100 గంటలపాటు నిర్విరామంగా శాస్త్రీయ నృత్యోత్సవం

0
167
రాజమహేంద్రవరంలో  6న ఆరంభం
రాజమహేంద్రవరం,నవంబర్‌ 5 : నగరంలోని శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో నవంబర్‌ 6వ తేదీ నుంచి 100గంటలపాటు నిర్విరామంగా భారతీయ సనాతన శాస్త్రీయ నృత్యోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన కమిటీకి చెందిన  వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీజీసీ మెంబర్‌ జక్కంపూడి విజయలక్ష్మి చెప్పారు. నాట్యాచార్య ఆచంట చంద్రశేఖర్‌,నాట్యాచార్య లంకా సతీష్‌ కుమార్‌ ,లెక్చరర్‌ పివిబి సంజీవరావు,మాజీ కార్పొరేటర్‌ బొంతా శ్రీహరి,తదితరులతో కల్సి  ప్రెస్‌క్లబ్‌లో ఈ ఉదయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో పేరిణి నృత్యం ఉండేదని, కాకతీయుల కాలం నాటినుంచి వస్తున్న ఈ నృత్యాన్ని తెలంగాణా ప్రభుత్వం అధికారిక నృత్యంగా చేసిందని,అయితే ఇక్కడ కూడా పేరిణి నృత్యం నేర్చుకున్న ఆచంట చంద్రశేఖర్‌ లాంటి వాళ్ళు ఉన్నారని ఆమె వివరించారు. ఏపీలో కూచిపూడి,భరతనాట్యం ఉన్నాయని అయితే అన్ని నృత్యరీతుల సమాహారంగా భారతీయ సనాతన శాస్త్రీయ నృత్యోత్సవం తలపెట్టారని చెప్పారు. ఉచిత నృత్య శిబిరం పెట్టి నృత్యంపై ఆసక్తి గలవారికి నేర్పించడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు. కళాప్రియ నృత్య కళాక్షేత్రం నాట్యాచార్య ఆచంట చంద్రశేఖర్‌ మాట్లాడుతూ దేశం నలుమూలల నుంచి వివిధ నృత్య రీతులకు చెందిన వెయ్యిమంది నాట్య కళాకారులు హాజరవుతారని చెప్పారు. ఆరవ తేదీ ఉదయం నుంచి 10వ తేదీ రాత్రి వరకూ నిర్విరామంగా 100గంటల పాటు నృత్యోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కూచిపూడి,భరతనాట్యం, పేరిణి,ఆంధ్ర నాట్యం, జానపదం, ఒడిసి,తదితర నృత్య రీతులు ఇందులో ప్రదర్శిస్తారని వివరించారు. 6వ తేదీ ఉదయం 6గంటలకు జక్కంపూడి విజయలక్ష్మి,నగరపాలక సంస్థ కమీషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ జ్యోతి ప్రజ్వలన చేస్తారని, అనంతరం కళాప్రియ కళాక్షేత్రం శిష్య బృందం నిర్విరామ నృత్య ప్రారంభ పూజ ఉంటుందని తెలిపారు. అనంతరం నాట్య గురువులు, శిష్య బృందాలు నృత్య ప్రదర్శనలు ఉంటాయని వివరించారు.  10వ తేదీ రాత్రి 11గంటల వరకూ 100గంటల పాటు సాగే ఈ నృత్యోత్సవంలో అతిధులుగా మంత్రులు,ఎమ్మెల్యేలు, వివిధ రంగాల  ప్రముఖులు, అధికారులు పాల్గొంటారని  చంద్రశేఖర్‌ తెలిపారు. నాట్య గురువులకు సత్కారాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనీ కోరారు. పివిబి సంజీవరావు మాట్లాడుతూ అడుగులు రెండయినా నాట్య రీతులు ఎన్నో ఉన్నాయని, అన్నింటి సమాహారంగా ఈ నృత్యోత్సవం జరుగుతోందని చెప్పారు. లంకా సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనీ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here