0
518

ఎదురుతిరిగితే మోదీ దాడే
(శనివారం నవీనమ్)

పన్నులు, ఎన్ ఫోర్స్ మెంట్, దర్యాప్తు సంస్థల అధికారులకు కొన్ని అధికారాలు ఉంటాయి. చట్టబద్ధంగా వారు పని చేస్తున్నంత వరకు ఎవరూ తప్పు పట్టరు. అలా కాకుండా పాలకుల ఏజెంట్లుగా మారితే ప్రశ్నించకమానరు. స్వప్రయోజనాలకోసం మోదీ ప్రభుత్వం పెంపుడు జంతవులుగా మారి వెన్నెముక పూర్తిగా విరిగిపోయిన యంత్రాంగం ఇపుడు ఇలాంటి ప్రశ్నలనే ఎదుర్కొంటున్నది. నవ్వులపాలైపోతున్నది. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించడమే లక్ష్యంగా రాజ్యాంగబద్ధ సంస్థలను, దర్యాప్తు ఏజెన్సీలను నరేంద్ర మోడీ సర్కారు ఉసిగొల్పుతున్న తీరు విస్మయాన్ని కలిగిస్తోంది.

ప్రశ్నించే వారిపై దాడులు చేయడం, పోలీసుల చేత తప్పుడు కేసులు బనాయించడం, అదీ కుదరకపోతే సిబిఐ, ఇడి, ఐటిలను ఉపయోగించి వేధించడం వంటి చర్యలు మోడీ పాలనలో సాధారణ అంశాలుగా మారాయి.

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఎన్నోసార్లు ఇదేం ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రధానమంత్రిగా అవే విధానాలను మరింత దుర్మార్గంగా అమలు చేయడం ద్వారా ప్రజల గొంతును నిర్దాక్షిణ్యంగా నొక్కుతున్నారు. మోడీ పాలన కాస్తా దాడుల, సోదాల రాజ్యంగా మారిపోయింది.

అవినీతిని అంతమొందించడానికి, నల్లధనాన్ని వెలికితీయడానికి దాడులు చేస్తున్నామంటూ చెప్పే మాటలే నిజమైతే ఈ నాలుగున్నరేళ్ల పాలనలో ఎంతమంది బిజెపి నేతలపై దాడులు జరిగాయన్న ప్రశ్నకు సమాధానం ఉందా? బిజెపిలో ఉన్న నాయకులు, వాణిజ్య, పారిశ్రామికవేత్తలందరూ మచ్చలేలేని సచ్చీలురా? వీరిలో ఎంతమందిపై దాడులు చేయించారు? ఎంత అక్రమ సంపాదనను వెలికితీశారు.. చెప్పగలరా?

లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టిన మాల్యా పార్లమెంటులో ఆర్థికశాఖా మంత్రిని కలిసిన తరువాతే విదేశాలకు ఉడాయించానని స్వయంగా ప్రకటించిన తరువాత కూడా ఆ మంత్రిని ఒక్క దర్యాప్తు సంస్థ కూడా ఎందుకు ప్రశ్నించలేదు? కాగితాల మీదే ఇంకా పుట్టని రిలయన్స్‌ విద్యాసంస్థకు అత్యున్నత శ్రేణిలో గుర్తింపు, భారీ మొత్తంలో రాయితీలు లభించినప్పుడైనా ‘నాకింత-నీకింత’ లాలూచీ ఐటి, ఇడి అధికారులకు కనడపలేదా?

అత్యున్నత పదవిలో ఉన్న వారి సంగతి సరే..అంబానీ వంటి వారి ఇంటి గడప తొక్కగలరా?
ఏటికేడాది ఆకాశానికెగుస్తున్న వారి ఆస్తుల లెక్కలన్నీ ఖచ్చితాలేనా? ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడే ఐటి, ఇడి, సిబిఐ అధికారులు రాబందుల్లా వాలిపోవడమేంటి? బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, తాజాగా తెలంగాణ రాష్ట్రాల అనుభవాలు గమనిస్తూంటే అవి మోడీ సర్కారు జేబు సంస్థలుగా అవి మారిపోయాయని రోజూ పేపర్ చదివేవారికి అర్ధమైపోవడం లేదా? బిజెపితో కలసి వున్నంతకాలం తెలుగుదేశం పార్టీ నేతలపై ఒక్క ఐటి దాడి కూడా జరగలేదెందుకు? బిజెపి పార్టీతో అంటకాగినన్నాళ్లు వారి ఆర్థిక లావాదేవీలన్నీ పారదర్శకంగా, నిజాయితీగా ఉన్నాయా? కాదని ప్రశ్నిస్తే ఐటి, ఇడి సిబ్బందితో మూక దాడులు చేయిస్తారా? ఇది కక్ష సాధింపేనని తెలుగుదేశం పార్టీ మాత్రమే కాక ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నించడంలోతప్పుందా?

పాలకులు మారిపోతారు… ప్రభుత్వం శాశ్వతం…ప్రభుత్వ యంత్రాంగం శాశ్వతం…అధికారులు ఇది మరువకూడదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here