10 శాతం మంది బతకడానికే రోజులు ఈడుస్తున్న దేశం

0
106
(నవీనమ్‌)
పదకొండేళ్ల కనిష్ఠస్థాయికి పతనమై ఆందోళనపరుస్తున్న భారత వ ద్ధిరేటు ఇకమీదట ‘అనుకూల వాతావరణంలో’ పుంజుకొని ఆరున్నర శాతం దాకా ప్రగతిని నమోదు చేయగలదని తాజా ఆర్థిక సర్వే నమ్మకంగా చెబుతోంది.  2018-19లో వృద్ధిరేటు ఏడున్నర శాతం వరకు ఉండగలదని రెండేళ్లక్రితం ఆర్థిక సర్వే ఊహించగా, వాస్తవంలో అది 6.8 శాతానికి పరిమితమైంది. దేశ వృద్ధిరేటు ఏడు శాతానికి తగ్గబోదంటూ ఆరు నెలలక్రితం పలికిన జోస్యమూ వట్టిపోయి ఇటీవల 4.8 శాతం మేర నమోదైన అంచనాలు దిమ్మెరపరచాయి. చూడబోతే, ఈ ఆర్థిక సంవత్సరాంతానికి పరిస్థితి తేటపడి వృద్ధి జోరందుకుంటుందన్న కేంద్ర గణాంక సంస్థ ఆశావహ బాణీనే ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ బృందం పుణికి పుచ్చుకొన్నట్లు ప్రస్ఫుటమవుతోంది. మౌలిక జాడ్యాల పీడ విరగడ అయినప్పుడే వృద్ధి చురుకందుకుంటుందనడంలో మరోమాట లేదు. ఆ వసతుల పద్దు కింద 2024-25నాటికి భారత్‌ అధమ పక్షం 1.4లక్షలకోట్ల డాలర్లు (రూ.100లక్షల కోట్లు) వ్యయీకరించాల్సి ఉంటుందన్న ఆర్థిక సర్వే, పెట్టుబడుల ఉపసంహరణకు గట్టిగా ఓటేసింది. అది ద్రవ్యలోటు విషయంలో కొంత సడలింపు అవసరమనడం- బడ్జెట్‌ సరళికి ముందస్తు సూచికగా ద్యోతకమవుతోంది. ప్రస్తుత ద్రవ్య నియంత్రణ విధానం ప్రకారం ద్రవ్య లోటును స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో మూడు శాతానికి కట్టడి చేయాలన్నది తొలుత నిర్దేశించుకున్న లక్ష్యం. దాన్ని అరశాతం మేర సడలించినా, పన్నుల రాబడి కుంగి కటకటలాడుతున్న సర్కారుకు అదనంగా రూ.1.13లక్షలకోట్ల మేర ఖర్చు చేయగల వెసులుబాటు లభిస్తుందన్నకథనాలువినిపిస్తున్నాయి. అటువైపు కేంద్రం మొగ్గును ఆర్థిక సర్వే ప్రతిఫలిస్తున్న నేపథ్యంలో, రాష్ట్రాలూ తమ సంగతేమిటని గళమెత్తితే- ద్రవ్య నియంత్రణ నిబంధనావళి ఏం కావాలి? ఉచితాలు ఆర్థిక వ్యవస్థకు నష్టదాయకమని, మాఫీలు రుణ వ్యవస్థను దెబ్బతీస్తాయని సర్వే యథార్థం వెల్లడించింది. సత్తువ కోల్పోయిన సాగు రంగానికి బాసట పేరిట అమలుపరుస్తున్న ఉచిత విద్యుత్‌, రుణమాఫీల వంటి తాయిలాలు రైతాంగం కడగండ్లను బాపడంలో విఫలమవుతుండటం నడుస్తున్న చరిత్ర.  సగటు అన్నదాత దురవస్థను సర్వే చెప్పకనే చెప్పిన దరిమిలా, బడ్జెట్లో విత్తమంత్రి ఏపాటి ఔదార్యం కనబరుస్తారో ఏమో ! 2011-12 లగాయతు ఏడేళ్లలో 2.62 కోట్ల ఉద్యోగాల సృష్టి జరిగిందని ముక్తాయించిన ఆర్థిక సర్వే, ఎగుమతులపై దృష్టిపెడితే 2030నాటికి ఎనిమిది కోట్ల ఉపాధి అవకాశాలు సాధ్యమేనంటోంది. లోగడ ముఖ్య ఆర్థిక సలహాదారు హోదాలో అరవింద్‌ సుబ్రమణియన్‌ ‘ఉపాధి రహిత వృద్ధి’పై ఆందోళన చెందినా ఎంత మాత్రం స్పందించని సర్కారు- నాలుగున్నర దశాబ్దాల గరిష్ఠానికి చేరి నిరుద్యోగిత హడలెత్తిస్తున్న తరుణంలో సత్వర చర్యలకు నడుం బిగించాల్సి ఉంది.  గ్రామీణ పరిశ్రమలు, విద్య, ఐటీ రంగాల్ని పరిపుష్టం చేసి సేద్యానికి జవసత్వాలు సంతరింపజేస్తే ఉపాధి అవకాశాలు ఊపందుకుంటాయి. సంపద సృష్టిని, అయిదు లక్షల కోట్ల డాలర్ల వ్యవస్థ కలను ప్రత్యేకంగా ఉటంకించిన ఆర్థిక సర్వే- ‘చైనా నమూనా’కు వత్తాసు పలకడం విశేషం. భారత్‌నుంచి ఎగుమతులకన్నా వెలుపలి దేశాలనుంచి ఇక్కడికి దిగుమతులే అధికమన్న సర్వే స్పష్టీకరణ, దీర్ఘకాలిక దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను సూచిస్తోంది.  దిల్లీలో పిస్తోలు లాంటి మారణాయుధం సొంతం చేసుకోవడానికి సమర్పించాల్సిన పత్రాల సంఖ్యతో పోలిస్తే- పదిమందికి ఉపాధి కల్పించే రెస్టారెంట్‌ ప్రారంభించడానికి ఇవ్వాల్సినవి రెండింతల కన్నా ఎక్కువ. వాణిజ్య అనుకూలాంశాల సూచీలో నిరంతర పురోగతిని లక్షిస్తున్నామంటున్న ప్రభుత్వం క్షేత్రస్థాయి స్థితిగతుల్లో మెరుగుదలపై దృష్టి కేంద్రీకరించడం తక్షణావసరం. ‘భారత్‌లో తయారీ’కి, సూక్ష్మ సంస్థలకు ఊతంపట్ల సహేతుకంగా స్పందించిన సర్వే- వ్యవస్థాగత పరపతి సన్నగిల్లిందనీ నిష్ఠురసత్యం పలికింది. ఆ మేరకు కంతల్ని ఎలా పూడ్చదలచారో నేటి బడ్జెటే బదులివ్వాలి! ఆకలికి మించిన అవమానం మరొకటి లేదని, అభివృద్ధి ప్రక్రియలో పేదలు భాగస్వాములైతేనే నిజమైన పురోగతి సుసాధ్యమని రాష్ట్రపతిగా ప్రణబ్‌ ముఖర్జీ లోగడ చెప్పింది అక్షర సత్యం. జాతీయ తలసరి ఆదాయ సగటును అందుకోలేక కొన్ని రాష్ట్రాలు నేటికీ కిందుమీదులవుతుండగా, ‘తాలినామిక్స్‌’ పేరుతో- ప్లేటు భోజనం కొనుగోలులో సామాన్యుల ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడిందన్న సర్వే సూత్రీకరణ…. క్రూర పరిహాసం.  వస్తు సేవలకు ప్రజలు పెట్టే ఖర్చు తెగ్గోసుకుపోయి గిరాకీ సన్నగిల్లడం ప్రస్తుత మాంద్యానికి ఆజ్యం పోసిన అంశాల్లో ప్రధానమైందన్న వాస్తవం, సర్వే రూపకర్తలకు పరగడుపున పడిపోయినట్లుంది! గత్యంతరం లేక దొరికిన ఏదో ఒక పని చేసి రోజులీడుస్తున్న విద్యావంతుల సంఖ్య దేశంలో భారీగానే ఉందని గతంలో ‘నీతి ఆయోగ్‌’ స్వయంగా అంగీకరించింది.  ప్రపంచ మానవాభివృద్ధి నివేదిక సంచాలకులు ఆ మధ్య వ్యాఖ్యానించినట్లు- దేశ దేశాల్లో ఆర్థిక సామాజిక పర్యావరణపరంగా రూపాంతరీకరణ దశలో అసమానతల తీరు తెన్నుల్ని సక్రమంగా అర్థం చేసుకున్నప్పుడే సరైన విధాన రచన సాధ్యపడుతుంది.  తాజా ఆర్థిక సర్వేలో ఆ పార్శ్వం కనుమరుగైంది! జనాభాలో పదిశాతం (13.6 కోట్లమంది) అత్యంత నిరుపేదలు అనునిత్యం బతుకు పోరాటం చేస్తున్న దేశం మనది. పెచ్చరిల్లుతున్న అసమానతల చిచ్చు- అన్నింటా అందరికీ సమన్యాయం, సమధర్మాలకు ఎత్తుపీట వేయాలన్న రాజ్యాంగ స్ఫూర్తిని కబళిస్తోంది. అంతర్జాతీయ పోటీతత్వ సూచీలో 69వ స్థానానికి పడిపోయిన భారత్‌, 189 దేశాల మానవాభివృద్ధి జాబితాలో నూట ముప్ఫయ్యో స్థానాన అలమటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here