుడు విజయవాడ గేట్‌వే ¬టల్‌లో విందు ఇచ్చారు.