హోదా ఇవ్వనందుకు నృత్య నిరసన

0
264

సప్పా దుర్గా ప్రసాద్‌ ఆచార్యత్వంలో వినూత్న కార్యక్రమం

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 24 : నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా ఆంధ్రదేశ నాట్య కళాచరిత్రలోనే తొలిసారి 208 మంది నృత్య కళా విద్యార్థులతో డాక్టర్‌ సప్పా దుర్గాప్రసాద్‌ ఆచార్యత్వంలో ఆయన శిష్యులు ఈరోజు శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ‘శాస్త్రీయ నృత్య నిరసన’ నర్తనం చేశారు. విఘ్నేశ్వర, నటరాజ పూజానృత్యాలతో ప్రారంభించి ఆలయనృత్యం, ఆంధ్రనాట్యం, కూచిపూడి, భరతనాట్యం నృత్యాంశాలు నర్తించారు. సప్పా దుర్గాప్రసాద్‌ శిష్యులు, ది వెంకట్రాయ నాట్యబృందం సప్పా యశోదకృష్ణ, శ్రీ కళానృత్యనికేతన్‌ భాస్కరకుమారి, శ్రీప్రసాద్‌ నృత్యనికేతన్‌ క్షీరసాగరిక, విఘ్నేశ నృత్యనికేతన్‌ కోరుపోలు నాగరాజు, డాక్టర్‌ సప్పా రచనలపై పిహెచ్‌డి చేసిన మయుర నృత్య కళాక్షేత్రం డాక్టర్‌ ఆదిమూలం లక్ష్మణరావు, నటరాజ నృత్య నికేతన్‌ విద్యార్థినులు 136 మంది నిరసన నర్తనం చేశారు. ముఖ్య అతిధులుగా ఎంపీ మాగంటి మురళీమోహన్‌, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పాల్గొన్నారు. ఈసందర్భంగా మురళీమోహన్‌ మాట్లాడుతూ ఆరోగ్యం బాగోలేకపోయినా సప్పా దుర్గాప్రసాద్‌ గొప్ప కార్యక్రమం తలపెట్టి 200 మంది శిష్యులతో నర్తన నిరసన తెలిజేయటం గొప్ప విషయమన్నారు. అన్ని ఉన్న అన్నపూర్ణ ఆంధ్రదేశం ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని అడుక్కోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు.ఆంధ్రకళాకారులకు డాక్టర్‌ సప్పా స్ఫూర్తిగా కళోద్యమం సాగాలన్నారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ నిరసనలు శాంతియుతంగా చేయాలన్న స్ఫూర్తి దుర్గాప్రసాద్‌ శిష్యుల ద్వారా నిరూపించారన్నారు. బంద్‌లు, రాస్తారోకోలతో మనల్ని మనమే శిక్షించుకోవడం అవుతుందని, కళారంగం ముందుకొచ్చి దుర్గాప్రసాద్‌లా కళానిరసనలు తెలియజేయాలని, అభంశుభం తెలియని నృత్యంనేర్చుకునే చిన్నారులు అభ్యర్థనతోనైనా కేంద్రం దిగిరావాలని, ఆంధ్రులకు భవిష్యత్‌ తరాలకు మేలు జరగాలన్నారు. సప్పా దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ శాస్త్రీయ నృత్యం కళాకారులు వేదికనూ, శాస్త్రియ నృత్య ప్రదర్శనా ఆహార్యాన్ని, చివరికి అతి ముఖ్యమైన కింకిణులను వదిలి నిరాడంబరంగా ఆంధ్రదేశానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని, కేంద్రప్రభుత్వం మొండివైఖరికి నిరసనగా నిరసన నర్తనం చేస్తున్నారని, ఇలా చేయడం ఆంధ్రదేశ నాట్యచరిత్రలోనే తొలిసారి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here