2 నుంచి చందన యాత్ర మహోత్సవాలు

0
117
4న నిజరూప దర్శనం – ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యాన విస్తృత ఏర్పాట్లు
రాజమహేంద్రవరం,జనవరి31 : స్ధానిక సింహాచలనగర్‌లోని శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి క్షేత్రం (శ్రీరంగం శ్రీ మధు ఉభయ వేదాంతాచార్య పీఠం ట్రస్ట్‌ఆధ్వర్యాన)లో వార్షిక చందన యాత్ర మహోత్సవాలు ఫిబ్రవరి 2నుంచి  ప్రారంభమవుతున్నాయి. వచ్చే నెల  6వ తేదీ వరకూ జరిగే ఈ ఉత్సవాల నేపథ్యంలో   ఆలయ ధర్మకర్తలు కాలెపు సూర్య సింహాచలం,కాలెపు నాగేశ్వరరావులతో కల్సి ఆలయ అర్చకులు కందాళం వెంకట లక్ష్మీ నరసింహాచార్యులు ఈరోజు ఉదయం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  2వ తేదీ ఆదివారం సా. 4 గంటలకు తిరువీధి ఉత్సవం(గరుడ సేవ) క్వారీ ఏరియా, కంబాలచెరువు, దేవీచౌక్‌ ,లక్ష్మీవారపు పేట కోటగుమ్మం,మెయిన్‌ రోడ్డు, మంగళవారపు పేట మీదుగా తిరిగి సింహాచలనగర్‌కి చేరుతుందని వివరించారు. శ్రీమాన్‌ మోర్త సీతారామాచార్యులు, శ్రీమాన్‌ గొడవర్తి రాధాకృష్ణమాచార్యులు, శ్రీ  ఎస్‌.పి. రంగరాజ భట్టర్‌ స్వామి వారి ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజతో కార్యక్రమాలు ప్రారంభిస్తారని తెలిపారు. 3వ తేదీ సోమవారం ఉదయం ఆరాధన, నవకలశస్నపనం, హోమాలు, సాయంత్రం ఎదురు సన్నాహం, తిరుకల్యాణ మహోత్సవం, మూర్తి కలశారాధన ఉంటాయన్నారు.   4వ తేదీ  మాఘ శుద్ధ దశమి మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం, ఆరాధన, చందనోత్తరణ, సువర్ణ పుష్పార్చన,  ఉ. 6 నుంచి సా.6గంటల వరకూ నిజ రూప దర్శన సేవ ఉంటుందన్నారు.  ఆరోజు రాత్రి 8 గంటలకు స్వామివారికి  సహస్ర ఘటాభిషేకం, రాత్రి 9 గంటలకు చందన సమర్పణ, తీర్ధగోష్టి, రుత్విక్‌ సన్మానం, ఆశీర్వచనం,  5వ తేదీ శనివారం ఉదయం ఆరాధన, హోమాలు, నిత్యరూప దర్శనం తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 6వ తేదీ ఉ. 10 నుంచి శ్రీవారి ప్రసాదం, తదియారాధన (అన్న సమారాధన) జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాల్లో భక్తజనులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.స్వామివారికి చందనం సమర్పించేవారు ఆలయంలోని కార్యాలయం దగ్గర సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ఇప్పటికే విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తుల దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here