అడుక్కోకుండా ఉండాలంటే అమ్మ పెట్టాలి !

0
650

మనస్సాక్షి – 1072

గిరీశానికి నోరెప్పుడూ ఖాళీగా ఉండదు. మెలకువగా ఉన్నంతసేపూ సగం సేపు నోట్లో ఆ చుట్టేదో గుప్పుగుప్పుమనిపిస్తే, మిగతా సగంసేపూ ‘నాతో మాట్లాడ్డవే ఓ ఎడ్యుకేషను’ టైపు కబుర్లు జోరుగా చెబుతుంటాడు. అలాంటి గిరీశానికి ఆ రోజో షాక్‌ తగిలింది. అదీ ప్రియ శిష్యుడు వెంకటేశం నుంచే…! అసలయితే ఉద యాన్నే వెంకటేశం ఫోన్‌ చేసి ”యిదిగో గురూగారూ… ఎనిమిదేళ్ళ నుంచి మీ దగ్గర శిష్యరికం చేస్తున్నా ఆ చుట్ట పొగేదో వొంటికి పట్టడం తప్ప నాకు వొరిగిం దేమీ లేదు. ఎంతసేపూ కబుర్లే తప్ప నాకు చిన్న దారి కూడా చూపించడం లేదు. అందుకే నేను మనూరుపోయి వ్యవసాయం చేసుకుందామను కుంటున్నా” అన్నాడు. దాంతో షాక్‌ తిన్న గిరీశం ”అదేంటోయ్‌ మైడియర్‌ వెంకటేశం… యిదేనా నువ్వు నన్ను అర్థం చేసు కున్నది?.. సరే.. యిప్పుడేరా. నా దగ్గరో ట్రంప్‌కార్డ్‌ ఉంది. దాన్ని ఉపయోగిస్తా. అప్పుడు నేనంటే ఏంటో తెలుస్తుంది” అన్నాడు. దాంతో వెంకటేశం హుషారుగా ఫోన్‌ పెట్టేసి, యింకో పది నిమి షాల్లో గిరీశం దగ్గర వాలిపోయాడు. వెంకటేశం వచ్చీ రాగానే గిరీశం ఎవరికో ఫోన్‌ చేశాడు. అవతల ఫోనెత్తగానే స్పీకర్‌ ఆన్‌ చేసి మరీ మాట్లాడటం మొదలెట్టాడు. ”రేయ్‌ జనార్ధన్‌ నేన్రా..” అన్నాడు. గిరీశం గొంతు వినేసరికి అవతల లైన్లో ఉన్న జనార్ధన్‌.. హోర్ని నువ్వా.. ఈ మధ్యసలు ఫోను కూడా చేయడం లేదేంటీ…” అన్నాడు. దానికి గిరీశం ”ఆ… నువ్వేమో మంచి పొజిషన్లో ఉన్నావు. అస్తమానూ ఫోన్‌ చేసి యిబ్బందిపెట్టడం ఎందుకనీ..” అన్నాడు. దాంతో జనార్ధన్‌ నిష్టూరంగా ”అదంతా మిగతా వాళ్ళకిరా. నీకు అడ్డేముందని… సరే… యింతకీ విషయమేంటో చెప్పు” అన్నాడు. అప్పుడు గిరీశం ”మరేంలేదురా… మావాడొకడున్నాడు. బాగా చదువు కున్నోడూ, వందర కాలుగా ఆలోచించే తెలివయిన వాడూలే. నువ్వే ఏదోలా మీ బాస్‌తో మాట్లాడి వాడికో దారి చూపించాలి” అన్నాడు. దానికి అవతల్నుంచి జనార్ధన్‌ ”దానికంత యిదిగా చెప్పాలా… వెంటనే పంపించు. నేను చూసుకుంటా” అన్నాడు. తర్వాత యింకొంచెంసేపు మాటలయ్యాక ఫోన్‌ పెట్టేశాడు. యిదంతా బయటికి వినిపిస్తూనే ఉంది. అంతా వింటున్న వెంకటేశంలో ఆత్రం, ఆనందం పెరిగిపోయాయి. ఆ ఫోనేదో పెట్టిన వెంటనే ”యింతకీ అవతల ఎవరూ గురూగారూ…” అనడిగాడు. యింతలో గిరీశం యింకో చుట్ట అంటించుకుని ”యింకెవరూ… మన సీఎం గారి పియ్యే జనార్ధన్‌” అన్నాడు. దాంతో వెంకటేశం నోరెళ్ళబెట్టాడు.

అఅఅఅ

మర్నాడు ఉదయానికల్లా వెంకటేశం కాస్తా జనార్ధన్‌ దగ్గర వాలి పోయాడు. జనార్ధన్‌ కూడా వెంకటేశాన్ని బాగా రిసీవ్‌ చేసుకు న్నాడు. ”రావోయ్‌… నీ గురించి గిరీశం అంతా చెప్పాడు. నీకు సీఎం గారి దగ్గర ఓ పదినిమిషాలు టైమ్‌ యిప్పిస్తా. నువ్వు చెప్ప దలుచుకున్నదేదో సూటిగా చెప్పెయ్‌” అన్నాడు. వెంకటేశం అలాగే అన్నట్టుగా తలూపాడు. అంతేకాదు. ఆరోజు రాత్రి ఏడూ యిరవైకి సీఎం బాబు గారి దగ్గరకి తీసుకెళ్ళాడు. అంతకు ముందే జనార్ధన్‌ చెప్పాడేమో బాబు కూడా సూటిగా ”రావోయ్‌రా.. నీ గురించి జనార్ధన్‌ చెప్పాడులే. సరే… విషయం సూటిగా మాట్లా డేసుకుందాం. నా దగ్గర సలహాలిచ్చేవాళ్ళు చాలా మందే ఉన్నారు. నా సమస్యల్లా లోటు బడ్జెట్‌. వ్యయంతో పోలిస్తే ఆదాయ వనరులు తక్కువగా ఉన్నాయి. ఆ ఆదాయం ఏదో పెంచి బడ్జెట్‌లో లోటు తగ్గేలా చేయాలి. ఆ పరంగా ఏదయినా సలహా యివ్వగలనా?” అన్నాడు. వెంకటేశం తలూపి ”తప్ప కుండా చేయొచ్చుసార్‌..” అన్నాడు. ఈసారి ఆశ్చర్యపోవడం బాబు వంతయింది. యింతలో వెంకటేశం వివరంగా చెప్పడం మొద లెట్టాడు. ”యిప్పుడు మనం మహారాష్ట్ర మోడల్‌ని ఫాలో అవ్వాలి” అన్నాడు. దాంతో బాబు ఆశ్చర్యంగా ”గుజరాత్‌ మోడల్‌ తెలుసు కానీ ఈ మహారాష్ట్ర మోడల్‌ ఏంటంట?” అన్నాడు. అప్పుడు వెంకటేశం యింకొంచెం వివరంగా చెప్పడం మొదలుపెట్టాడు. ”అర్జెంటుగా అడ్డదారిలో ఆదాయం వచ్చే దారి యిదే సార్‌… మహారాష్ట్రలో సంవత్సరం క్రితమే యిది మొదలయింది. యిప్పుడింకా గట్టిగా బిగిం చేశారు. దాంతో ఎడాపెడా ఆదాయం వచ్చి పడిపోతోంది. అక్కడ బహిరంగంగా మల విసర్జన చేస్తే 500, మూత్ర విసర్జన చేస్తే 200, రోడ్డుమీద ఉమ్మివేస్తే 100 నుంచి 150… యిలా రకరకాలుగా ఫెనాల్టీలు ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. యిదేదో అచ్చంగా మనం అమలులో పెట్టేస్తే దానికి పదిరెట్లు ఆదాయం గ్యారంటీ” అన్నాడు. అంత ఆదాయం వస్తుందా అన్న భావం బాబులో కని పించింది. వెంకటేశం కొనసాగిస్తూ ”ఈ ప్రాజెక్ట్‌ సక్సెస్‌ చేయడానికి మనం పోలీసుల సాయం తీసుకోవాలి. యింకా అవసర మయితే టీచర్స్‌లాంటి ఉద్యోగులు పౌరుల సాయమూ తీసు కోవాలి. వచ్చే ఆదాయంలో నాలుగో వంతు వాళ్ళకి యిన్సెం టివ్‌గా యిచ్చేస్తే యిక ప్రాజెక్ట్‌ బ్రహ్మాండంగా సక్సెస్‌ అవుతుంది” అన్నాడు. అంతా వినేసరికి బాబు అయితే లేచొచ్చి వెంకటేశాన్ని కౌగలించుకున్నంత పనిచేశాడు. అంతేకాదు. ఆ మర్నాడే ఆ ప్రాజెక్టేదో అమల్లోకి వచ్చేసింది.

అఅఅఅ

మూడునెలల తర్వాత… ఆరోజక్కడో సమీక్షా సమావేశం జరుగుతోంది. అందులో పాల్గొంటున్నది సీఎం, రెవెన్యూమంత్రి, వివిధ ప్రాంతాల పోలీస్‌ ఆఫీసర్లు, యింకా వెంకటేశం..! యింతలోనే బాబు మాట్లాడడం మొదలుపెట్టాడు. ”ఆదాయ వనరులు పెంచుకునే భాగంగా మనం చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌ సూపర్‌ సక్సెస్‌ అయింది. అసలు వచ్చిన రెవెన్యూని చూస్తే మతి పోతోంది. యింతస్థాయిలో రెవెన్యూ వస్తుందని ఊహించనే లేదు. యిదే తరహా ప్రాజెక్ట్‌ మహారాష్ట్రలో అమల్లో ఉన్నా వాళ్ళకొచ్చే ఆదాయం కంటే మనకొచ్చిన ఆదాయం దాదాపు 12 రెట్లు అధి కంగా ఉంది” అన్నాడు. అంతా ఆసక్తిగా వింటున్నారు. యింత లోనే ఆ సమావేశంలో ఉన్న పైస్థాయి అధికారొకరు లేచి కుతూ హలంగా ”సార్‌… అంటే దానర్ధం మన జనాలు మరీ అంత గలీజు గాళ్ళనా?” అన్నాడు. ఆ ప్రశ్నకి అక్కడ చిన్నపాటి కలకలం రేగింది. యింతలో బాబు దానికి సమాధానం చెప్పడం మొదలెట్టాడు.

అఅఅఅ

”అది గురూగారూ… నాకొచ్చిన కల. చివర్లో బాబుగారు ఏం శెల విచ్చారో తెలీడం లేదు” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం ”ఏవుందోయ్‌… యింటెన్సివ్‌లు భారీగా ప్రకటించడంతో ఈ ఆఫీసర్లు బోల్డంత శ్రద్ధ చూపి ఈ గలీజు చేసే జనాల దగ్గర ముక్కు పిండి పెనాల్టీలు వసూలు చేయొచ్చనేది వాస్తవమే. అయితే అంతకుమించిన విశేషం ఏంటంటే… మహారాష్ట్రలో హైవేలోగానీ, యింకెక్కడైనా గానీ ప్రతీ కిలోమీటరుకీ సులభ్‌ కాంప్లెక్స్‌ ఉంటుంది. అక్కడితో పోలిస్తే మనకి హైవే మొత్తంలో కూడా ఎక్కడా సులభ్‌ కాంప్లెక్స్‌లు కనిపించవు. దాంతో దూర ప్రయాణం చేసేటప్పుడు మగవారైతే ఏదో రోడ్డు పక్కన కానిచ్చేస్తుంటారు. అయితే అదే ఆడవాళ్ళు చాలా యిబ్బందులు పడవలసి వస్తుంది. ఏతావాతా చెప్పేదేంటంటే ఏదయినా సమస్యకి పరిష్కారం అనేది ప్రత్యామ్నాయం చూపించకుండా చేయకూడదు. అమ్మ పెట్టినప్పుడే అడుక్కుతినడం మానగలిగేది. అప్పుడే సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది. అప్పుడే నిజమైన స్వచ్ఛాంధ్రనో, స్వచ్ఛ భారతో ఏర్పడేది” అంటూ వివరించాడు.

– డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here