1, 2, 3, 3, 4, 6….

0
265
మనస్సాక్షి  – 1144
వెంకటేశం అప్పుడే దిగబడ్డాడు. ఆపాటికి గిరీశం గారింట్లోంచి పెద్దగా అరుపులూ, కేకలూ వినపడుతున్నాయి. దాంతో వెంక టేశం కంగారుపడి ‘కొంపదీసి అసెంబ్లీ తాలూకా బ్రాంచేవయినా యిక్కడ పెట్టారా.. అను కుంటూ లోపలికి తొంగిచూశాడు. లోపల అలాంటిదేలేదు గానీ గిరీశం మాత్రం గంతులేస్తున్నాడు. ఎప్పుడూ శాంతంగా ఉండే గిరీశం యిలా కోపంగా గంతు లెయ్యడం ఆశ్చర్యమే. యింతకీ అలా అరుస్తోంది బాబీగాడి మీద..! యింతలోనే గిరీశం ”ముక్కలు ముక్కలు చేసేస్తా నంతే” అంటూ అరిచాడు. దాంతో యింక లాభం లేదని వెంకటేశం లోపలికి ఎంట్రీ యిచ్చేశాడు. ”ఆగండి గురూగారూ.. ఈ నరుక్కోడాలవీ మనకి సూటవ్వవు” అన్నాడు. దాంతో గిరీశం విసు క్కుని ”ఏడ్చినట్టే ఉంది. నేను ముక్కలు చేస్తానంటుంది వీడిని కాదు. వెధవ టీవీని” అన్నాడు. దాంతో వెంకటేశం నాలుక్కరచు కుని ”ఏవయిందీ?” అన్నాడు. అప్పుడు గిరీశం ”ఆ మధ్య నేను కేబుల్‌ కనెక్షన్‌ తీయించేశా. యిప్పుడు వీడు మళ్ళీ కేబుల్‌ పెట్టించమని గొడవ చేస్తున్నాడు” అన్నాడు. ఈలోగా బాబీగాడు ”అవును బాబాయ్‌.. క్రికెట్‌ చూట్టానికి కేబుల్‌ పెట్టించమం టున్నా” అన్నాడు. వెంకటేశం తలూపి ”అయినా బాబీగాడు అడిగిం దాంట్లో తప్పేంటంట?” అన్నాడు. అయినా గిరీశం ఒప్పుకోకుండా ”నీకు తెలీదు. టీవీ చూస్తే ఆ కేశవరావులా అయిపోతానని భయంగా ఉంది” అన్నాడు. వెంకటేశం అర్థంకానట్టుగా ”ఎవరా కేశవరావు? ఏమా కథ?” అన్నాడు. దాంతో గిరీశం జరిగిందంతా చెప్పడం మొదలెట్టాడు…
——
వారం క్రితం.. గిరీశం యింట్లో పేపరు చదువుకుంటుండగా అర్జంటుగా రమ్మని కబురొచ్చింది. యింతకీ  ఆ కబురుచేసింది. వీధి చివరుండే కేశవరావుగారి భార్య మాణిక్యం. దాంతో ఏం కొంపలంటుకుపోయాయా అని గిరీశం పరిగెత్తాడు. గిరీశాన్ని చూడగానే మాణిక్యం బోరుమన్నంత పనిచేసి ”ఆయన పరిస్థితేం బాగాలేదు అన్నయ్యగారూ.. తేడాగా ప్రవర్తిస్తున్నారు” అంది. దాంతో గిరీశం అనుమానంగా ”అంటే కొంపదీసి మందుగానీ కొట్టేస్తు న్నాడా?” అన్నాడు. దాంతో మాణిక్యం నిట్టూర్చి ”ఆ.. ఈయన కంత ధైర్యం ఎక్కడిదిలెండి..” అంది. ఈలోగా గిరీశం గబగబా లోపలికి నడిచాడు. కేశవరావు ఆ గదిలో ఉన్నాడు. గిరీశాన్ని చూడగానే ”1, 1, 2, 4, 5, 6..” అంటూ గట్టిగా అంకెలేవో చెప్పడం మొదలుపెట్టాడు. గిరీశానికి ఈ అంకెల గోలేంటో అస్సలు  అర్థం కాలేదు. ఈలోగా అక్కడకొచ్చిన  మాణిక్యం ”నాలుగురోజుల్నంచీ యిదే వరస అన్నయ్యగారూ.. ఈ అంకెలు తప్ప యింకో మాట మాట్లాడ్డం లేదు” అంది. దాంతో గిరీశం ఆలోచనలోపడ్డాడు. అంతలోనే ”ఈ మధ్య నగలుగానీ, యిల్లు గానీ కొనమని గట్టిగా అడిగావేంటమ్మా?” అంటూ అడిగాడు. దాంతో మాణిక్యం ముక్కు చీది ”ఆ.. అంతదృష్టం కూడానా అన్నయ్యగారూ.. ఎప్పుడూ ఆ దిక్కుమాలిన టీవీ పెట్టుకుని చూస్తుంటారు. మధ్యమధ్యలో అందులో వచ్చే ప్రకటనలవీ పాడుతుంటారు. ‘వాషింగ్‌ పౌడరు నిర్మా..’ లాంటివనుకోండి. నాలుగురోజుల నుంచయితే ఈ అంకెల గోలేదో మొదలెట్టారు” అంది. దాంతో గిరీశం ”మరేం కంగారు పడకమ్మా.. సైకియాట్రిస్ట్‌  ఆనందం మా ఫ్రెండే. ఓసారి వాడితో మాట్లాడతా” అంటూ డాక్టర్‌ ఆనందానికి  ఫోన్‌ చేశాడు. అవతల చెప్పిందంతా విన్న తర్వాత  మాణిక్యంతో ”ఓ నెలపాటు  వీడి చేత టీవీ చూడడం మాన్పించేయమ్మా.. సరిపోతుంది” అన్నాడు. మాణిక్యం తలూపింది. యిక ఆ తర్వాత కేశవరావు టీవీ చూడ్డం మానెయ్యడం, నెమ్మదిగా మామూలవడం జరిగింది.
——
”అదోయ్‌ జరిగింది” అన్నాడు గిరీశం. దాంతో వెంకటేశం అర్థం కానట్టు ”అదేంటి గురూగారూ.. టీవీలో అంత భూతం ఏవుందీ?” అంటూ అడిగాడు. అప్పుడు గిరీశం ”ఆ మధ్య అవేవో నీట్‌ ఫలితాలో, యింకో ఐ.ఐ.టి. ఫలితాలో, రేంకులో వచ్చాయి. దాంతో ఈ కార్పొరేట్‌ కాలేజీల హడావిడి చూడాలి.. తమకొచ్చిన రేంకు లంటూ ప్రకటనలు ఊదరగొట్టేశారు. 1, 1, 2, 4, 4, 5,… అని. అలాంటివి చూసేసరికి మా కేశవరావు లాంటి సగటు పేరెంటు బుర్ర ఏమయి పోతుందని? ‘అయ్య బాబాయ్‌లు.. అంత గొప్ప గొప్ప రేంకులొస్తున్న కాలేజ్‌లో చేర్పిం చకపోతే యింక మా పిల్లోడు ఎందుకూ పనికిరాకుండా పోవచ్చు’ అనిపించొచ్చు. అందుకే మా కేశవరావు అలాంటి విన్యా ాలు చేసింది. రేపేమాపో జేఈఈ ఫలితా లొస్తాయి.  మళ్ళీ ఈ ప్రకటనల గోల మొదలవుతుంది. అందుకే టీవీ వద్దంటున్నా” అన్నాడు. ఆపాటికి వెంకటేశానికి  విషయం అర్థమయి పోయింది. బాబీగాడి వైపు తిరిగి ”నువ్వు క్రికెట్‌ చూసే ఏర్పాటు నేను చేస్తాలే” అంటూ వాడిని తోలేశాడు. తర్వాత గిరీశం వైపు తిరిగి ”అయినా గురూగారూ.. ఈ కాలేజీల వాళ్ళు వందలో ఓ యాభై రేంకులు తమకే వచ్చేసినట్టుగా ప్రకటించేసుకుంటున్నారు. అంతేకాదు. ఒక కాలేజ్‌కి వచ్చిన రేంకులే తమకి వచ్చి నట్టు యితర కాలేజ్‌లూ ప్రకటించేసుకుంటున్నాయి. యిదేం మోసం?” అన్నాడు. దాంతో గిరీశం ”మోసం కాదులే. అశ్వద్ధామ హత: కుంజర” టైప్‌ వ్యవహారం చేస్తున్నారు” అన్నాడు. వెంక టేశానికి అర్థం కాలేదు. ఈలోగా గిరీశం అదెలాగన్నది వివ రంగా చెప్పాడు. అది వింటుంటే వెంకటేశానికి  ఓ బ్రహ్మాండ మయిన ఆలోచన తట్టింది. యింకేం ఆలస్యం చేయకుండా బయటికి నడిచాడు.
——
మర్నాటికల్లా  వెంకటేశం యింటి ముందు ‘వెంకీస్‌ ఐ.ఐ.టి. అకా డమీ అన్న బోర్డు వెలిసింది. అంతేకాదు. ఏదో కొంచెం కొంచెంగా స్టూడెంట్స్‌ వస్తున్నారు. సంవత్సరం గిర్రున తిరగడం, ఐ.ఐ.టి. రిజల్ట్సేవో రావడం జరిగాయి. అప్పుడో విశేషం జరిగింది. వెంకటేశం బ్రహ్మాండమయిన ప్రకటనొకటి విడుదల చేశాడు. ‘ఐ.ఐ.టి ఫలితాల్లో సంచలనం..! ఐ.ఐ.టి. రేంకుల్లో  1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11, 12, 13, 14, 15, 16.. వెంకీ అకాడమీకే..’ యిలా సాగిందది. దాంతో పెద్ద సంచలనమే రేగింది. అసలా అకా డమీ పెట్టిందే కొత్తగా. చేరింది 15 మంది. మరి ఆ పదిహేను మందికీ రేంకులంటే మాటలా… దాంతో మీడియా మొత్తం వాలి పోయింది. ”అసలిది ఎలా సాధ్యం? అదీగాక ఈ రేంకులే తమకి వచ్చినట్టుగా యితర సంస్థలూ ప్రకటించాయి. అంటే మీ రేంకులు అబద్ధమా?” అని అడిగారు. దాంతో వెంకటేశం ”మిగతా వాళ్ళ గొడవ నాకు తెలీదు. మా అన్నపూర్ణమ్మపేటలో ఐ.ఐ.టి. రాసింది 16 మంది. అందులో 15 మంది మా స్టూడెంట్సే. ఒకళ్ళు మాత్రం యింకెక్కడో చదివార్లే. మొత్తానికి  యివన్నీ అన్నపూర్ణమ్మపేట పరంగా రేంకులు” అన్నాడు. దాంతో మీడియా జనాల్లో సగం మంది మూర్చపోయారు.
—–
”అది గురూగారూ.. నాకలాంటి కలొచ్చింది” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం ”అవునోయ్‌.. ప్రస్తుత విద్యా వ్యవస్థ యిలాగే  తగ లడింది. మన సృష్టి అంతా ఆ నారాయణుడి చైతన్యం ఉన్నట్టుగా మన విద్యావ్యవస్థలో కూడా నారాయణ – చైతన్యం ఎక్కువయి పోయింది. ఏదయినా ఫలితాలు రావడం పాపం.. అదేదో పూనకం వచ్చినట్టుగా 1, 2, 3, 4 అంటూ పొలికేకలు పెడతారు.. అదే.. ప్రకటనలు యిస్తారు. తీరా చూస్తే ఆ ఒకే రేంకులేవో రెండు మూడు సంస్థలకి వచ్చేస్తాయి. వాటి గురించి ఆరా తీస్తే నీ కలలో లాంటి రహస్యాలేవో బయటపడతాయి. చివరిగా చెప్పేదేం టంటే.. పేరెంట్స్‌ని ప్రకటనలతో ఊదరగొట్టి తమ స్థాయికి  మించి పిల్లల్ని తమ సంస్థలో జాయినయ్యేలా చేయడం, ఆ తర్వాత రేంకుల కోసం పిల్లల్ని ఒత్తిడికి గురిచేయడం, కొన్నిసార్లు వాళ్ళ ఆత్మహత్యలకి దారితీయడం.. యిదీ వాళ్ళ తీరు. యిది మంచి పరిణామమా? అంతా ఆలోచించాలి” అన్నాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here