2న ప్రత్యేక హోదా కోసం విద్యార్ధి పొలికేక

0
370

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 30 : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం వచ్చేనెల 2వ తేదీన రాజమండ్రి ప్రొటస్టింగ్‌ స్టూడెంట్‌ ఫోర్స్‌ (ఆర్‌పిఎస్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో కోటగుమ్మం సెంటర్‌ వద్ద విద్యార్ధి పొలికేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ సంఘం జాతీయ కార్యదర్శి కె.హారిక తెలిపారు. హోదా కోసం రాష్ట్రం రగులుతోందని, దీనిపై విద్యార్ధులందరూ కలిసి రాజకీయాలకతీతంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టారని పేర్కొన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ పోరాటంలో ప్రతి ఇంటి నుంచి ఒక విద్యార్ధి బయటకు రావాలని కోరారు. వచ్చేనెల 2న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తారని, ప్రత్యేక హోదా రాకపోతే విద్యార్ధులకు వచ్చే కష్టాలను వివరిస్తూ ఈ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. బీసీ విద్యార్ధి సంఘం జాతీయ అధ్యక్షులు మరుకుర్తి దుర్గా యాదవ్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏపీపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని, తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారన్నారు. కేంద్రం మెడలు వంచే విధంగా విద్యార్ధులలో చైతన్యం తేవడానికి ఆర్‌పిఎస్‌ఎఫ్‌ మంచి కార్యక్రమాన్ని తలపెట్టిందని, ఈ కార్యక్రమాన్ని విద్యార్ధి లోకం జయప్రదం చేయాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పవన్‌ మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఈ ఉద్యమానికి ఎస్‌ఎఫ్‌ఐ మద్దతు తెలుపుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధి పొలికేక గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ నాయకులు షేక్‌ సుభాన్‌వల్లీ, నగర యువజన కాంగ్రెస్‌ నాయకులు భేరి మోహిత్‌, ఆర్‌పిఎస్‌ఎఫ్‌ ప్రతినిధి రషీద్‌, కొల్లివెలసి మనీషా, మణికంఠారెడ్డి, సూర్య, నితిన్‌, సురేంద్ర పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here